Sep 13,2023 17:12

న్యూఢిల్లీ :  పార్లమెంట్‌ సమావేశాలకు ఒక రోజు ముందు సెప్టెంబర్‌ 17న అఖిల పక్ష సమావేశానికి కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి బుధవారం ఎక్స్‌ (ట్విటర్‌)లో పేర్కొన్నారు. సమావేశానికి సంబంధించి అన్ని పార్టీల నేతలకు ఈ మెయిల్ ద్వారా ఆహ్వానం పంపినట్లు తెలిపారు. ఈనెల 18 నుండి 22 వరకు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు ఆగస్ట్‌ 31న కేంద్ర మంత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశాలకు సంబంధించి ఎజెండాను వెల్లడించలేదు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు, ఏకరూప పౌర స్మృతి (యుసిసి), జమిలి ఎన్నికలతో పాటు ఇతర అంశాలకు సంబంధించిన చర్చలు జరగవచ్చని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.