
శాన్ ఫ్రాన్సిస్కో : భారత్ జోడోయాత్రను అడ్డుకునేందుకు మోడీ ప్రభుత్వం శతవిధాలుగా యత్నించిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. అమెరికాలో మూడు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం ఆయన శాన్‌ఫ్రాన్సిస్కో చేరుకున్నారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో భారతీయ ప్రవాసులు, అమెరికన్ చట్టసభ సభ్యులతో సమావేశం కానున్నారు. బుధవారం శానిఫ్రాన్సిస్కోలో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ మాట్లాడారు. జోడో యాత్రను అడ్డుకునేందుకు మోడీ ప్రభుత్వం అన్ని ఏజన్సీలను దుర్వినియోగం చేసిందని.. కానీ అవేమీ ఫలించలేదని అన్నారు. భారత్‌ను ఏకం చేయడమనే ఆలోచన ప్రజలందరి హృదయంలో ఉన్నందున జోడోయాత్ర విజయవంతమైందని అన్నారు. బిజెపి ప్రజలను భయపెడుతోందని, ప్రజలతో మమేకమయ్యేందుకు అవసరమైన అన్ని సాధనాలను బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ నియంత్రిస్తున్నాయని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ అన్ని విశ్వాసాలను, విభిన్న మతాల ప్రజల మధ్య ప్రేమ, ఆప్యాయత విలువను నమ్ముతుందని రాహుల్ గాంధీ అన్నారు. భారత్ జోడో యాత్ర ఆప్యాయత, గౌరవం మరియు వినయం యొక్క స్ఫూర్తిని కలిగి ఉందని, చరిత్రను అధ్యయనం చేస్తే, గురునానక్ దేవ్, గురు బసవన్న, నారాయణ గురు సహా ఆధ్యాత్మిక గురువులందరూ ఇదే విధంగా దేశాన్ని ఏకం చేశారని అన్నారు. ప్రాంతీయ భాషలపై దాడి చేయడాన్ని తాము అనుమతించమని, అలా చేస్తే అది భారత్ పై దాడి అవుతుందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కులగణన చేపడుతామని రాహుల్ గాంధీ అన్నారు. ఇది సమాజంలో కుల వివక్షతను చూపేందుకు ఎక్స్‌రేలా ఉపయోగపడుతుందని అన్నారు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు రాజ్యాంగంపై దాడి చేస్తున్నాయని, కులం, మతం పేరుతో దేశాన్ని విభజించేందుకు యత్నిస్తున్నాయని దుయ్యబట్టారు.
గతేడాది సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుండి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభమైన సంగతి తెలిసిందే. సుమారు 3,000 కి.మీ మేర జరిగిన ఈ యాత్ర 2023, జనవరి 30 న శ్రీనగర్‌లో ముగిసింది.