
న్యూఢిల్లీ : మహారాష్ట్రలో ప్రభుత్వం సంక్షోభంలో కూరుకుపోయింది. ఇటు రాజస్తాన్‌లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. దీన్ని కారణం 'ఆపరేషన్ కమలం' అని విపక్షాలు మండిపడుతున్నాయి. బిజెపియేతర రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని మోడీ సర్కార్ కుట్రలకు పాల్పడుతోందని ఆరోపిస్తున్నాయి. అయితే ఇదేమీ కమల సర్కార్‌కు కొత్తేమీ కాదు. మోడీ అధికారంలోకి వచ్చిన 2014 నాటి నుండి.. నేటి వరకు కూడా బిజెపియేతర, స్థానిక పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుయుక్తులకు పాల్పడుతూనే ఉంది. ఆయా పార్టీల్లో అసంతృప్తితో ఉన్న నేతలను గుర్తించి.. ఎరవేసి.. ఫిరాయింపులకు దిగేలా చేయడం లేదంటే.. స్థానిక పార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం.. ఆ తర్వాత ఉపసంహరించుకోవడం వంటి కుట్రలు చేసింది. ఇప్పుటి వరకు కూలిన ప్రభుత్వాలన్నీ ఆ కోవకే వస్తాయి. మోడీ అధికారంలోకి వచ్చాక కూలిన ప్రభుత్వాలేంటంటే..
జమ్ముకాశ్మీర్
ఇప్పుడంటే.. జమ్ముకాశ్మీర్‌కు ఉన్న స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ను రద్దు చేసి రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మోడీ సర్కార్ మార్చిసింది కానీ.. ఒకప్పుడు ఇదొక రాష్ట్రమని, అక్కడ ప్రజా ప్రభుత్వం ఉండేదని అందరికి తెలిసిందే. ఇలా జరగడానికి ఆద్యం 2014లో పడింది. ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 87 సీట్లకు గానూ ఏ పార్టీకి మెజార్టీ రాలేదు. బిజెపి 25, స్థానిక పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ 28 స్థానాలు దక్కించుకోగా... ఈ రెండు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. పిడిపి అధ్యక్షురాలు మోహబూబా ముఫ్తీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కాగా.. 2018లో బిజెపి తన మద్దతును ఉపసంహరించుకోవడంతో ఆ సర్కార్ కూలిపోయింది.
అరుణాచల్ ప్రదేశ్
2014లో 60 అసెంబ్లీ ఎన్నికలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 42 స్థానాలతో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బిజెపి కేవలం 11 సీట్లనే దక్కించుకుంది. 2016లో ముఖ్యమంత్రి పెమా ఖండూ సహా మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఆ పార్టీ నుండి ఫిరాయించి.. బిజెపి నేతృత్వంలోని నార్త్-ఈస్ట్ డెమొక్రటిక్ అలయెన్స్‌కు చెందిన పీపుల్స్ పార్టీ ఆఫ్ అఫ్ అరుణాచల్ ప్రదేశ్‌లో చేరి కాషాయ పార్టీ కండువా కప్పుకున్నారు.
బీహార్
బీహార్‌లో బిజెపి మరో రకమైన కుట్రకు తెరలేపింది. 2015లో బీహార్ ఎన్నికల అనంతరం నితీష్ కుమార్ నేతృత్వంలోని జెడియు, ఆర్జేడీ, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ఇందులో నితీష్ కుమార్‌ను పావుగా చేసుకున్న బిజెపి.. కూటమి నుండి బయటకు వచ్చేలా స్కెచ్ గీసింది. నితీష్ కుమార్ బయటపడగానే.. జెడియుతో కలిపి సర్కార్‌ను ఏర్పాటు చేసింది కాషాయ పార్టీ.
ఉత్తరాఖండ్
2016 మార్చిలో 9 మంది శాసనసభ్యులు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో కాంగ్రెస్ నేతృత్వంలోని హరీశ్ రావత్ ప్రభుత్వం కూలిపోయింది. దీంతో అక్కడ రాష్ట్రపతి పాలన విధించారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
మణిపూర్
2017లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 60 స్థానాలకు కాంగ్రెస్ 28 సీట్లు గెలిచి.. అతిపెద్ద పార్టీగా అవతరించింది. బిజెపి 21 స్థానాలను గెల్చుకుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్ నుండి బిజెపి పిలుపు వచ్చింది. ఆ సమయంలో 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మద్దతునివ్వడంతో కమల సర్కార్ కొలువుదీరింది.
గోవా
ఇక్కడ 2017 ఎన్నికల్లో 40 స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. కాంగ్రెస్ 17 స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. బిజెపి 13 స్థానాలు దక్కాయి. అయినా స్వతంత్రులు, ఇతర పార్టీలకు చెందిన పది మంది సభ్యులు, ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే మద్దతుతో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక 2019లో కాంగ్రెస్ నుండి 15 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించడంతో... గోవాలో బిజెపి అతిపెద్ద పార్టీగా మారిపోయింది
కర్ణాటక
కర్ణాటకలో మరో విధమైన పరిస్థితి. 2018 ఎన్నికల్లో హంగ్ ఏర్పడింది. 222 అసెంబ్లీ స్థానాలకు గానూ బిజెపికి అత్యధికంగా 104 సీట్లు, కాంగ్రెస్‌కు 80, జనతాదళ్ సెక్యులర్‌కు 37 సీట్లు వచ్చాయి. బిజెపి నేత యడియూరప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా, విశ్వాస పరీక్షలో నెగ్గలేదు. కాంగ్రెస్ మద్దతుతో జెడిఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారు కానీ.. బిజెపి కుట్రలకు బలయ్యారు. 2019లో కాంగ్రెస్, జెడిఎస్ నుంచి 16 మందిని తమ వైపుకు లాక్కొని... అధికారాన్ని చేపట్టింది.
మధ్యప్రదేశ్
మధ్యప్రదేశ్‌లో సర్కార్ కూలిపోయిందుకు కారణమైన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు జ్యోతిరాధిత్య సింధియా.. సింథియాను ఎరగా వేసి.. కాంగ్రెస్‌పై తిరుగుబావుటా వేసేలా పన్నాగం పన్నింది కాషాయ పార్టీ. 2018 అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ కమల్‌నాథ్ ప్రభుత్వం ఏర్పాటు అయింది. అయితే, జ్యోతిరాదిత్య సింధియా సహా మొత్తం 26 మంది కాంగ్రెస్ శాసనసభ్యులు అధికార పార్టీపై తిరుగుబావు ఎగురవేయడంతో 2020 మార్చిలో ప్రభుత్వం కూలిపోయింది. అనంతరం బిజెపి నేతృత్వంలో శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు మహారాష్ట్ర వైపు బిజెపి కళ్లు పడ్డాయి. అక్కడ ఏక్నాథ్ షిండేకు వల వేసి.. తమ వైపుకు మరింత మంది ఎమ్మెల్యేలను తిప్పుకుని.. ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తోంది.