Sep 30,2022 16:35

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : 2023 జనవరి నుండి విశాఖపట్నంలో ఇన్ఫోసిస్ కంపెని పూర్తి స్థాయి కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్టు రాష్ట్ర ఐటి శాఖ మంత్రి గుడివాడ అమర్నాద్ అన్నారు. శుక్రవారం మధ్యహ్నం విశాఖపట్నంలోని ప్రభుత్వ అతిధి గృహంలో జిల్లా కలెక్టర్ ఏ.మల్లికార్జున, పోలీస్ కమిషనర్ సిహెచ్.శ్రీకాంత్ తో పాటు ఇతర ప్రధాన అధికారులతో కలిసి ఇన్ఫోసిస్ ప్రతినిధులతో ఆయన సమావేశం అయ్యారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 2004-2009 కాలంలో  హైదరాబాద్ తో పాటు విశాఖలో  కూడా ఐటీ పరిశ్రమను అభివృద్ధి చేయాలని ప్రయత్నించారని ఆయన కలలు సాకారం చేసే దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రపంచంలోని టాప్ కంపెనీ ఒకటన్న విశాఖపట్నంలో ఉండాలని సిఎం జగన్  కోరుకున్నారని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్ కోల్పోయమని ఈ క్రమంలో ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఐటి పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని ఈ కృషిలో భాగంగానే ఇన్ఫోసిస్ కంపెనిని విశాఖకు తీసుకువచ్చామని తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో మొదటి స్థానంలో ఆంధ్ర రాష్ట్రం నిలిచిందని తద్వారా దేశంలోని ప్రధాన ఐటి సంస్థలు ఆంధ్ర రాష్ట్రంలో తమ సంస్థల స్థాపనకు ముందుకు వస్తున్నాయని ఈ క్రమంలొనే ఈ ఏడాది  జూన్ లో ఇన్ఫోసిస్ ను తెలంగాణాతో పాటు మన రాష్ట్రంలో కూడా విస్తరించాలని కోరడం జరిగింది. దానికి సానుకులంగా స్పందించిన ఇన్ఫోసిస్ అధికారులు తక్కువ కాలంలో విశాఖపట్నం కేంద్రంగా తమ కార్యకలాపాలు చేపడతామని చెప్పారని తెలిపారు. దీనిపై శుక్రవారం జరిగిన సమీక్ష సమావేశంలో సంస్థ ప్రతినిధులు రాతపూర్వక అంగీకారం తెలియజేయటం జరిగిందన్నారు. అక్టోబర్ 1 నుండి ఇన్ఫోసిస్ సంస్థ మధురవాడలోని ఐటి పార్క్ లో తమ కార్యాలయం స్థాపనకు గల కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్టు ఆయన తెలిపారు. మొదటగా విడతగా 1000 మంది ఉద్యోగులతో జనవరి నుండి పూర్తి స్థాయి కార్యకలాపాలు ప్రారంభిస్తారని దీనికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రవాణా, భద్రత, మౌలిక సదుపాయాలు వంటి సౌకర్యాలు కల్పించడాని శుక్రవారం సమీక్ష నిర్వహించామని అన్నారు. ఇన్ఫోసిస్ వంటి సంస్థను విశాఖపట్నంలో నెలకొలపడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషి చేసిందని వారు విశాఖలో  సొంత భవనం కట్టుకుంటాము అంటే వారికి పూర్తి సహకారం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇది డెవలప్మెంట్ సెంటర్ గా పనిచేస్తూ భవిష్యత్ లో ఉద్యోగుల సంఖ్యతో పాటు వ్యాపార వృద్దిని విస్తరించనుందని ఆయన అన్నారు. ఈ సమీక్ష సమావేశంలో ఇన్ఫోసిస్ హైదరాబాద్ శాఖ వైస్ ప్రసిడెంట్ రఘు బోడుపల్లి,  సెక్యూరిటీ హెడ్ కల్నల్ శ్రీనివాస్ బాలసురు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రీజినల్ హెడ్ అమోల్ కులకర్ణి, ఫెసిలిటీస్ రీజినల్ హెడ్ వెంకటేష్ సంగం, విశాఖపట్నం డెలివరీ హెడ్ సురేష్ నారా, రీజినల్ మేనేజర్ సెక్యూరిటీ కల్నల్ గణేష్ గుంటూరుతో పాటు విశాఖపట్నంలో ప్రధాన పరిపాలన అధికారులు హాజరయ్యారు.