
గాంధీనగర్ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ రాష్ట్రంలో బిజెపికి ఇబ్బందికర పరిస్థితి ఎదురయింది. మద్యాన్ని బహిరంగంగా అమ్ముకోవచ్చని చెప్పినందుకు ఒక బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బణస్కంథ జిల్లా దంత నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్థి లతు భాయి పర్గి నవంబర్ 26న ఒక సమావేశంలో మాట్లాడుతూ మద్యాన్ని ఒక బాస్కెట్లో పెట్టి బహిరంగంగా అమ్ముకోవచ్చు, దీనికి ఎలాంటి గోప్యత అవసరం లేదని చెప్పారు. ఈ వీడియా వైరల్గా మారింది. రిటర్నింగ్ అధికారి ఫిర్యాదుతో దంత పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. గుజరాత్లో మద్యం తయారీ, నిల్వ, అమ్మకం, వినియోగాన్ని నిషేధించే చట్టం అమలులో ఉంది.