Jul 29,2021 21:10

భారత పురుషుల హాకీజట్టు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అర్జెంటీనాను చిత్తుచేసింది. టైటిల్‌ ఫేవరెట్లలో ఒక జట్టైన అర్జెంటీనాపై మన్‌ప్రీత్‌ సేన జయకేతనం ఎగురవేసింది. గురువారం ఉదయం జరిగిన గ్రూప్‌-ఏ నాలుగో మ్యాచ్‌లో భారత్‌ 3-1 గోల్స్‌ తేడాతో విజయం సాధించింది. తొలి రెండు క్వార్టర్స్‌ ముగిసేసరికి ఇరుజట్లు గోల్స్‌ చేయలేకపోయాయి. మూడో క్వార్టర్‌ 43వ నిమిషంలో వరుణ్‌ కుమార్‌ తొలి గోల్‌ చేసి జట్టును 1-0 ఆధిక్యతలో నిలిపాడు. ఇక నాల్గో క్వార్టర్‌ 48వ నిమిషంలో అర్జెంటీనా ఆటగాడు మైకో కసెల్లా ఓ గోల్‌ చేయడంతో తొలి గోల్‌ అందించాడు. దీంతో ఇరుజట్ల స్కోర్‌ 1-1తో సమం అయ్యింది. మ్యాచ్‌ 58వ నిమిషంలో వివేక్‌ సాగర్‌, 59వ నిమిషంలో హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ ఒక గోల్‌ చేయడంతో భారత్‌కు 3-1 ఆధిక్యత లభించింది. నాలుగో క్వార్టర్‌లోనే భారత్‌ రెండు గోల్స్‌ చేయడం విశేషం. దీంతో గ్రూప్‌-ఏలో భారత్‌ ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడింట విజయాల(9పాయింట్లు)తో ఆస్ట్రేలియా తర్వాతి స్థానంలో ఉంది. శుక్రవారం జరిగిన ఆఖరి లీగ్‌మ్యాచ్‌లో మన్‌ప్రీత్‌ సేన జపాన్‌తో తలపడనుంది. గ్రూప్‌ాఏ ఇతర పోటీల్లో ఆస్ట్రేలియా 4-2తో న్యూజిలాండ్‌ను, స్పెయిన్‌ 4-1తో జపాన్‌ను చిత్తుచేశాయి.