Nov 20,2020 21:46

మెల్‌బోర్న్‌: భారత్‌ - ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈనెల 27నుంచి ప్రారంభం కానున్న మూడు వన్డేల, మరో మూడు టి20 సిరీస్‌ టిక్కెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడైపోయాయి. భారత్‌తో జరగనున్న పరిమిత ఓవర్ల మ్యాచ్‌ల టికెట్లన్నీ అమ్ముడైపోయినట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా(సిఏ) శుక్రవారం తెలిపింది. కేవలం రెండు రోజుల్లోనే మ్యాచ్‌ల టికెట్లన్నీ అమ్ముడయ్యాయని, సిడ్నీలో వేదికగా ఒకటి, రెండు వన్డే సిరీస్‌కు సంబంధించి కేవలం కొన్ని టిక్కెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని సిఏ ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే మునుక ఓవల్‌ వేదికగా జరిగే మూడో వన్డే, తొలి టి20 టికెట్లన్నీ హాట్‌కేకుల్లా అమ్ముడైపోయాయని తెలిపింది. అయితే ఈ రెండు స్టేడియాల్లోనూ కోవిడ్‌ నిబంధనల కారణంగా 50% టికెట్లు మాత్రమే అమ్మకానికి ఉంచారు. దక్షిణాసియా ప్రాంత ప్రజలు ఎక్కువగా ఉండే ఆస్ట్రేలియాలో ఇండియా ఎప్పుడు పర్యటనకు వెళ్లినా.. టికెట్లన్నీ హాట్‌ కేకుల్లా అమ్ముడైపోతాయి. ఇండియాతో సిరీస్‌ అంటేనే క్రికెట్‌ ఆస్ట్రేలియాపై కాసుల వర్షం కురుస్తోంది. మరోవైపు తొలి టెస్ట్‌ వేదికైన అడిలైడ్‌లో పరిస్థితులు కుదుటపడుతున్నాయని, తప్పుడు సమాచారంతో తాము ఈ లాక్‌డౌన్‌ విధించామని, త్వరలోనే దానిని ఎత్తేయనున్నట్లు అక్కడి అధికారులు చెప్పారు. దీంతో తొలిటెస్ట్‌ షెడ్యూల్‌ ప్రకారం అడిలైడ్‌లోనే జరగనున్నట్లు సిఏ ప్రకటించింది.