Oct 18,2021 08:09

చంద్రవంక రాజ్యాన్ని కరుణాకరుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆయన అందరిపై కరుణ చూపిస్తుండేవాడు. ప్రతివారు చెప్పిన సమస్యలు నిజమని నమ్మి, అడుగగానే లేదనకుండా సాయం చేసేవాడు. మహారాజు సాయం చేయడం చూసి, కొంతమంది అమాయకుడంటూ హేళన చేసేవారు. మహారాజు గురించి తక్కువగా మాట్లాడటం మహామంత్రి వీరభద్రుడి చెవిన పడింది. ఈ విషయాన్ని ఆయనకి తెలియ జేయాలనుకున్నాడు. ఒకరోజు రాజమందిరానికి చేరుకున్న మహారాజు పనిలో నిమగమయ్యాడు. అంతలో ఒక వ్యక్తి వచ్చి ''అయ్యా! మహారాజా! నాకు మీరు సాయం చేయాలి.'' అంటూ దుఃఖించసాగాడు. ''ఏంటీ నీ సమస్య'' అని మహారాజు అడిగాడు. ''రాజా! నేను మీ రాజ్యంలో ఒక గ్రామానికి చెందిన ధనవంతుడిని. నా వద్ద ఎందరో సాయం పొంది, తమ అవసరాలు తీర్చుకుని, నన్ను మర్చిపోయారు. ఈ రోజు నాకు డబ్బు అవసరమై వారిని అడిగితే ఒక్కరు కూడా సాయం చేయడం లేదు'' అన్నాడు. మహారాజు కరుణాకరుడు ''నువ్వు ఏనాడూ పేదవాడిని కాదు.

నీ వద్ద సాయం పొందిన వారు నిన్ను ఈరోజు కూడా ధనవంతునిగా గుర్తించి సాయం చేయడం లేదు. నువ్వే నాకంటే ధనవంతుడిని. నీకు నేనూ సాయం చేయలేను'' అన్నాడు. ఆ మాటలకి సభలో అందరూ ఆశ్చర్యపోయారు. సాయం కోసం వచ్చిన వ్యక్తి తలపాగా తీస్తూ... ''రాజా! మీ గొప్ప మనసు అర్థం చేసుకోకుండా... మారువేషంలో వచ్చాను. క్షమించండి'' అన్నాడు మహామంత్రి వీరభద్రుడు. ''వీరభద్రా! నేను చేసే దానధర్మాలు చూసి, అసూయతో నా గురించి హేళనగా, చులకనగా మాట్లాడుతున్నారు. అవి నేను పట్టించుకోను. రాజ్య ప్రజల క్షేమమే నాకు ముఖ్యం'' అన్నారు. ఆ మాటలతో మంత్రితో పాటు సభలోని విమర్శలకు సైతం జ్ఞానోదయం అయింది.
 

- ఉండ్రాళ్ళ రాజేశం
99669 46084