Jul 03,2022 23:46

రౌండ్‌టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతున్న పతివాడ రాంబాబు

ప్రజాశక్తి- తగరపువలస : హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాలని దళిత, ఆదివాసీ సంఘాల జెఎసి జిల్లా కన్వీనర్‌ పతివాడ రాంబాబు పిలుపు నిచ్చారు. జివిఎంసి ఒకటో వార్డు సంతపేట సామాజిక భవనంలో ఆదివారం భీమిలి నియోజకవర్గ స్థాయి దళిత సంఘాలతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ, ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ దళిత, గిరిజనుల సంక్షేమం నేటికీ అందని ద్రాక్షగానే ఉందన్నారు. 90 శాతం దళిత, ఆదివాసీ ఓట్లతో అధికారంలోకి వచ్చిన ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం దళితులు ఆదివాసీలకు అనాదిగా అమలులో ఉన్న 29 రకాల సంక్షేమ పథకాలను నిలిపివేసిందని విమర్శించారు. వెంటనే వాటిని పునరుద్ధరించాలని, లేకుంటే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసేందుకు ఏ ప్రభుత్వం ఆటంకం కల్పించినా సరే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ప్రస్తుత ప్రభుత్వ విధానాలు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల నుంచి దళితులు, ఆదివాసీలను దూరం చేసేలా ఉన్నాయని విమర్శించారు. ఈ సమావేశంలో దళిత సంఘాల ప్రతినిధులు ఉప్పాడ, అప్పారావు, దత్తి ఈశ్వరరావు, సామంతుల సత్తిరాజు, భాగం లక్ష్మి, జివి రమణ, పందిరి విజరు, దత్తి శ్రీనివాసరావు, కె.హరిబాబు, హరి తదితరులు పాల్గొన్నారు.