
ప్రజాశక్తి- కర్నూలు క్రైం : హోంగార్డు డిఎస్పి వై. రవీంద్రా రెడ్డికి ఇండియన్ పోలీసు మెడల్ లభించింది. గణతంత్ర దినోత్సవం - 2022 సందర్బంగా ఈ గౌరవం ఆయనకు దక్కింది. ఈయన 1992 బ్యాచ్‌కి చెందిన వారు. అనంతపురం జిల్లాలో ఆర్ ఎస్‌గా మొదటగా పోలీసు శాఖలో చేరారు. ఆర్ఎస్ఐగా కూంబింగ్, మట్కాపై దాడులు, జూదం, అక్రమ ఆయుధాలు, బాంబులను నిర్వీర్యం చేయడం వంటి పలు విధులు నిర్వహించారు. నక్సలిజం, ఫ్యాక్షనిజాన్ని అరికట్టడంలో కృషి చేశారు. 2007లో పెనుకొండ, ఆత్మకూర్ పిఎస్‌లకు చెందిన 9 ల్యాండ్మైన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతపురంలోని పోలీసు ట్రైనింగ్ సెంటర్ లో పనిచేస్తున్నప్పుడు ఔట్ డోర్ మాన్యువల్ సిద్ధం చేశాడు. ఇది డిజిపి ప్రింటింగ్ ప్రెస్‌లో ముద్రణకు నోచుకుంది. ఎపిలోని అన్ని పోలీసు శిక్షణా సంస్థలకు పంపిణీ అయ్యింది. ఎపి పోలీస్ ట్రైనింగ్ వింగ్‌లో ఇదొక గొప్ప మైలురాయి కార్యకలాపంగా నిలిచింది. ఆయన శిక్షణా షెడ్యూల్లు, శిక్షణా కార్యకలాపాలను సిద్ధం చేశాడు. విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా, టిటిడి దేవాలయం, విఐపిలకు, వివిఐపిలకు భద్రత కల్పించడంతోపాటు చట్టవ్యతిరేక కార్యకలాపాలను నిర్మూలించడంలో బాగా పని చేశారు. 2003 జూన్4న తిరుమల ఘాట్లోయలో ఆర్టిసి బస్సు పడిపోయిన ఘటన సందర్భంగా ఆయన మొదటగా చేరుకుని చాలా మంది ప్రాణాలను కాపాడాడు. 28 ఏళ్ల సర్వీసులో రిమార్కులు లేకుండా ఎన్నో రివార్డులు, అవార్డులు అందుకున్నారు. ఎపి పోలీసు సేవాపథకం అవార్డు లభించింది. ప్రతిభ ను గుర్తించి కర్నూలు హోంగార్డు డిఎస్పిగా విధులు నిర్వహిస్తున్న వై.రవీంద్రా రెడ్డి కి ప్రభుత్వం ఇండియన్ పోలీసు మెడల్ ప్రకటించింది. పలువురు పోలీసు అధికారులు అభినందనలు తెలిపారు.