Aug 07,2022 22:20

ర్యాలీ దృశ్యం

పజాశక్తి -నెల్లూరు : :అమృత్‌మహోత్సవాల నేపథ్యంలో 'హర్‌ ఘర్‌ తిరంగా' ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దామని నగర పాలక సంస్థ మేయర్‌ పొట్లూరి స్రవంతి, కమిషనర్‌ డి.హరితలు పిలుపు నిచ్చారు. ఆదివారం స్థానిక సర్వోదయా కళాశాల ప్రాంగణం నుంచి చైతన్య ర్యాలీని జెండా ఊపి మేయర్‌, కమిషనర్‌ ప్రారంభిం చారు. ర్యాలీలో భాగంగా మద్రాస్‌ బస్టాండ్‌ కూడలిలోని జవహర్‌ లాల్‌ నెహ్రూ, టంగుటూరి ప్రకాశం పంతులు, విఆర్‌సి సెంటర్‌ ప్రాంతంలోని అంబేద్కర్‌ విగ్రహాలతో పాటు చివరిగా గాంధీ బొమ్మ సెంటర్‌లో మహాత్ముని విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం ర్యాలీని ఉద్దేశించి మేయర్‌, కమిషనర్‌ మాట్లాడుతూ 'హర్‌ ఘర్‌ తిరంగా' కార్యక్రమాన్ని కనీవినీ ఎరగని రీతిలో పౌరులంతా విజయవంతం చేయాలని ఆకాంక్షించారు. నగర వ్యాప్తంగా ప్రతీ ఇంటిపై మువ్వన్నెల జెండా రెపరెప లాడేలా ఈ నెల 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ జాతీయ పండగను కన్నుల పండుగగా చేపట్టాలని సూచించారు. జాయింట్‌ కలెక్టర్‌ కూర్మానాథ్‌, జడ్‌పి సీఈఓ వాణి, కార్పొరేటర్‌ లు యాకసిరి వాసంతి, గుంజి జయలక్ష్మి, పాల్గొన్నారు.