Oct 28,2021 09:56

న్యూఢిల్లీ : లఖింపూర్‌లో రైతులపై నుండి కేంద్ర సహాయ మంత్రి కాన్వారు దూసుకెళ్లిన ఘటన మర్చిపోకముందు మరో దారుణం హర్యానా సరిహద్దుల్లో చోటుచేసుకుంది. వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలంటూ అన్నదాతలు 11 నెలల నుండి ఆందోళనలు చేపడుతున్న ఢిల్లీ-హర్యానా బోర్డర్‌ టిక్రీకి సమీపంలో ముగ్గురు మహిళా రైతులపై నుండి వేగంగా ట్రక్కు దూసుకెళ్లడంతో వారు చనిపోయారు. ఆటో కోసం ఎదురుచూస్తూ.. డివైడర్‌పై కూర్చొగా.. ఆ ట్రక్కు వేగంగా వారు పైకి దూసుకువచ్చింది. వీరిలో ఇద్దరు అక్కడిక్కడే చనిపోగా.. ఒకరిని ఆసుపత్రికి తరలించిన తర్వాత ప్రాణాలు విడిచారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన తర్వాత డ్రైవర్‌ పరారయ్యాడని చెప్పారు. ప్రాథమిక దర్యాప్తులో వీరు పంజాబ్‌లోని మాన్సా జిల్లాకు చెందిన వారుగా తెలుస్తోంది.