Jul 21,2021 21:09

బీజింగ్‌ : పెద్ద ఎత్తున మైక్రోసాఫ్ట్‌ హ్యాకింగ్‌ చేశామని అమెరికా చేసిన ఆరోపణలను చైనా మంగళవారం ఖండించింది. ఆ ఆరోపణలు కేవలం కల్పితాలని పేర్కొంది. సైబర్‌ దాడుల్లో ప్రపంచ ఛాంపియన్‌ అమెరికానే అని ఎదురు దాడి చేసింది. చైనాను ఖండిస్తూ సంయుక్త ప్రకటన చేసినందుకు అమెరికా మిత్ర దేశాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్‌ సంస్థలకు ఇ మెయిల్‌ సర్వర్‌ అయిన మైక్రోసాఫ్ట్‌ ఎక్స్ఛేంజ్‌పై చైనా సైబర్‌ దాడికి పాల్పడిందని సోమవారం అమెరికా ఆరోపించింది. ఈ హ్యాకింగ్‌కు కారణమంటూ నలుగురు చైనా జాతీయులపై అభియోగాలు మోపింది. ''సైబర్‌ స్పేస్‌లో బాధ్యతారాహిత్యమైన, విధ్వంసకర, అస్థిరపరిచే వ్యవహార శైలిలో భాగమే ఈ దాడని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ వ్యాఖ్యానించారు. ''తమ సొంత ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రభుత్వ ప్రాయోజిత కార్యకలాపాలు, సైబర్‌ నేరాలు రెండింటినీ నిర్వహించే క్రిమినల్‌ కాంట్రాక్టు హ్యాకర్లను చైనా భద్రతా వ్యవహరాల మంత్రిత్వశాఖ ప్రోత్సహిస్తోందని బ్లింకెన్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2011 నుండి 2018 మధ్య కాలంలో అమెరికాలో, విదేశాల్లో డజన్ల కొద్దీ కంపెనీలు, యూనివర్శిటీలు, ప్రభుత్వ సంస్థల్లో కంప్యూటర్లను హ్యాకింగ్‌ చేశారంటూ అమెరికా న్యాయ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రతి చర్యలు తీసుకోవడానికి ముందుగా పూర్తిగా దర్యాప్తు జరపాల్సి వుందని బిడెన్‌ విలేకర్లతో అన్నారు. రష్యా ప్రభుత్వం మాదిరిగా చైనా ప్రభుత్వం తమంతట తాము ఇది చేసి వుండదు, అయితే, ఎవరైతే ఇది చేస్తున్నారో వారిని కాపాడుతుండవచ్చు, అలాంటివారికి ఆశ్రయం ఇచ్చి వుండవచ్చని బిడెన్‌ పేర్కొన్నారు. దౌత్యపరంగా చైనాను ఒత్తిడి చేసేందుకు ఇయు, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజీలాండ్‌, జపాన్‌, నాటోలతో కలిసి సంయుక్త ప్రకటన విడుదల చేసింది.
ఈ నేపథ్యంలో చైనా ఘాటుగా స్పందించింది. చైనాపై అహేతుకమైన రీతిలో విమర్శలు చేసేందుకు అమెరికా తన మిత్రపక్షాలను కూడగట్టిందని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి ఝావో లిజియాన్‌ విలేకర్లతో అన్నారు. ఏమీ లేనిదానికి ఇటువంటివి కల్పించారని విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా చైనా దౌత్య కార్యాలయాలన్నీ ఈఆరోపణలను ఖండిస్తూ ప్రకటనలు చేశాయి. నిరాధారమైన ఆరోపణలని న్యూజీలాండ్‌లోని చైనా ఎంబసీ పేర్కొంది.