
- పిడుగుపాటుకు ముగ్గురు మృతి
- 40 గొర్రెలు, 15 ఆవులు మృత్యువాత
- దెబ్బతిన్న పంటలు.. రైతన్నకు నష్టం..
ప్రజాశక్తి - యంత్రాంగం : ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకణ్ తీరం వరకూ ఏర్పడిన ద్రోణి ప్రభావంతో గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. పిడుగులు పడి ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురుకి గాయాలయ్యాయి. 40 గొర్రెలు, 15 ఆవులు మృత్యువాత పడ్డాయి. పంటలకు నష్టం వాటిల్లింది. పిందె దశలో ఉన్న మామిడి నేలమట్టమైంది. మిరప, మొక్కజన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం సమీపంలోని యర్రగుంట కాలనీలో పిడుగుపాటుకు నారాయణమ్మ (62), కమ్మలమ్మ (65) మృతి చెందారు. నంద్యాల జిల్లా శిరువెళ్ల మండలం మహదేవపురం గ్రామానికి చెందిన కాపరులు గొల్ల ఆంజనేయులు(45), శంకర్, నాగరాజు, విశ్వనాథ్.. కొట్టాలపల్లె-శిరువెళ్ల మధ్య గల పొలాల్లో గొర్రెలను మేపేందుకు వెళ్లారు. గొర్రెలను మేపుతూ పొలాల్లోనే విశ్రాంతి తీసుకుంటుండగా గురువారం రాత్రి వారు ఉన్న సమీపంలో ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో పిడుగు పడింది. దీంతో ఆంజనేయులు అక్కడికక్కడే మృతి చెందారు. శంకర్, విశ్వనాథ్, నాగరాజుకు గాయాలవ్వడంతో చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పిడుగుధాటికి 40 గొర్రెలు మృతి చెందాయి. బెతంచర్ల మండలంలో 15 ఆవులు చనిపోయాయి. చిత్తూరు జిల్లా వి.కోట మండలంలో కురిసిన వడగండ్ల వాన జిల్లా రైతాంగాన్ని అతలాకుతలం చేసింది. వెంకటేపల్లి, కొమ్మరమడుగు, కృష్ణాపురం తదితర గ్రామాల్లో కాకర, టమోటా, అరటి, చిక్కుడు, బీన్స్ పంటలు దెబ్బతిన్నాయి. బలంగా వీచిన గాలులకు మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. పలమనేరు జాతీయ రహదారిపై చెట్లు విరిగిపడడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో కళ్లాల్లో ఉన్న మిర్చి, మొక్కజన్న పంట తడిసిపోయింది. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం తాళ్లాయపాలెంలో పిడుగుపాటుకు రెండున్నర ఎకరాల్లోని వరి పంట దగ్ధమైంది. గుంటూరు మిర్చి యార్డులో కొద్ది మేర మిర్చి బస్తాలు తడిచాయి. అల్లూరి సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి, కృష్ణా, ఎన్‌టిఆర్ విజయవాడ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులకు పలు చోట్ల మామిడికాయలు నేలరాలాయి.