Aug 09,2022 21:53
  • భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
  • కాటన్‌ బ్యారేజీ వద్ద క్రమంగా పెరుగుతున్న ఉధృతి
  • ఆందోళనలో పోలవరం ముంపు గ్రామాల ప్రజలు
  • సురక్షిత ప్రాంతాలు తరలిపోతున్న వి.ఆర్‌.పురం వాసులు
  • ఛత్తీస్‌గఢ్‌ వైపునకు అల్పపీడనం

ప్రజాశక్తి-యంత్రాంగం : గోదావరి నదికి మళ్లీ వరద నీరు పోటెత్తింది. వాయుగుండం ప్రభావంతో ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లోనూ వర్షాలు పడుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలకు సీలేరు, శబరి నదులకు వరద నీటి తాకిడి పెరిగింది. ఆ రెండు నదులూ పొంగితే గోదావరికి మరింత వరద నీరు చేరే అవకాశం ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. భద్రాచలం వద్ద మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు 39 అడుగులు ఉన్న నీటిమట్టం సాయంత్రం నాలుగు గంటలకే నాలుగు అడుగుల వ్యవధిలోనే నాలుగు అడుగులు పెరిగి 43 అడుగులకు చేరుకుంది. ఆ తర్వాత 44.60 అడుగులకు చేరింది. దీంతో భద్రాచలం సబ్‌కలెక్టర్‌ అక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పోలవరం ప్రాజెక్టు వద్ద 10.430 మీటర్ల నీటిమట్టం నమోదైంది. అక్కడి నుంచి ఎనిమిది లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో, ధవళేశ్వరంలోని కాటన్‌ బ్యారేజీ వద్ద నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. కాటన్‌ బ్యారేజీ వద్ద 10.20 అడుగుల నీటిమట్టం నమోదైంది. బ్యారేజీ 175 గేట్లను ఎత్తివేసి దిగువకు 7.75 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. మరో 12 గంటల్లో ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి వరద నీరు వచ్చే అవకాశం ఉందని ఇరిగేషన్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. గత నెలలో గోదావరికి వరద భారీగా పోటెత్తింది. రికార్డు స్థాయిలో భద్రాచలం వద్ద 71 అడుగుల నీటిమట్టం నమోదైంది. నెల రోజులు కూడా తిరగకముందే మళ్లీ వరద హెచ్చరికలు నదీతీర, లంక గ్రామస్తులను కలవరానికి గురిచేస్తోంది. మళ్లీ వరద వస్తే తమ పరిస్థితి ఏంటా? అని వారు ఆందోళన చెందుతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలైన చింతూరు, ఎటపాక, విఆర్‌.పురం, కూనవరంల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఇప్పటికే చింతూరు మండలం వీరాపురం వాగు పొంగి ప్రవహిస్తుండడంతో ఆంధ్రా-ఛత్తీస్‌గఢ్‌ మధ్య రవాణా స్తంభించింది. సోకులేరు వాగు ఉధృతం కావడంతో చింతూరు, విఆర్‌.పురం రెండు మండలాలకు పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. ఇప్పటికే విఆర్‌.పురం, కూనవరం మండలాల్లోని 80 గ్రామాల్లో రాకపోకలు స్తంభించాయి. మళ్లీ వరదలు ముంచెత్తుతాయన్న భయంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పోలవరం కాఫర్‌ డ్యామ్‌ వల్ల కిందకు నీరు వెళ్లలేని పరిస్థితిలో ముంపు మండలాల ప్రజలకు నిద్ర కరువైంది. లోతట్టు గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. విఆర్‌.పురం మండలం శ్రీరామగిరి, వడ్డిగూడెం, కల్తూనూరు, చొక్కానపల్లి, కొత్తూరు, తదితర గ్రామాల మధ్య గోదావరి రోడ్డు మూసుకుపోయింది. అధికార యంత్రాంగం వరదల సమాచారం కూడా ఇవ్వడం లేదని ప్రజలు వాపోతున్నారు. పాడేరు డివిజన్‌లోని జి.మాడుగుల మండలం బయితిలి పంచాయతీ కేంద్రం నుంచి చీకుపనస, జక్కం గ్రామాలకు వెళ్లే రహదారిలో బయితిలి వద్ద కొండవాగుపై కల్వర్టు కొట్టుకుపోయింది. దీంతో 20 గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో మూడ్రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో, జిల్లా కేంద్రాలతోపాటు పలు పట్టణాల్లోని పలు ప్రధాన కూడళ్లు జలమయమయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలంలోని లోతట్టు ప్రాంతమైన కనకాయలంక కాజ్‌వే మళ్లీ నీట మునిగింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి జనం ఇబ్బందులు పడుతున్నారు. తాడేపల్లిగూడెం మండలం నందమూరు అక్విడెక్టు వద్ద ఎర్ర కాల్వ ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద నీరు బ్రిడ్జిని తాకుతూ 30.6 అడుగుల ఎత్తులో ప్రవహిస్తుండటంతో సుమారు 580 ఎకరాల్లో వరి పొలాలు నీటమునిగాయి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం ఎర్ర కాలువ జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. గోదావరి వరద పెరగడంతో కుక్కునూరు మండలంలో కుక్కునూరు-దాచారం మధ్య గుండేటి వాగుపై కాజేవే ముంపునకు గురైంది. 12 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నెల ఆరున బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బుధవారానికి ఒడిశా మీదుగా ఛత్తీస్‌గఢ్‌ వైపునకు బలహీనపడుతూ వెళ్లిపోనుందని అమరావతి వాతావరణ కేంద్రం మంగళవారం రాత్రి వెల్లడించింది. ఉత్తర కోస్తాలో రాగల 24 గంటల్లో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు, మిగతా చోట్ల మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురియనున్నట్టు అధికారులు తెలిపారు.

  • తుంగభద్ర, శ్రీశైలం ప్రాజెక్టులకు జలకళ

తుంగభద్ర ప్రాజెక్టులోకి 1,39,900 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, ఎనిమిది గేట్లను ఒకటిన్నర అడుగుల మేర ఎత్తి 1,50,955 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం డ్యాంలో 101.382 టిఎంసిల నీరు నిల్వ ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఏడు గేట్ల ద్వారా 1,95,836 క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు.

  • సాగర్‌, ప్రకాశం బ్యారేజీలకు పెరిగిన వరద

ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో నాగార్జున సాగర్‌ సాగర్‌ జలాశయానికి వరద ఉధృతి మరింత పెరిగింది. గరిష్ట నీటిమట్టం 590 అడుగులు కాగా మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు 577.60 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 1,91,646 క్యూసెక్కులు వస్తుండగా 31,535 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు.