Aug 18,2022 07:05

అది మారుమూల మండలం. అభివృద్ధి చెందని ప్రాంతం. ఎటు చూసినా సమస్యలే. దాంతో అక్కడ యువత చేయిచేయి కలిపారు. సమాజానికి తమ వంతు సాయం చేయాలనుకున్నారు. దానికి సోషల్‌ మీడియా వేదికగా చేసుకున్నారు. ఒక గ్రూప్‌గా చేరి కడప జిల్లా చిట్వేలు మండలంలో ఉన్న సమస్యలను ఒక్కొక్కటీ పరిష్కరించుకుంటూ గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు.

కడప జిల్లా, చిట్వేల్‌ మండలంలోని పల్లెల్లో పిల్లలు చదువుకునేందుకు స్కూళ్లు ఉన్నాయి. కాని అందులో సౌకర్యాలు లేవు. హాస్పటల్స్‌ ఉన్నాయి. కాని అక్కడ రోగులకు సరైన సదుపాయాలు లేవు. రోడ్లు అంతంత మాత్రంగా ఉండేవి. ఎలక్ట్రికల్‌ పనిచేస్తున్న భాస్కర్‌రెడ్డి ఊరికి తన వంతు సాయం చేయాలనుకున్నారు. తన స్నేహితులతో కలిసి తన ఆలోచన చెప్పారు. ఊరికి మంచి చేయాలన్న ఆయన సంకల్పానికి తాము తోడవతామని ముందుకు వచ్చారు. ప్రధాన కార్యదర్శి ఇంతియాజ్‌ సహకారంతో ఏడేళ్ల క్రితం 'చిట్వేల్‌ హెల్ప్‌లైన్‌' పేరుతో సొసైటీ స్థాపించారు. వాట్పాప్‌ గ్రూపు క్రియేట్‌ చేసి గ్రామాల్లో ఉన్న ముఖ్యమైన సమస్యలపై దృష్టి పెట్టారు. వాటిని సొసైటీ సభ్యులకు తెలియజేసేవారు. ప్రభుత్వ, వ్యాపార, ఐటీ రంగాల్లో పనిచేసే సుమారు 160 మంది సొసైటీ సభ్యులుగా ఉన్నారు. మానవసేవే-మాధవసేవ అనే నినాదంతో గ్రామాల్లో విద్య, వైద్యం అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతి గ్రామంలో ప్రాథమిక పాఠశాలల్లో మంచినీటి సౌకర్యం కల్పించారు. దానికి అయిన ఖర్చు మొత్తం సభ్యులు భరించారు. మండలంలో ఎస్టీ కాలనీలో గతంలో పూరిపాకలో పిల్లలకు చదువు చెప్పేవారు. విషయం తెలుసుకున్న సభ్యులు లక్షల రూపాయలు ఖర్చుపెట్టి అన్ని సదుపాయాలతో స్కూలు కట్టించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మరమ్మతులు చేయించారు. ఆక్సిజన్‌ ఇన్వర్టర్‌, వాటర్‌ డిస్పెన్సరీ సదుపాయాలు కల్పించారు. రోగుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో మరో కొత్త ఆసుపత్రి భవనం కట్టించి ఇవ్వాలని ప్రభుత్వ అధికారులను కోరారు. నెలల తరబడి అధికారులను పదేపదే అడుగుతూనే ఉన్నారు. హెల్ప్‌లైన్‌ సొసైటీ సేవలను గుర్తించిన రాజకీయ నాయకులు స్పందించారు. రూ.కోటి 65 లక్షల విలువ చేసే నూతన ఆసుపత్రి భవనం వచ్చేలా కృషి చేశారు.

చేయి చేయి కలిపి ...
రక్తదాన శిబిరాలు
           హెల్ప్‌ లైన్‌ సొసైటీ ఆధ్వర్యంలో మండలంలో ఏడుసార్లు రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఇరవై ఒక్క గ్రామాలు తిరిగి రక్తదానంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. దాంతో జనం స్పందించారు. సొసైటీ నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి 176 మంది వచ్చి రక్తదానం చేశారు. దాంతో జిల్లాస్థాయిలో జరిగిన రక్తదాన శిబిరాల్లో చిట్వేలు మండలం మొదటిస్థానంలో నిలిచి ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ వారు ప్రశంసా పత్రం, లైఫ్‌ టైం మెంబర్షిప్‌ అవార్డు అందుకుంది. పర్యావరణ పరిరక్షణ దిశగా చర్యలు చేపట్టారు. ప్రతి సంవత్సరం వందల మొక్కలను రోడ్లకు ఇరువైపులా నాటారు. వాటికి రక్షణ వలయాలు ఏర్పాటు చేసి, ప్రతిరోజూ వాటికి నీరు పోసేలా బాధ్యతవహించారు. గ్రామాల్లో పర్యావరణ పరిరక్షణ -మానవాళికి రక్షణ అనే నినాదంతో చెట్ల పెంపకంపై అవగాహన కల్పించారు.

చేయి చేయి కలిపి ...
విపత్తుల వేళ
          కరోనా విపత్తు వేళలో సొసైటీ సభ్యులు చురుగ్గా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఊరూరా తిరిగి కరోనా పట్ల జాగ్రత్తలు, సూచనలు చేశారు. లాక్‌డౌన్‌ సమయంలో పనులు లేక తినేందుకు ఇబ్బందులు పడుతున్న గ్రామాలకు వెళ్లి నాలుగు నెలల సరుకులు పంపిణీ చేశారు. కరోనాతో మృతి చెందిన రోగులను దహన సంస్కారాలు నిర్వహించి, మానవత్వ అవార్డును అందుకున్నారు. ఇటీవల సోమశిల అన్నమయ్య ప్రాజెక్టు ముంపు గ్రామాలను సందర్శించారు. వీరి సేవలను గుర్తించి విదేశాల్లో ఉన్న స్నేహితులు కూడా తమవంతు చేయూతనందిస్తున్నారు. జీవనోపాధి లేక ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు ఉపాధి కల్పించారు. చిరువ్యాపారాలు పెట్టుకునేలా ప్రతి కుటుంబానికి సాయం అందించారు. కొందరు పండ్లు, కూరగాయల వ్యాపారం పెట్టుకోగా, మరికొందరు కుట్టుమిషన్లు కొనుగోలు చేసుకున్నారు. దాతల సహాయంతో ఎంతోమంది పేదల జీవనభృతికి సభ్యులు కృషి చేశారు. చదువుకునే స్థోమత లేని పేద పిల్లలకు, విద్యార్థులకు బట్టలు, పుస్తకాలు అందజేశారు. మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించిన పిల్లలకు నగదు బహుమతులు అందించి ఉన్నత చదువుకు ప్రోత్సాహం అందించారు. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన పేద కుటుంబాలను బతుకుదెరువు కల్పించారు. ఇలా సేవా కార్యక్రమాల కోసం సొసైటీ ఇప్పటి వరకూ 30 లక్షలు ఖర్చు పెట్టి మండల అభివృద్ధికి కృషిచేసింది. సంస్థ చేసిన సేవలను గుర్తిస్తూ 'చిట్వేల్‌ హెల్ప్‌ లైన్‌' సొసైటీ కడప సేవ రత్న, వివేకానంద సేవా పురస్కారం, ఉత్తమ సేవా పురస్కారం లభించాయి.
                                                  - శివ ప్రసాద్‌ గౌడ్‌  -  చిట్వేల్‌ మండల విలేకరి