Aug 18,2022 10:09

కాబూల్‌ : ఆఫ్గనిస్తాన్‌ రాజధాని కాబూల్‌లో బుధవారం సాయంత్రం ఓ మసీదులో భారీ పేలుడు సంభవించింది. ప్రార్థనల సమయంలో ఈ పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. ఈ దారుణ ఘటనలో 32 మంది చనిపోయినట్లు ఆల్‌ జజీరా వార్తా సంస్థ వెల్లడించింది. మరో 33 మంది గాయపడినట్లు పేర్కొంది. మరణించిన వారిలో మసీదు ఇమామ్‌ కూడా ఉన్నట్లు సమాచారం. ఇంటెలిజెన్స్‌ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపడుతున్నాయి. అయితే ఈ పేలుళ్లలో 21 మంది చనిపోయినట్లు కాబూల్‌ పోలీసు అధికార ప్రతినిధి ఖలీద్‌ జర్దాన్‌ తెలిపారు. 'బుధవారం నాడు ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా పేలుళ్లు సంభవించాయి. 21 మంది పౌరులు అక్కడికక్కడే చనిపోయారు. మరో 35 మంది పైగా గాయపడ్డారు' అనిజర్దాన్‌ తెలిపారు. కాగా ఆఫ్గనిస్తాన్‌లో ఆరోగ్య సేవలందిస్తున్న ఇటలీకి చెందిన ఎన్‌జిఒ సంస్థ 'ఎమర్జెన్సీ సర్జికల్‌ ఫెసిలిటీ' డైరెక్టరు స్టెఫెనో సొజ్జా మాట్లాడుతూ ఆసుపత్రికి తీవ్ర గాయాలతో ఉన్న 35 మందిని తీసుకొచ్చారన్నారు. మరో ఇద్దరు మార్గమధ్యంలోనూ, ఒకరు అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు పేర్కొనాురు. పేలుళ్ల ఘటనను తాలిబాన్‌ ప్రభుత్వం కూడా నిర్ధారించింది. తాలిబాన్‌ ప్రభుత్వ అధికార ప్రతినిధి జబీహుల్లా మజహిద్‌ గురువారం ఉదయం మాట్లాడుతూ పేలుళ్లు జరిగిన మాట వాస్తవమేనని నిర్ధారించారు. పలువురు చనిపోయారని, మరికొందరు గాయపడ్డారని ఆయన తెలిపారు. నిర్ధిష్టంగా వివరాలు వెల్లడించలేదు. అయితే పౌరులను, అమాయకులను హత్య చేసినవారిని త్వరలోనే శిక్షించి తీరుతామని జబిహుల్లా తెలిపారు. ఈ ఘటనకుతామే బాధ్యులమని ఏ సంస్థా ప్రకటించలేదు.