Nov 06,2022 08:29

'అయ్యయ్యో! చదివాను గానీ రాసేటప్పుడు ఎంతకీ గుర్తు రాలేదురా..అని, అరె! ఇప్పుడే బండి తాళం ఎక్కడో పెట్టానే.. అని, మందులు అయిపోయాయిరా చెప్పటం మరిచాను..' అనే మాటలు తరచూ వింటూంటాం. వీటన్నింటికీ రెండు పిడికిళ్ళ పరిమాణంలో ఉండే మెదడే కారణమంటే నమ్మగలరా! ఔను అదే నిజం. మనిషి చేసే ప్రతిపనీ మెదడు నియమానుసారమే జరుగుతుంది. జ్ఞానేంద్రియాలన్నింటికీి ఇది ముఖ్యకేంద్రం. మెదడు తనంతట తానే మరమ్మతులు చేసుకోగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉందని ఇటీవల అధ్యయనంలో తేలింది. సెరిబ్రల్‌ కార్టెక్స్‌ ప్రాంతంలోని నాడీకణాలు గాయాలకు అనుగుణంగా తమ ఆకృతిని మార్చుకుని, పునరుత్తేజం పొందుతున్నట్లు గుర్తించారు. మెదడు నిర్మాణం చాలా క్లిష్టమైంది. అన్ని అవయవాల్లాగే మెదడూ కణనిర్మితమే. కానీ మిగిలిన అవయవాల మాదిరిగా కాక దీనిలో విభిన్న రకాల కణాలుంటాయి. అవి రకరకాల విధులను నిర్వహిస్తాయి. ఆ విధి నిర్వహణకు అనుగుణంగానే కణనిర్మిత ప్రాంతాలుంటాయి. అందుకే మెదడు నిర్మాణం సంక్లిష్టంగానూ, వైవిధ్యభరితంగానూ ఉంటుంది.
మెదడు కణాలను న్యూరాన్లు అంటారు. న్యూరాన్లు మెదడుకు, నాడీవ్యవస్థకు అనుసంధాన కర్తలు. ఆలోచించడం, నిర్ణయాలు తీసుకోవడం, గడిచిన విషయాలు గుర్తు పెట్టుకోవడం మెదడు చేసేపని. మెదడులో ఉండే న్యూరాన్ల నిర్మాణాన్ని బట్టి ఈ లక్షణాల ఫ్రీక్వెన్సీ ఉంటుంది. పురుషుల కంటే స్త్రీలలో జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉంటుందని, స్త్రీలలో కంటే పురుషుల్లో తెలివితేటలు 3-5 పాయింట్లు ఎక్కువగా ఉంటాయని రిచర్డ్‌ లిన్‌ (1999-2005) నిర్వహించిన మెటా స్టడీలో తేలింది. 17, 18 సంవత్సరాల వయసు బాలురలో తెలివితేటలు 3.63 పాయింట్లు ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు శాస్త్రవేత్త జాక్సన్‌ రస్టన్‌. ఈయన మెదడులో న్యూరాన్లు, ఒలిగోడెండ్రోసైట్స్‌, మైక్రోగ్లియా, ఆస్ట్రోసైట్స్‌, ఒలిగోడెండ్రోసైట్స్‌, పుటమెన్‌, ఎండోథీలియల్‌.. ఏడు రకాల కణాలపై పరిశోధన చేశారు. అంతేకాక పది కణనిర్మిత ప్రాంతాలను అధ్యయనం చేసి, మెషిన్‌ లెర్నింగ్‌ క్వాంటిఫికేషన్‌ ద్వారా తెలుసుకున్న వివరాలివి. మెదడులోని న్యూరాన్ల క్షీణత వల్లే అల్జీమర్స్‌ వ్యాధి, పార్కిన్సన్స్‌ వంటి వయస్సు సంబంధిత వ్యాధులు కలుగుతాయని ఈ పరిశోధనలో తేలింది. ఆస్ట్రోసైట్స్‌, మైక్రోగ్లియా, ఎండోథీలియల్‌ కణాల తగ్గుదల ప్రధాన కారణం.

  • వృద్ధాప్యంలో..

వృద్ధాప్యం అనేది సహజమైన ప్రక్రియ. అనివార్యం కూడా. వయసునుబట్టి శారీరక మార్పులు జరుగుతాయని మనకు తెలిసిన విషయమే. ఈ మార్పు ప్రభావం మనం చేసే పనులపై కనిపిస్తుంది. మైక్రోగ్లియా, న్యూరోనల్‌ జన్యువులు ఈ ప్రక్రియకు కారణమని పరిశోధనలో తేలింది. మైక్రోగ్లియా డిఫ్యూసిబుల్‌ కారకాలను విడుదల చేసి, ఫాగోసైటోసిస్‌ (భక్షణ చర్య)ల ద్వారా మెదడు అభివృద్ధిని నియంత్రిస్తుంది. మైక్రోగ్లియా మెదడులోని సినాప్టిక్‌ ఎలిమెంట్స్‌, లివింగ్‌ సెల్స్‌, డెడ్‌ సెల్స్‌, ఆక్సాన్‌లను ఫాగోసైటేజ్‌ చేస్తుంది. ఈ ప్రక్రియే మార్పులకు కారణమవుతుంది.
వృద్ధాప్యంలో శారీరక మార్పులతో పాటు మెదడుపైనా ప్రభావముంటుంది. వయసు పెరిగే కొద్దీ మెదడు పరిమాణం తగ్గిపోతుంది. కేంద్ర నాడీవ్యవస్థలోని ఆస్ట్రోసైటిక్‌ గ్లియల్‌ సెల్స్‌ నక్షత్ర ఆకారంలో ఉండి, న్యూరాన్లతో నిర్మితమైన సినాప్సిస్‌ను ఆవరించి ఉంటాయి. మనిషిలో ఒక ఆస్ట్రోసైట్‌ సెల్‌ ఒకేసారి 2 మిలియన్ల సంఘర్షణలకు లోనయ్యే సామర్థ్యం కలిగి ఉంటుంది. మైక్రోగ్లియా, ఆస్ట్రోసైటిక్‌ గ్లియల్‌ సెల్స్‌ మెదడు, వెన్నుపాము అంతటా ఉంటాయి. మైక్రోగ్లియా కేంద్ర నాడీవ్యవస్థలో రోగనిరోధక శక్తిని పెంచే యాంటీ బయాటిక్‌ పాత్రను పోషిస్తాయి.
మెదడు నిర్మాణంలో ఉండే టెంపోరల్‌ లోబ్‌ చెవుల వెనుక భాగంలో ఉంటుంది. దీని సహాయంతోనే మనం వినడం, విషయాన్ని అర్థం చేసుకోవడం, జ్ఞాపకం ఉంచుకోవడం, వస్తువును, ఆకృతిని గుర్తించడం చేయగలుగుతాం. ఇది దెబ్బ తింటే మానసిక రుగ్మతలకు లోనవుతాం. దీనిలో ఉండే సబ్‌స్టాంటియా నిగ్రా 'డోపమైన్‌' హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోన్‌ న్యూరోకెమికల్స్‌ కదలికలను నియంత్రించి.. ఎమోషన్స్‌, ఫీలింగ్స్‌, పనిలో నాణ్యతలను క్రమబద్ధీకరిస్తుంది. దీనిలో భాగంగానే ప్రీ ఫ్రంటల్‌ కార్టెక్స్‌ సహాయంతో సరైన నిర్ణయాలు తీసుకోవడం, తార్కిక ఆలోచన, వ్యక్తిత్వ వ్యక్తీకరణ, సామాజిక స్పృహను కలిగి ఉండటం వంటి కార్యక్రమాలను నిర్వర్తిస్తుంది. మనిషి ప్రవర్తనలన్నింటికీ బాధ్యత వహిస్తుండడం వల్ల ఈ కార్టెక్స్‌కు అత్యున్నత స్థానం ఉంది.

 

  • Image removed.
Image removed.

 

  •  జన్యువుల అధ్యయనం..

పదహారు సంవత్సరాల వయసు నుండి వంద సంవత్సరాల పైన జీవించిన వారి శవాలపై జాక్సన్‌ రస్టన్‌ పరిశోధనలు చేశారు. ఆయన విభిన్న మెదడు ప్రాంతాల్లో న్యూరోడీజెనరేటివ్‌ వ్యాధుల గురించి మైక్రోఅరే (ఒకే సమయంలో వేలాది జన్యువుల వ్యక్తీకరణను గుర్తించే పరికరం) సహాయంతో అధ్యయనం చేశారు. మైక్రోగ్లియల్‌ కణాలు చురుకుగా ఉండగా, నాడీ కణాలు క్షీణిస్తాయి. నాడీ వ్యవస్థలోని జన్యువులపై మైక్రోగ్లియా యాక్టివ్‌గా స్పందించి, భక్షిస్తుందని వారి అధ్యయనంలో తేలింది. మొదట న్యూరాన్లు, రెండు మైక్రోగ్లియాలోని జన్యువులు, మూడు ఒలిగోడెండ్రోసైట్లు ఈ భక్షణకు గురవుతాయని తెలిసింది.

 human-brain-interesting-story-sneha
  • అధ్యయన ఫలితాలు..

ఈ అధ్యయనంలో వెలువరించిన ఫలితాలు వృద్ధాప్యంలో వచ్చే అల్జీమర్స్‌, పార్కిన్సన్స్‌ వ్యాధులకు, మానసిక వికలాంగులకు అవసరమైన జన్యువులను పునరుత్పత్తి చేసే వైద్యశాస్త్ర పురోగతికి తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు.