
భోపాల్ : రాజకీయ రంగంలో మహిళా సాధికారత నేతిబీరకాయలో నేతి చందం వంటింది. గ్రామ పంచాయితీల్లో అయితే అది అసాధ్యమే. భార్యలు గెలిచినా .. పెత్తనమంతా భర్తదే. పేరుకే వారు నేతలు. అయితే భార్యల తరుపున స్వయంగా భర్తలే ప్రమాణస్వీకారాలు చేసే పరిస్థితి కూడా నెలకొంది. ఇటీవల మధ్య ప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. దామోహ్ జిల్లాలోని ఓ గ్రామపంచాయతీలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్ స్థానంలో ఆమె భర్త ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
దామోహ్ జిల్లాలోని గైసాబాద్ పంచాయతీ పరిధిలో షెడ్యూల్ తరగతికి చెందిన ఒక మహిళ సర్పంచుగా గెలుపొందింది. మరికొంతమంది మహిళలు కూడా విజయం సాధించారు. అయితే ప్రమాణ స్వీకారం సమయంలో మహిళలకు బదులుగా అంతా భర్తలే హాజరయ్యారు. అయితే భార్యల స్థానంలో భర్తలే ప్రమాణస్వీకారం చేయడానికి అధికారులు కూడా అనుమతించడం గమనార్హం. ఈ ఘటనపై దామోహ్ పంచాయతీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అజయ్ శ్రీవాస్తవ ఆగ్రహం వ్యక్తం నిబంధనలకు విరుద్ధంగా ఈ కార్యక్రమం జరిగినట్లు తెలుస్తోందని, విచారణ చేపడతామని అన్నారు. పంచాయతీ కార్యదర్శి దోషిగా తేలితే శిక్షిస్తామని అన్నారు.