Aug 18,2022 21:15

సమావేశంలో మాట్లాడుతున్న తహశీల్దార్‌ కళ్యాణ చక్రవర్తి

ప్రజాశక్తి- రేగిడి : గ్రామాల్లో రైతుల పంటలకు ఈ క్రాప్‌ బుకింగ్‌ పూర్తి చేయాలని తహశీల్దార్‌ టీ. కళ్యాణ చక్రవర్తి ఆదేశించారు. ఈ మేరకు గురువారం తన కార్యాలయంలో విఆర్‌ఒలు, వ్యవసాయ అసిస్టెంట్లు, వ్యవసాయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ క్రాప్‌ బుకింగ్‌ వేగవంతం చేయాలన్నారు. సెప్టెంబరు 7లోగా ఈక్రాప్‌ బుకింగ్‌ శాతం శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందులో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పువని హెచ్చరించారు. మండలంలో 18వేల ఎకరాలు ఈ క్రాప్‌ పంటల నమోదు లక్ష్యం కాగా, 12వేల ఎకరాలు వరి సాగు, 4వేల ఎకరాలు మొక్కజొన్న, 2వేల ఎకరాలకు చెరకు రైతులు పండిస్తున్నారని తెలిపారు. ఇప్పటి వరకు 13 ఎకరాలకు ఈక్రాప్‌ బుకింగ్‌ పూర్తి చేసామన్నారు. మిగతా లక్ష్యాలకు చేరుకోవాలని సూచించారు. 5,372 మంది రైతులకు సంబంధించి ఈ కేవైసీ చేయాల్సి ఉండగా కేవలం 2,390 మందికి ఈ కేవైసీ చేసినట్లు తెలిపారు. శత శాతం ఈకేవైసీ పూర్తి చేసేందుకు ఆర్బికేలో ఉన్న వ్యవసాయ అసిస్టెంట్లతో చర్యలు తీసుకున్నామన్నారు. ఈ క్రాప్‌ పంటల నమోదు రైతులు చేసుకుంటేనే బ్యాంకుల ద్వారా రుణాలు పొందవచ్చునన్నారు.. అతివృష్టి, అనావృష్టి వస్తే నష్టపరిహారం అందుతుందని అన్నారు. లేకుంటే ఎటువంటి సహాయం ఉండదన్నారు. ఈ క్రాప్‌ బుకింగ్‌తోనే వరి పంటలు కొనుగోలు, అమ్మకాలు జరుగుతాయని అన్నారు. ఈ సమావేశంలో ఎఒగిరడ మురళీకృష్ణ, డిప్యూటీ తహశీల్దార్‌ గోవిందరావు, ఎంఎస్‌ఒ ఏసుబాబు ఉన్నారు.
ఈ క్రాప్‌ నమోదుతోనే బ్యాంకు రుణాలు
ఈ క్రాప్‌ నమోదుతోనే బ్యాంకుల రుణాలకు అనుసంధానం అవుతుందని అప్పాపురం సర్పంచ్‌ కరణం నిర్మల శ్రీనివాసరావు, వ్యవసాయ అసిస్టెంట్‌ వినీత అన్నారు. ఈ మేరకు అప్పాపురం గ్రామంలో ఈ క్రాప్‌ పంట నమోదు పై గురువారం రైతులతో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంటలకు ఈ క్రాప్‌ బుకింగ్‌తో బ్యాంకుల రుణాలకు అవకాశం ఉంటుందన్నారు. అతివృష్టి, అనావృష్టి ఏర్పడితే పంటలకు నష్ట పరిహారం అందుతుందని తెలిపారు. వరికి సంబంధించి ఈ క్రాప్‌ తో ధాన్యం కొనుగోలు చేయవచ్చునన్నారు. ఈ క్రాప్‌ లేకుంటే పంటలు అమ్మకాలు జరగవని తెలిపారు. రైతులు తమ పంటలకు ఈ క్రాప్‌ బుకింగ్‌ చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో పంచాయతీ కార్యదర్శి గోపి, విఆర్‌ఒ గోపాల్‌, రైతులు పాల్గొన్నారు.
ఈ క్రాపు నమోద తప్పనిసరి
గంట్యాడ: రైతులకు అతి ముఖ్యమైన ఈ క్రాప్‌ నమోదను తప్పనిసరిగా చేయించాలని వ్యవసాయ శాఖ ఎడిఎ నాగభూషణ్‌ అన్నారు. గురువారం పెద్దమజ్జిపాలెం, కొండ తామర పల్లి గ్రామాలలోని ఉడుపు పొలాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ ఎరువులు, పురుగుల మందులను మోతాదులో వేయాలన్నారు. రైతులు తమ సమస్యలను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారులకు తెలియజేసి పరిష్కరించుకోవాలని సూచించారు. ఎరువులు పంపిణీ వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. పంటలు దిగుబడి గురించి ఎప్పటికప్పుడు రైతులకు వివరించాల్సిన అవసరముందున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాకాదికారి పి. శ్యామ్‌ కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.