Oct 03,2022 00:48

నరసరావుపేట యలమంద ఈ-క్రాప్‌ నమోదును పరిశీలిస్తున్న పల్నాడు జిల్లా కలెక్టర్‌ (ఫైల్‌)

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి: ఖరీఫ్‌ సీజన్‌లో వివిధ రకాల పంటలు సాగు చేసిన రైతులంతా తమ పేర్లును ఈ-క్రాప్‌ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ-క్రాప్‌లో రైతులు, పంటల వివరాలు నమోదు చేసే బాధ్యతను గ్రామ వ్యవసాయ, ఉద్యాన సహాయకులకు అప్పగించింది. రైతు భరోసా కేంద్రాల్లో పనిచేస్తున్న వారు ఆయా గ్రామాల్లోనే బాధ్యతలు నిర్వహిస్తున్నా రైతులు, కౌలు రైతులను గుర్తించి ఈ-క్రాప్‌ నమోదులో చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
ఈ-క్రాప్‌లో నమోదు చేసుకుంటేనే రైతులకు ప్రభుత్వం నుండి అందించే సబ్సిడీ, రాయితీలు, ఇతర ప్రయోజనాలు దక్కుతాయని ప్రభుత్వం చెబుతున్నా నమోదులో మాత్రం అలసత్వం కనిపిస్తోంది. గుంటూరు, పల్నాడు జిల్లాలో దాదాపు 4.6 లక్షల మంది భూ యజమానులు ఉండగా ఇప్పటి వరకు 3.57 లక్షల మంది రైతులు వివరాలను ఈ-క్రాప్‌ పోర్టల్‌లో నమోదయ్యాయి. అధికారికంగా గుర్తించిన గణాంకాల ప్రకారం గుంటూరు జిల్లాలో 37,228 మంది కౌలు రైతులను గుర్తించారు. వీరిలో 27,582 మందికి పంట సాగు ధ్రువపత్రాలు (సిసిఆర్‌సి) అందించారు. పల్నాడు జిల్లాలో 33 వేల మంది ఉన్నట్టు అంచనా వేయగా 29 వేల మందికి సిసిఆర్‌సిలు జారీ చేశారు. కౌలు రైతులకు ఈ-క్రాప్‌లో ప్రాధాన్యత దక్కడం లేదు. వారికి ఇకెవైసి, ఇతర సమస్యలు వెంటాడుతున్నాయి. ఆధార్‌తో ఫోన్‌ నంబరు, బ్యాంకు ఖాతా ఇతర వివరాలు నమోదు కాలేదని ఇకెవైసి పూర్తి కాలేదు. ఇది చేయని వారికి ఈ-క్రాప్‌ జరగడం లేదు.భూ యజమాని అంగీకారం కూడా ఇబ్బందికరంగా మారింది. దీంతో కౌలు రైతుల స్థానంలో భూ యజమానులకు ఈ-క్రాప్‌ బుకింగ్‌ చేస్తున్నారు.
ఈ-క్రాప్‌లో నమోదు చేసుకోవడం వల్ల పంటల బీమా, రుణాల మంజూరు, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకు అవకాశం ఉంటుంది. ఆధార్‌, పాస్‌ బుక్‌ ద్వారా ఏ గ్రామ రైతు సమీపంలోని రైతు భరోసా కేంద్రంలో తమ పేర్లు నమోదు చేసుకోవాలి. రైతు ఆధార్‌కార్డు ద్వారా ఏ పంట వేశారో నమోదు చేస్తారు. రైతుకు సంబంధించి పూర్తి ఇకెవైసి కూడా ఇందులో నమోదవుతుంది. ఈ విషయంలో రైతులను చైతన్య పర్చాల్సిన అధికారులు కొన్ని గ్రామాల్లో మొక్కుబడిగా వ్యవహరిస్తున్నారు. ఈ-క్రాప్‌, ఇకెవైసి లేకపోవడం వల్ల పలువురు కౌలు రైతులకు బ్యాంకుల నుంచి రుణాలు కూడా పూర్తిగా అందడం లేదు. గుంటూరు జిల్లాలో 27 వేల మందికి సిసిఆర్‌సి పత్రాలు ఇచ్చినా కేవలం 6845 మందికి కేవలం రూ.33 కోట్లు మాత్రమే రుణాలు ఇచ్చారు. పల్నాడు జిల్లాలో 7.10 లక్షల ఎకరాల సాగు భూమి ఉండగా దాదాపు ఐదు లక్షల ఎకరాల్లోనే ఖరీఫ్‌ సాగైంది. గుంటూరు జిల్లాలో 3.25 లక్షల ఎకరాలు ఉండగా 2.71 లక్షల ఎకరాల్లో పంటలు వేశారు. పల్నాడులో ఐదు లక్షల ఎకరాలకు గాను 3.5 లక్షల ఎకరాలకు, గుంటూరులో 2.71 లక్షల ఎకరాలకు గాను 2 లక్షల ఎకరాలకు మాత్రమే ఈ-క్రాప్‌ పూర్తయినట్టు అధికార వర్గాలు తెలిపాయి. అయితే ఖరీఫ్‌ సీజన్‌ ముగిసి రెండు రోజులే అయినందున మరో వారం రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.