Oct 27,2021 18:59

బెంగుళూరుకు చెందిన విద్యున్‌ 10 ఏళ్ల బాలుడు. లండన్‌లోని నేచురల్‌ హిస్టరీ మ్యూజియం నిర్వహించిన వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రఫీ కాంటెస్ట్‌ 'యంగ్‌ వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ ఆఫ్‌ ది ఇయర్‌-2021' టైటిల్‌ గెలుచుకున్నాడు. 96 దేశాల నుంచి 50 వేల ఎంట్రీలు రాగా... విద్యున్‌ సమర్పించిన 'డోమ్‌ హోమ్‌' అందరి దృష్టిని ఆకర్షించింది.
లండన్‌కి చెందిన మ్యూజియం ఆఫ్‌ నేచురల్‌ హిస్టరీ 1965 నుంచి ఈ పోటీ నిర్వహిస్తుండగా... ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నేచర్‌ ఫొటో గ్రఫీ కాంపిటీషన్‌గా దీన్ని పేర్కొంటారు. మొత్తంగా 19 కేటగిరీల్లో నిర్వహించిన పోటీలో మంగళవారం విజేతలను ప్రకటించారు. గెలుపొందిన వారిలో మన దేశం నుంచి విద్యున్‌ అవార్డు అందుకోవడం విశేషం. విద్యున్‌ తీసిన తలకిందులుగా ఉన్న సాలెగూడు ఫొటోకు ఈ అవార్డు వచ్చింది. మూడేళ్ల వయస్సు నుంచే ఫొటోలు తీయడం నేర్చుకున్న విద్యున్‌, అతడు ఎనిమిదేళ్ల వయస్సు నుంచి ఈ పోటీలకు ఫొటోలు పంపుతున్నాడు. ఈసారి విజేతగా ఎంపికై... తన కల నిజం చేసుకున్నాడు.
'ఇది ఒక సాలీడుని చిత్రీకరించే ఒక ఊహాత్మక మార్గం. పిక్చర్‌ ఫరెఫెక్ట్‌గా ఫ్రేమ్‌లో బంధించబడింది. ఫోకస్‌ కూడా చాలా బాగుంది. కానీ ఫొటో కనిపించే బ్యాక్‌గ్రౌండ్‌లో ప్రకాశవంతమైన ప్రకృతి రంగులు కూడా అంతే అందంగా క్లారిటీగా కనిపించే విధంగా ఫొటో తీశాడు' అనివైల్డ్‌ లైఫ్‌ ఫోటోగ్రఫీ పోటీ మ్యూజియం పేజీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోను షేర్‌ చేస్తూ అభినందనలు తెలిపారు.