Aug 19,2022 10:20

తీవ్రమైన అంశమన్న జస్టిస్‌ చంద్రచూడ్‌

న్యూఢిల్లీ :
తమ మందులను సూచించాలంటూ ఫార్మా కంపెనీలు వైద్యులకు ఇన్సెంటివ్‌లు ఇస్తున్నాయని, దానికి జవాబుదారీగా ఉండాలని పేర్కొంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఉదాహరణకు, డోలో-650 (జ్వరం కోసం సూచించే టాబ్లెట్‌) తయారీ దారులు తమ మందులను ప్రమోట్‌ చేసుకోవడానికి వైద్యుల కోసం వెయ్యి కోట్ల రూపాయల విలువచేసే ఉచితాలను అందించారని పిటిషన్‌ పేర్కొంది. ఫెడరేషన్‌ ఆఫ్‌ మెడికల్‌, సేల్స్‌ రిప్రజెంటేటివ్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించిన జస్టిస్‌ చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎఎస్‌ బప్పన్నలతో కూడిన ధర్మాసనం 'తీవ్రమైన అంశం'గా పేర్కొంది. 10 రోజుల్లోగా సమాధానం చెప్పాలని కేంద్రాన్ని కోరింది. 'వినేందుకు చాలా కఠినంగా ఉంది. నాకు కోవిడ్‌ ఉన్నప్పుడు కూడా అదే మందు ఇవ్వాలా అని అడిగారు. ఇది తీవ్రమైన విషయం' అని జస్టిస్‌ చంద్రచూడ్‌ అన్నారు.
            పిటిషనర్‌ తరుపు న్యాయవాది సంజయ్ పారిఖ్‌ మాట్లాడుతూ.. 'డోలో సంస్థ వారి మందులను ప్రమోట్‌ చేయాలని వైద్యులకు రూ. 1000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టింది' అని కోర్టుకు తెలిపారు. తొమ్మిది రాష్ట్రాల్లోని బెంగళూరుకు చెందిన మైక్రో ల్యాబ్స్‌ లిమిటెడ్‌కు చెందిన 36 ప్రాంతాల్లో దాడులు నిర్వహించిన తర్వాత సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్సెస్‌ (సిబిడిటి) ఈ ఆరోపణ చేసింది. రూ. 300 కోట్ల మేరకు పన్ను ఎగవేతకు పాల్పడినట్లు పేర్కొంది. దీని ఆధారంగా పిటిషన్‌ దాఖలైంది. ఈ అనైతిక పద్ధతులు మందుల అధిక వినియోగానికి దారి తీయడమే కాకుండా, రోగుల ఆరోగ్యానికి హాని చేస్తాయని పిటిషన్‌ పేర్కొంది. ఇటువంటి అవినీతి.. మార్కెట్‌లో ఆ మందులకు డిమాండ్‌ రేటును కూడా పెంచవచ్చునని తెలిపింది. ప్రస్తుతం ఉన్న స్వేచ్ఛాపూరిత నిబంధనల కారణంగా.. ఫార్మా కంపెనీల అనైతిక పద్ధతులు పెరుగుతున్నాయని, కోవిడ్‌ సమయంలో కూడా బయటపడ్డాయని పేర్కొంది. మానిటరింగ్‌ మెకానిజం, పాదర్శకత, జవాబుదారీ తనం అందించడం ద్వారా యూనిఫాం కోడ్‌ ఆఫ్‌ ఫార్మాసూటికల్‌ మార్కెటింగ్‌ ప్రక్రియ ప్రభావవంతంగా ఉండేలా చూడాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది. ఈ మేరకు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్‌ 29న మరోసారి ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.