Jan 09,2022 12:22

ఒకరు ఎగసి పడే అగ్నిశిఖ.. మరొకరు చల్లని తెమ్మెర.. మనుషులు పరువు పేరుతో దాచాలనుకునే విషయాలను జంకు లేక చర్చకు పెట్టే వారొకరైతే, సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను కథలుగా మలచేవారు మరొకరు. ఆ ఇద్దరిలో ఒకరు శాంతి కె అప్పన్న, కన్నడ రచయిత్రి, కవయిత్రి. మరొకరు ఏ వెణ్ణిల, తమిళ రచయిత్రి, కవయిత్రి. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన శీతాకాల కథా సమావేశానికి వీరిద్దరూ ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చారు. (ఈ సమావేశాలను ప్రతి ఏటా రచయితలు ఖదీర్‌బాబు, సురేష్‌ గత రెండు దశాబ్దాలుగా నిర్వహిస్తున్నారు. ) వారి గురించిన విశేషాలే ఈ ప్రత్యేకం.

    నుషులు చీకటి విషయాలుగా, రహస్యాలుగా, చెప్పరానివిగా భావించి, దాచుకునే విషయాలను.. సహజంగా రచయితలు ప్రస్తావించడానికి వెనుకాడే శృంగారాన్ని.. తన రచనల్లో విస్తృతంగా చిత్రించి, చర్చించారు శాంతి అప్పన్న. శృంగార వాంఛలు, శరీర ధర్మమే తప్ప.. సిగ్గుపడి దాచుకోవలసిన విషయం కాదని కుండ పగలేస్తారు ఆమె.
     సున్నితమైన అటువంటి అంశాలను స్వేచ్ఛగా చిత్రించినందువల్ల ఆమెపై కన్నడ నాట అనేక విమర్శలు వచ్చాయి. అయితే ఆ విమర్శలన్నింటికీ ఆమె కథా సంకలనం 'మనసు అభిసారికె' కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం గెల్చి, జవాబు చెప్పింది.
'మహిళా రచయితలు శృంగార విషయాలను చర్చించినా, శృంగార దృశ్యాలను చిత్రించినా అవి ఆమె సొంత అనుభవాలుగా భావించే పాఠకులు కోకొల్లలుగా ఉన్నారు. ఒక సాహిత్య సభలో వ్యక్తి నేరుగా నాతోనే అనేశాడు 'మీ అనుభవాలను బాగా ధైర్యంగా రాసుకున్నారు అని' అన్నారు శాంతి.
'కథలో విషయాలు ఎవరి అనుభవాలైతే మాత్రమేం? అవి నా అనుభవాలైతే మాత్రం మీకేం అభ్యంతరం? కథను వదిలేసి, దాని మీద మీరెందుకు దృష్టి పెట్టాలి?' అని అటువంటి పాఠకులకు సూటి ప్రశ్న వేశారామె.
బోల్డ్‌ రైటర్‌గా పేరు తెచ్చుకున్న శాంతి.. చెన్నైలో రైల్వేలో ఆరోగ్య విభాగంలో పనిచేస్తున్నారు. కర్ణాటకలోని కూర్గ్‌ ప్రాంతానికి చెందిన ఒక చిన్న గ్రామంలో పెరిగిన శాంతి.. 'ఆ చిన్న పల్లెటూరిలో ఇళ్లన్నీ దూరంగా విసిరేసినట్టు ఉండటంతో ఎక్కువమంది స్నేహితులు ఉండేవారు కాదు. అందుకేనేమో నా ఆలోచనలన్నీ పేపర్‌ మీద పెట్టడం అప్పటి నుంచే మొదలైంది' అంటారు. ఆరేళ్ల వయసు నుంచే శాంతి రాయడం మొదలుపెట్టారు.
జీవితంలో తను ఎదగడానికి ప్రతి మలుపులోనూ తల్లి పాత్ర ఉందని చెప్పే శాంతి.. కథను ఆసక్తికరంగా చెప్పడం ఆమె నుంచే నేర్చుకున్నానని చెప్పారు. తను కథక్‌ నృత్యం, ఫ్లూట్‌ నేర్చుకోడానికి కూడా తల్లే ప్రోత్సహించిందని గుర్తు చేసుకున్నారు.
శాంతి కథా రచయిత్రి మాత్రమే కాక కవిత్వం కూడా రాస్తారు.
కథలో పాత్రలను తాను 'వ్యక్తులు' గా చూస్తాను తప్ప, స్త్రీలు-పురుషులు అని జెండర్‌ పరంగా చూడనని, అందుకే పాత్రల భావాలను, ప్రేమావేశాలను సైతం స్వేచ్ఛగా వ్యక్తీకరించి, రాయడం తనకు సాధ్యపడుతుందని శాంతి చెప్పారు.
ఏ రకమైన వాదాలనూ తను విశ్వసించనని చెప్పే శాంతి.. మనిషి మనసు ఆడే క్రీడల మీద, వివిధ పరిస్థితుల్లో మనిషి ప్రవర్తనను గమనించడం మీద తాను ఆసక్తి చూపిస్తానని, తన రచనలకు సరుకు అక్కడ నుంచే లభిస్తుందన్నారు.
'మానవ స్వభావాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే బోలెడంత సంక్లిష్టత కనిపిస్తుంది. 100 శాతం మంచివారూ, 100 శాతం చెడ్డవారూ ఎవరూ ఉండరు. ఈ పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలిస్తే, మనుషులను కాక పరిస్థితుల మీద అవగాహనతో మంచి సాహిత్యాన్ని సృష్టించగలుగుతారు రచయితలు.
'వాదాలు, భావజాలాల మీద నిర్మించబడే సాహిత్యం పరిమిత కోణాలనే స్పృశిస్తుంది. రచయిత ఆలోచనల్ని ఒక చట్రంలో నియంత్రించి, భారాన్ని పెంచుతుంది. అది కుండీలో పెరిగే మొక్కలాగ పరిమితమైంది. కానీ రచయిత ఆలోచనలు అడవిలా విస్తరించాలి' అంటారు శాంతి.
అవార్డుల కోసం పుస్తకాలను రచయిత స్వయంగా పంపి, దరఖాస్తు చేసుకోడానికి తాను వ్యతిరేకమంటారు శాంతి. పబ్లిషర్ల నుంచి అవార్డ్‌ కమిటీలు ఆ ఏడాది ప్రచురితమైన పుస్తకాలను తెప్పించి, ఎలాంటి ప్రభావాలకు లోనుకాకుండా అవార్డులను ప్రకటించడం మంచి పద్ధతి అంటారు.
 

                                                                       ***

'ద్రవిడ సంస్కృతి మనదనే విషయాన్ని దక్షిణ భారతీయులంతా గుర్తు పెట్టుకుని మెలగాలి' అంటారు తిరువణ్ణామలై జిల్లాలో గణిత ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న రచయిత్రి ఏ వెణ్ణిల.
వెణ్ణిల కవయిత్రి, రచయిత్రి మాత్రమేకాక, స్వయంగా పబ్లిషర్‌ కూడా. చరిత్ర ఆమె అభిమాన విషయం. స్త్రీ వాదం, చరిత్రల మీద ఆమె 15కి పైగా పుస్తకాలను వెలువరించారు. ద్రవిడ ఉద్యమంలో పనిచేసిన తన తండ్రి ప్రభావం తనమీద చాలా ఉందంటారు వెణ్ణిల.
దగ్గరి స్నేహితులు, బంధువుల వల్ల ఆడపిల్లలు ఎదుర్కొనే లైంగిక వేధింపుల గురించి వెణ్ణిల కథలు రాశారు. నిత్య జీవితంలో, సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న అనేక అంశాల మీద ఆమె రచనలు చేశారు.
తాను పనిచేసే స్కూల్లో, మరుగుదొడ్డి లేకపోవడం వల్ల ఆడపిల్లలు పీరియడ్స్‌ సమయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఒక ఆవేదనా భరిత కవితగా వెణ్ణిల అక్షరీకరించారు. 'ఆ కవిత చదివిన జిల్లా కలెక్టర్‌, మా స్కూల్లో టారులెట్స్‌ నిర్మాణానికి తొమ్మిది లక్షలు మంజూరు చేశారు' అని గుర్తు చేసుకుంటారు వెణ్ణిల.
ప్రముఖ వ్యక్తుల జీవితపు చివరి రోజుల మీద వెణ్ణిల 'ది హిందూ' లో రాసిన వ్యాస పరంపర.. 'మరణం ఒరు కలై' గా పుస్తక రూపం దాల్చింది.
కుటుంబ వ్యవస్థ మీద, చరిత్ర మీద పుంఖాను పుంఖాలుగా వెణ్ణిల వ్యాసాలు రాశారు. 2018లో 'గంగపురం' అనే చారిత్రాత్మక నవల కూడా రాశారామె. అనేక కవితా, కథా సంకలనాలు వెణ్ణిల వెలువరించారు.
అనేక పుస్తకాలకు కూడా ఆమె సంపాదకత్వం వహించారు. సాహిత్య అకాడెమీ వెలువరించిన కవితా సంకలనం 'కనవుం విడివుం' పుస్తకానికి, 1930-2014 మధ్య కాలంలో వచ్చిన తమిళ రచయిత్రుల కథలతో వెలువడిన 'మీత మిరుక్కం సోర్కల్‌' గ్రంథానికీ ఇంకా మరికొన్ని రచనలకు వెణ్ణిల సంపాదకురాలుగా పని చేశారు.
ఇండియా, ఆస్ట్రేలియా, శ్రీలంక, ఫ్రాన్స్‌ దేశాల్లో నివశిస్తున్న తమిళ కవయిత్రుల కవితల్ని సేకరించి వెలువరించడంలో వెణ్ణిల అసమాన కృషి చేశారు.
75 సంవత్సరాల తమిళ రచయిత్రుల సాహితీ కృషిని గ్రంథీకరించడంలో వెణ్ణిల ప్రముఖ పాత్ర పోషించారు.
వెణ్ణిల రచనలు అనేక యూనివర్సిటీలలో పాఠ్యాంశాలుగా ఎన్నికయ్యాయి. ఆమె రచనల మీద 10 మంది విద్యార్థులు, ఏడుగురు పిహెచ్‌డీ విద్యార్థులు పరిశోధన చేసి, పట్టాలు పొందారు. అంతేకాక ఒక తమిళ సినిమాకి సంభాషణలు రాయగా, మరొక సినిమాకి గీత రచయితగా వెణ్ణిల పనిచేశారు.
మహిళ సమస్యల మీద మరిన్ని రచనలు చేయాలన్నదే తన ధ్యేయమని వెణ్ణిల చెపుతారు.
 

- సుజాత వేల్పూరి