Oct 27,2021 12:48

న్యూఢిల్లీ : క్రీడల్లో గెలుపోటములు సహజం. కానీ క్రీడలను క్రీడాస్ఫూర్తితో చూడాల్సిన మనువాదులు... గెలిచిన పరాయి దేశాన్ని పొడిగితే... దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు. తాజాగా ఇటువంటి సంఘటనలు పలు చోట్ల చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల పాకిస్తాన్‌తో జరిగిన టీ-20 మ్యాచ్‌లో భారత్‌ ఓడిపోయిన సంగతి విదితమే. అయితే పాకిస్తాన్‌ ఆటతీరును మెచ్చుకున్న భారతీయులపై వివిధ ప్రాంతాల్లో అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. వారిపై దేశ ద్రోహ ఆరోపణలు మోపడమే కాకుండా దాడులు కూడా జరుగుతున్నాయి.

ఆగ్రా
ఈ టీ-20లో ప్రతిభ కనబర్చిన పాక్‌ ఆటగాళ్లను ప్రశంసిస్తూ... ఆగ్రాలోని బిచ్‌పురిలో ఉన్న రాజా బల్వంత్‌ సింగ్‌ ఇంజనీరింగ్‌ టెక్నాలజీ కాలేజీలో ఇంజనీరింగ్‌ చదువుతున్న కాశ్మీర్‌కు చెందిన ముగ్గురు విద్యార్ధులు తమ ఫోన్లలోని వాట్సప్‌లో స్టేటస్‌గా పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న బిజెపి యువజన విభాగం భారతీయ జనతా యువ మోర్చాకు చెందిన స్థానిక నేతలు విద్యార్ధులపై జగదీష్‌పుర పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో.. ఆ ముగ్గుర్ని యాజమాన్యం సస్పెండ్‌ చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా వారిపై చర్యలు తీసుకున్నట్లు ఆగ్రా నగర పోలీస్‌ సూపరింటెండెంట్‌ వికాస్‌ కుమార్‌ తెలిపారు. ఈ ఫిర్యాదు అందిన వెంటనే వారిని సస్పెండ్‌ చేసినట్లు కళాశాల అడ్మినిస్ట్రేషన్‌, ఫైనాన్స్‌ డైరెక్టర్‌ డా. పంకజ్‌ గుప్తా పేర్కొన్నారు. ఈ విద్యార్థులు ప్రధాని మంత్రి సూపర్‌ స్పెషల్‌ స్కీం కింద చదువుతున్నారని, విద్యార్థుల చర్య గురించి పిఎం కార్యాలయానికి, ఎఐసిటిఇకి కూడా చెప్పామని, అయితే విద్యార్థులు క్షమాపణ చెప్పినట్లు గుప్తా వెల్లడించారు.

ఇదేనా క్రీడా స్ఫూర్తి... పలు చోట్ల విద్యార్థులపై దాడులు, సస్పెండ్‌

జమ్ము
ఆదివారం జరిగిన మ్యాచ్‌ సందర్భంగా పాకిస్తాన్‌కు అనుకూలంగా నినాదాలు చేశారన్న ఆరోపణలపై జమ్ములోని సాంబాలోని ఓ గ్రామం నుండి ఆరు, ఏడుగుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో పలు మార్లు షేర్‌ కావడంతో.. నిరసనలతో పాటు పోలీసుల దృష్టికి వెళ్లింది. అయితే వీరిపై కేసులు నమోదు చేయడాన్ని సాంబా సీనియర్‌ పోలీస్‌ సూపరింటెండ్‌ సమర్థించుకున్నారు. తాము చేసినది తప్పని ప్రజలను ఎవ్వరినైనా అడగవచ్చునని అన్నారు.

ఉదయ్ పూర్
'మేం గెలిచాం' అంటూ పాకిస్తాన్‌ క్రికెటర్లు అంటున్నట్లుగా ఓ ఫొటోను వాట్సప్‌లో స్టేటస్‌గా పెట్టినందుకు రాజస్తాన్‌లోని ఉదరుపూర్‌కు చెందిన ఓ ప్రైవేటు స్కూల్‌ టీచర్‌పై వేటు పడింది. ఆమెను విధుల నుండి తొలగించింది. ఆమె స్టేటస్‌కు సంబంధించిన ఫొటోలను స్క్రీన్‌ షాట్‌ తీసి.. పలువురు సోషల్‌ మీడియాలో ప్రసారం చేయడంతో.. ఆమె టార్గెట్‌ అయ్యారు. దీంతో హిందూత్వ మూకలు పాఠశాల వద్దకు చేరుకుని రచ్చ చేశారు. అంతేకాకుండా ఆమెపై ఐపిసిలోని 153 బి సెక్షన్‌ కింద కేసు నమోదు చేసినట్లు అంబ మాతా పోలీస్‌ స్టేషన్‌ అధికారి దల్పత్‌ సింగ్‌ అన్నారు. కాగా, ఆమె ఓ వీడియోలో మాట్లాడుతూ... తన ఇంట్లో సరదాగా జట్లను కేటాయించుకున్నామని, తాను పాకిస్తాన్‌ వైపుకు వెళ్లాల్సి వచ్చిందని, అంటే తాను పాక్‌కు మద్దతునిస్తున్నానని అర్థం కాదని, తాను భారతీయురాలినని పేర్కొన్నారు. ఆమె క్షమాపణ చెప్పారు.

శ్రీనగర్‌
పాక్‌ క్రికెట్‌ మ్యాచ్‌ గెలిచినందుకు సంబరాలు చేసుకున్నారని ఆరోపిస్తూ శ్రీనగర్‌లోని గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజ్‌ (జిఎంసి) విద్యార్థులు, షేరీ కాశ్మీర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎస్‌కెఐఎంఎస్‌) కాలేజ్‌ యాజమాన్యం, హాస్టల్‌ వార్డెన్లపౖౖె వేర్వేరుగా జమ్ముకాశ్మీర్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. వీడియోల ఆధారంగా ఈ కేసు నమోదైంది. అయితే ఈ వీడియోల్లో వాస్తవమెంతో తెలుసుకునేందుకు పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇక పంజాబ్‌లో మ్యాచ్‌ అయిన తర్వాత భాయి గురుదాస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ విద్యార్ధులపై కొంత మంది దాడులు చేసి.. విధ్వంసం సృష్టించిన సంగతి విదితమే.