Jul 30,2021 00:55

మాట్లాడుతున్న డాక్టర్‌ గంగారావు, చిత్రంలో కుమార్‌

ప్రజాశక్తి - విశాఖపట్నం
విశాఖపట్నం మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (విఎంఆర్‌డిఎ) విడుదల చేసిన మాస్టర్‌ ప్లాన్‌-2041 పూర్తిగా రియల్‌ ఎస్టేట్‌ కేంద్రంగా చేసుకొని రూపొందించబడిందని సిపిఎం గ్రేటర్‌ విశాఖ నగర కార్యదర్శి డాక్టర్‌ బి.గంగారావు అన్నారు. సిపిఎం నగర కార్యాలయంలో గురువారం ఆ పార్టీ నగర కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌కెఎస్‌వి.కుమార్‌తో కలిసి డాక్టర్‌ గంగారావు విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ మాస్టర్‌ ప్లాన్‌ వల్ల పెద్దఎత్తున వ్యవసాయ భూములు వ్యవసాయేతర ప్రయోజనాల కోసం మార్చబడతాయని, భూరేట్లు పెరిగి భారీగా స్పెక్యులేషన్స్‌కు దారితీస్తాయని పేర్కొన్నారు. మధ్యతరగతి, దిగువ తరగతికి గృహకల్పన ఎండమావిగా మారుతుందని, గ్రామీణ ప్రజలను పెద్దఎత్తున భూమి నుండి వేరుచేసి పట్టణ వలస కూలీలుగా మారుస్తుందని పేర్కొన్నారు. అందువల్ల విఎంఆర్‌డిఎ మాస్టర్‌ ప్లాన్‌-2041ను సిపిఎం తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. వాస్తవ పరిస్థితులకు అనుగునంగా, వికేంద్రీకరణ ధృక్కోణంలో స్థానిక సంస్థలను, ప్రజలను, మేధావులను, పౌరసంస్థలను భాగస్వాములను చేసి ప్రజల అభివృద్ధే లక్ష్యంగా మాస్టర్‌ప్లాన్‌ మూసాయిదాలో మార్పులు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.
ఈ ముసాయిదాపై అభ్యంతరాలు, సూచనలకు కేవలం 45రోజులు మాత్రమే అవకాశం ఇచ్చారని, నాలుగు రోజుల క్రితమే తెలుగులో వచ్చిందని తెలిపారు. ఉద్దేశపూర్వకంగా ప్రజల నుండి విస్తృతంగా అభిప్రాయాలు, అభ్యంతరాలకు అవకాశం లేకుండా మొక్కుబడి తంతుగా అభిప్రాయ సేకరణ చెపట్టిందని, పట్టణ, గ్రామ స్థానిక సంస్థలను భాగస్వాములను చేయలేదని విమర్శించారు. 41 శాతం శ్రామిక జనాభా ఉన్న 35 వ్యవసాయ మండలాల పరిధిలోని వ్యవసాయ భూములన్నీ ఫామ్‌హౌస్‌, గోల్ప్‌ కోర్టులు, రేస్‌కోర్సులు, డిస్నీ, ఎమ్యూజ్‌మెంట్‌ పార్కుల పేర ధ్వంసం చేయబడతాయని పేర్కొన్నారు. ల్యాండ్‌పూలింగ్‌ పేర భూములన్నీ సంపన్నుల పరమవుతాయని, ఫలితంగా ఈ ప్రాంత రైతులు, శ్రామికులు వలసకూలీలుగా మారిపోతారని, ఇది పెద్ద ఎత్తున పేదరికానికి దారితీస్తుందని తెలిపారు. కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌ నిబంధనలను ఈ ప్రణాళిక బేఖాతరు చేస్తుందని, సముద్ర తీరప్రాంతం వ్యాపార, వాణిజ్య సంస్థలపరం కానుందని, తీరప్రాంత ప్రజలకు తీవ్ర హాని చేస్తుందని పేర్కొన్నారు. అశాస్త్రీయంగా, వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా రోడ్ల వెడల్పు ప్రతిపాదనలు చేశారని, దీని పేర సుంకాన్ని మర్కెట్‌ రేటుపై 1శాతం కొత్తగా వసూలు చేయటానికి నిర్ణయించారని తెలిపారు. మాస్టర్‌ ప్లాన్‌ వల్ల స్థలాలు కోల్పోయేవారికి ఎలాంటి నష్టపరిహారం ఇవ్వదని, ఈ ప్రణాళికలో మురికివాడలకు చోటులేదని చెప్పారు.
టౌన్‌ డెవలప్‌మెంట్‌ ప్లానింగ్‌, వుడా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసేవారి బిల్డింగ్‌ కో-ఆపరేటివ్స్‌ ద్వారా విశాఖ నగరంలో కాలనీల ఏర్పాటు జరిగాయని, కాని వీటిని ఈ మూసాయిదా విస్మరించిందని, కేవలం రియల్‌ఎస్టేట్‌ ద్వారా విశాఖ నగరం విస్తరించినట్లు చిత్రీకరించటానికి ప్రయత్నించిందని తెలిపారు. లక్షా 40వేల కోట్లరూపాయలు మౌలిక సదుపాయాల కల్పన కొరకు పెట్టుబడుల కల్పన జరుతుందని ముసాయిదా పేర్కొందని, గత ప్రణాళిక-2021లో పేర్కొన్న అత్యధిక ప్రాజెక్టులు చేపట్టలేదని, కేవలం ప్రజలను తప్పుదారి పట్టించటానికే ఈ అంకెలని పేర్కొన్నారు. మెట్రోరైలుకు అతీగతీలేదని, 12ఏళ్ళ క్రితం చేపట్టిన బిఆర్‌టిఎస్‌ రోడ్లే నేటికీ పూర్తికాలేదని, గోదావరి నుండి విశాఖకు 400 ఎంజిడిల మంచినీరు ప్రాజెక్టు నేటికీ కలగనే కొనసాగుతుందని పేర్కొన్నారు.