Aug 01,2022 07:36

రెపరెపలాడే జెండాలు
అందంగానే వుంటాయి
కనపడని గాలి
కనిపించే రంగుల ఖేళి
దృశ్యం సంపూర్ణం కాదు.

ప్రజాస్వామ్యం
నేడొక మూస సమాసం
ప్రజలు వేరు
స్వాములు వేరు
అర్థ విపరిణామం నేటి శేషం.

వ్యాపారం
దిశను మార్చుకున్నప్పుడల్లా
కులమతాల ఇంజనీరింగ్‌ మారుతుంది.
ఫిలాసఫీలు త్వర త్వరగా తగలబడి పోతున్నాయి
చరిత్ర
దీనంగా పిచ్చి చూపులు చూస్తుంది.

సర్వేల కోసం
పీకేలే దిగి రానక్కర లేదు
కామన్‌ సెన్స్‌ ఉన్న ప్రతివాడూ
ఓ కాలజ్ఞాని!

మీరెన్నైనా చెప్పండి!
ఈ దేశంలో ఓటరు
నిలువునా కరప్టై ఉన్నాడు
ఫలితాల క్రెడిబిలిటీ
రాజనీతికి పిటీ!

- డాక్టర్‌ ఎన్‌.గోపి