
జెరూసలేం : అమెరికాలో కొత్తగా బైడెన్ ప్రభుత్వం ఏర్పడినందున దాన్ని అవకాశంగా తీసుకుని ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయిల్ ఆక్రమిత చర్యలను అడ్డుకునేందుకు తగిన ప్రయత్నాలు చేయాలని 400 మందికి పైగా యురోపియన్ పార్లమెంటేరియన్లు తమ నేతలను కోరారు. ఈ మేరకు వారు తమ సంతకాలతో కూడిన లేఖను విడుదల చేశారు. యురోపియన్ పార్లమెంట్ లేదా సెనెట్, జాతీయ చట్టసభల్లో పనిచేసిన వీరు యురోపియన్ యూనియన్ విదేశాంగ విధాన చీఫ్ జోసెప్ బారెల్ను ఉద్దేశించి లేఖ రాశారు. మధ్యప్రాచ్య దౌత్యంపై దిద్దుబాటు చర్యలకు బైడెన్ ప్రభుత్వం అవకాశమిచ్చినందున దాన్ని ఉపయోగించుకోవాలని ఆ లేఖ కోరింది. గత ట్రంప్ ప్రభుత్వం ఈ ఘర్షణలను మరింత ఆజ్యం పోసేలా వ్యవహరించిందని లేఖ పేర్కొంది. ఇజ్రాయిల్-పాలస్తీనా వివాదానికి సంబంధించి ఉన్న అంతర్జాతీయ ఏకాభిప్రాయాన్ని ట్రంప్ విచ్ఛిన్నం చేశారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో సాధారణ సంబంధాలు నెలకొల్పుకునేందుకు గానూ వెస్ట్ బ్యాంక్‌లో అక్రమిత చర్యలను ఆపేందుకు ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు గతంలో అంగీకరించారు. అయితే ప్రస్తుతం అక్కడ వాస్తవంగా నెలకొన్న పరిణామాలను గమనిస్తే ఆక్రమిత చర్యలు ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోందని ఆ లేఖ పేర్కొంది. బైడెన్ ప్రభుత్వంతోకలిసి పనిచేసి ఇజ్రాయిల్ అధీనంలోని ప్రాంతాల ప్రజలందరి హక్కులు, శాంతి, భద్రతలను మరింత ముందుకు తీసుకెళ్ళాలని లేఖ కోరింది.