
జెరూసలెం : పాలస్తీనా అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ ఆక్రమిత తూర్పు జెరూసలెంలో మరిన్ని యూదు ఆవాసాల నిర్మాణానికి ఇజ్రాయిల్ బరితెగించింది. కొత్తగా 1465 యూదుల ఇళ్ళను నిర్మించేందుకు ఇజ్రాయిల్ పథకం వేసినట్లు పీస్ నౌ అనే ఎన్జివో సంస్థ సోమవారం వెల్లడించింది. ఆక్రమిత ప్రాంతంలో ఇజ్రాయిల్ ఇలా ముందుకు చొచ్చుకురావడాన్ని ఆ సంస్థ తీవ్రంగా నిరసించింది. ఈ చర్య జెరూసలెంలో శాంతి సుస్థిరతలకు తీవ్ర విఘాతం కలిగిస్తుందని పీస్ నౌ పేర్కొంది. రెండు దేశాల ఏర్పాటు అవకాశాలను ఇది దెబ్బతీస్తుందని, హర్ హోమా ప్రాంతాన్ని గివట్ హమటోస్తో కలిపేందుకు ఇజ్రాయిల్ పన్నాగం పన్నిందని తెలిపింది. దీంతో ఇజ్రాయిల్ దక్షిణ ప్రాంత వలయం పూర్తవుతుందని, తూర్పు జెరూసలెం, బెత్లెహామ్ మధ్య గల పాలస్తీనా ఇరుగు పొరుగు ప్రాంతాల అనుసంథాన క్రమం దెబ్బ తింటుందని పీస్ నౌ పేర్కొంది. ప్రస్తుతం తూర్పు జెరూసలెంలో దాదాపు 3లక్షల మంది పాలస్తీనియన్లు వున్నారు. వీరు నిరంతరంగా తరలింపులు, ఇళ్ళు కూలగొట్టడాలు, స్థానభ్రంశం వంటి సమస్యలను ఎదుర్కొంటూనే వున్నారు. ఈ చర్యల ద్వారా పాలస్తీనియన్లను ఆ ప్రాంతం నుండి వెళ్లగొట్టాలన్నది ఇజ్రాయిల్ పన్నాగంగా ఉంది.