Oct 16,2021 18:57

యశస్విది చిన్న వయసైనా తన ఆలోచనలు వినూత్నంగా ఉంటాయి. పదిహేనేళ్ల వయస్సులోనే పర్యావరణానికి హాని కలిగించే వ్యర్థ పదార్థాలను ఉపయోగకరంగా మార్చడంపై ప్రయోగాలు చేసింది. కోడి, చేపల మార్కెట్ల నుంచి వస్తున్న కోడి ఈకలు, చేపల పొలుసుపై దృష్టి పెట్టి, ఇటుకల తయారీ చేసి జాతీయ స్థాయిలో ఇన్‌స్పైర్‌ అవార్డు అందుకుంది.
కృష్ణాజిల్లా రామవరప్పాడుకి చెందిన యశస్వి చిన్నప్పటి నుంచి చురుకైన అమ్మాయి. గుణదల సెయింట్‌జాన్స్‌ స్కూల్లో పదో తరగతి వరకు చదివింది. క్లాసులో చెప్పిన పాఠాలను వినడమే కాకుండా తోటి స్నేహితులకు వివరంగా చెప్పడం, వాటిని ప్రయోగాత్మకంగా ప్రదర్శన రూపంలో చేసి చూపిస్తుండేది. పాఠాల్లో సందేహాలు వస్తే టీచర్ల వద్దకువెళ్లి నివృత్తి చేసుకునేది. అది చూసిన ప్రిన్సిపల్‌ రామభారతి, యశస్విని ప్రోత్సహించడం మొదలుపెట్టారు. ఆరవ తరగతిలో ఉండగానే యశస్వి ఫిజిక్స్‌ (భౌతికశాస్త్రం) ఫార్ములాస్‌పై పట్టు సాధించింది. లెక్కల్లో ఏ సూత్రం అడిగినా వెంటనే సమాధానం చెప్పేది. చదువులో ఏ పరీక్ష పెట్టినా మొదటి స్థానంలో నిలిచేది. ఇవనీు సైన్సు ఉపాధ్యాయుడు హేమంత్‌కుమార్‌ను ఆకట్టుకునాుయి. అప్పటి నుంచి సైన్సుఫేర్‌ పోటీలకుయశస్వినిసిద్ధం చేస్తూ వచ్చారు. సైన్సు పట్ల తనకు ఉన్న ఇష్టం, అందులో భాగంగా విషయ పరిజ్ఞానం పెంచుకునే ప్రయత్నంలో ల్యాబులకు వెళ్లి పరీక్షలు చేసింది. అలా తాను తయారుచేసిన కొత్త ప్రాజెక్టులను మండలం, జిల్లా స్థాయిలో సైన్సుఫేర్‌ పోటీల్లో ఎంపికై చాలా బహుమతులు అందుకుంది.
సమయం వృథా చేయకుండా..
తల్లిదండ్రులు శ్రీలక్ష్మి, తండ్రి దేవరామరాజు మొదట హైదరాబాద్‌లో నివాసం ఉన్నారు. అక్కడ యశస్వి మూడేళ్ల వయస్సులో కర్ణాటక సంగీతం నేర్చుకోవడం మొదలు పెట్టింది. రెండేళ్ల తర్వాత తల్లి శ్రీలక్ష్మి ఉద్యోగం రీత్యా రామవరప్పాడులోని అమ్మమ్మ తాతయ్య ఇంటికి వచ్చారు. చదువుతో పాటు సంగీతం నేర్చుకుంది. ప్రతి సంవత్సరం వేసవి సెలవుల్లో ఇంటి దగ్గర ఖాళీగా ఉండకుండా డ్యాన్స్‌, చెస్‌, డ్రాయింగ్‌, కంప్యూటర్‌, యోగా నేర్చుకుంది. పుస్తకాలు చదువుతూ వ్యాసరచన పోటీల్లో పాల్గనేది. సొంత ఆలోచనలతో కొత్త ప్రాజెక్టులు చేస్తూ అందరీు ఆశ్చర్యపరుస్తూ ఉండేది. అదే ఆసక్తి స్కూల్లో కనబరచడంతో ఆ యాజమాన్యం యశస్వి ప్రయోగాల కోసం ల్యాబ్‌కి పంపించేది. అలా ఆమె పర్యావరణహిత వస్తువుల తయారీకి పునాది పడింది.
పర్యావరణహితంగా మార్చే ప్రయోగాలు
యశస్వి పదవ తరగతి చదువుతున్నప్పుడు చికెన్‌, చేపల మార్కెట్‌ నుంచి ప్రతిరోజూ వస్తున్న వ్యర్థాలు పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నట్లు గ్రహించింది. వీటినిని వారించేందుకు 'సీక్రెట్‌ ఆఫ్‌ స్కేలీ ప్లమేజ్‌' ప్రాజెక్టును ప్రారంభించింది. ఈకలు, పొలుసులతో ఏమైనా చేయొచ్చా అన్న తన సందేహాన్ని సైన్సు టీచర్‌ హేమంత్‌తో పంచుకోగా, వారు సూచనలు చేస్తూ ప్రోత్సహించారు. కోడి ఈకలు, చేప పొలుసులను తీసుకుని బయటకువెళ్లి ల్యాబ్‌ పరీక్షలు చేశారు. స్కూలు యాజమాన్యం కూడా ఆమెకుకావాల్సిన సామగ్రినిసమకూర్చారు. ఈ ఈకలను డిస్క్‌ మాదిరిగా చేసి ఫ్యాక్టరీ పొగ గొట్టాలు, వాహనాల సైలెన్సర్ల వద్ద ఉంచినప్పుడు కాలుష్యం తగ్గింది. అంతేకాకుండా కోడి ఈకలు, చేప పొలుసు, నీరు, గ్లిసరిన్‌ కలిసి వేడి చేస్తే బయోప్లాస్టిక్‌ తయారవుతోంది. ఇది సులభంగా మట్టిలో కలిసిపోయి ఎరువుగా కూడా ఉపయోగపడుతుంది. చేప పొలుసును నీటితో కలిపి వేడి చేస్తే ఫిష్‌ జెల్‌ తయారవుతోంది. దీనిని ఐరన్‌ రాడ్లకు పూస్తే తుప్పు పట్టకుండా నివారిస్తోంది. మోకాళ్ల నొప్పులకు సంబంధించి కార్టిలేజ్‌ ట్రీట్‌మెంట్‌లో చేపల పొలుసులు ఉపయోగపడనున్నాయి. ఇందులో కొలాజిన్‌ అనే పదార్థం ఉండటం వల్ల ఈ జెల్‌ను ఉపయోగిస్తే నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. పెయింట్‌ వేసేటప్పుడు ఈ జెల్‌ను కలిపి వాడితే గోడలకు చెమ్మ రాకుండా, పెచ్చులూడకుండా నివారించవచ్చు.

ఈకలు, పొలుసులతో ఇటుకలు!
ఇటుకల తయారీ ఇలా..
కోడి ఈకల్లోని కొలాజిన్‌, చేపల పొలుసులోని కెరోటిన్లతో పర్యావరణహితమై భూమిలో కలిసిపోయే, బయో ప్లాస్టిక్‌ అయిన తేలికపాటి సిమెంట్‌ ఇటుకలు తయారీ చేసింది యశస్వి. వాటిని శాస్త్రీయంగా నిరూపించింది. కోడి ఈకలు, చేప పొలుసును సిమెంట్‌, ఇసుక, నీటితో కలిపి తేలికగా ఉండే సిమెంట్‌ ఇటుకలను తయారు చేసింది. ఈ ఇటుకలను ల్యాబ్‌లో పరిశీలించగా దృఢమైనవని నిరూపణ అయ్యింది. దీంతో 2019లో ఆమె ప్రాజెక్టు సైన్సుఫేర్‌ పోటీలకు ఎంపికైంది. యశస్విని పట్టుదల, కృషి తెలిసుకొని జిల్లా కలెక్టర్‌ నివాస్‌ ఆమెను అభినందించారు.

ఈకలు, పొలుసులతో ఇటుకలు!
ఇన్‌స్పైర్‌ అవార్డుకు ఎంపిక
కరోనా కారణంగా రెండు సంవత్సరాలు వాయిదా పడుతున్న జాతీయ ఇన్‌స్పైర్‌ అవార్డు పోటీలను ఈ సంవత్సరం నిర్వహించారు. దేశం నలమూలల నుంచి వచ్చిన మూడు వేల ప్రాజెక్టుల నుంచి మొత్తం 581 మంది ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. ఇందులో యశస్వి రూపొందించిన ప్రాజెక్ట్‌ కూడా ఉంది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా యశస్వి ఈ అవార్డును అందుకోనుంది. ఈ ప్రాజెక్ట్‌ అంతర్జాతీయ పోటీలకు సైతం ఎంపిక అయింది. యశస్వి ప్రస్తుతం ఇంటర్మీడియెట్‌ సెకెండియర్‌ చదువుతోంది.

ఈకలు, పొలుసులతో ఇటుకలు!
అమ్మమ్మ, తాతయ్య పోత్సాహం మరువలేనిది: యశస్వి
కోడి ఈకలు, చేప పొలుసు కాలువల్లో నీటికి అడ్డుపడటంతోపాటు, పర్యావరణానికి హాని కలిగించటం గమనించా. వీటితో పర్యావరణ హితమైన వస్తువులను తయారు చేయాలనిపించింది. ఇందుకుమా స్కూలు యాజమాన్యం ప్రోత్సహించింది. అమ్మ ఉద్యోగం రీత్యా చాలా బిజీగా ఉంటుంది. ఆ సమయంలో అమ్మమ్మ బాబే సరోజని, తాతయ్య సత్యనారాయణ రాజు నిత్యం నా వెంటే ఉండి బాగోగులు చూసుకున్నారు. ప్రతిరోజూ పరిశోధనలపై ఆసక్తి కలిగించేలా సూచనలు చేశారు.