
లాటిన్ అమెరికా! సామ్రాజ్యవాదుల ప్రయోగశాల!! ఈక్వెడార్ లో ఫిబ్రవరి ఏడవ తేదీన అక్కడ అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. వామపక్ష అభ్యర్ధి ఆండ్రెస్ అరోజ్ తొలి దఫాలోనే విజయం సాధిస్తారని సర్వేలు వెల్లడించాయి. రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష పదవికి పోటీ చేసిన వారు తొలి దఫాలో 50 శాతానికి పైగా ఓట్లు తెచ్చుకోవాలి. లేదా 40 శాతానికి మించి తెచ్చుకుంటే సమీప ప్రత్యర్ధికంటే పది శాతం ఆధిక్యతలో ఉండాలి. వామపక్ష అభ్యర్థి ఆండ్రెస్ అరోజ్కు 32.7 శాతం, మితవాద పార్టీ గులెర్మో లాసోకు 19.74 శాతం, హరిత వామపక్షం అని చెప్పుకొనే యకు పెరెజ్‌కు 19.38 శాతం, ప్రస్తుత అధ్యక్షుడు లెనిన్ మొరెనా పార్టీ అభ్యర్ధికి కేవలం 1.54 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.
అధ్యక్ష ఎన్నికల్లో ఎవరికీ తగినన్ని ఓట్లు రానందున రెండవ దఫా ఎన్నికలు ఏప్రిల్ 11న నిర్వహిస్తున్నారు. ప్రథమ స్థానంలో వామపక్ష అభ్యర్ధి వచ్చినా రెండవ స్ధానంలో తన మద్దతు ఉన్న యకు పెరోజ్ రెండవ స్ధానంలో ఉంటారని, రెండవ దఫా ఎన్నికల్లో వామపక్ష వ్యతిరేక ఓట్లన్నింటినీ వేయించి గెలిపించవచ్చని అమెరికన్లు తలచారు. అయితే అది కూడా సాధ్యమయ్యేట్లు కనిపించకపోవటంతో సరికొత్త కుట్రకు తెరలేపారు. రెండవ దఫా ఎవరు ఎవరికి మద్దతు ఇస్తారనేదాని కంటే ఎన్నికలను ఎలా బూటకంగా మార్చుతారనే చర్చ ఇప్పుడు ముందుకు వచ్చింది.
మాజీ అధ్యక్షుడు రాఫెల్ కొరెయా నాయకత్వం లోని పార్టీని అసలు ఎన్నికలలో పోటీ చేయనివ్వకుండా అడ్డుకోవాలని ప్రయత్నించారు. కొరెయాను ఒక తప్పుడు కేసులో ఇరికించి ఆయన పరోక్షంలో ఏకపక్షంగా శిక్ష విధించారు. దాన్ని సాకుగా చూపి కొరెయా, ఆయన నాయకత్వం లోని పార్టీని ఎన్నికలలో పోటీ చేయకుండా అడ్డుకోవాలని చూశారు. అయితే నామినేషన్లకు మరో 48 గంటల సమయం ఉందనగా కొరెయా మినహా ఇతరులు పోటీ చేసేందుకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చింది.
ఈక్వెడార్ పరిణామాలు వామపక్ష శక్తుల ముందు మరో కొత్త సవాల్‌ను వుంచాయి. అనేక దేశాలలో పర్యావరణం లేదా హరిత ఉద్యమ కార్యకర్తలు, కొన్ని చోట్ల పార్టీలు కూడా ముందుకు వచ్చాయి. పర్యావరణాన్ని కాపాడాలని కోరటం ఒక పురోగామి భావన. సాధారణంగా ఇలాంటి శక్తులన్నీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగానే ఉంటాయి. పర్యావరణ రక్షణ విషయంలో వామపక్షాలు కూడా సానుకూలమే. అందువలన వారితో చేతులు కలిపారు. ఈ నేపథ్యంలోనే పశ్చిమ దేశాల మీడియా వీరిని హరిత లేదా హరిత వామపక్షాలు అని వర్ణిస్తోంది. ఈక్వెడార్‌లో స్థానిక తెగల నేత కూడా అయిన యకు పెరోజ్ను ఈ కారణంగానే హరిత వామపక్ష వాది అని పిలుస్తున్నారు. అయితే ఇతగాడి నాయకత్వంలోని పార్టీ తీరు తెన్నులను చూసినపుడు వామపక్షాలకు బద్ధశత్రువు అయిన అమెరికా పాలకవర్గాల పంచన కూర్చున్నట్లు స్పష్టమవుతుంది.
వామపక్షవాది, ఆర్థికవేత్త అయిన రాఫెల్ కొరెయా 2007 నుంచి 2017వరకు దేశాధ్యక్షుడిగా పని చేశారు. వామపక్ష విధానాలను అమలు జరిపేందుకు ప్రయత్నించారు. ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్ ప్రభావాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకున్నారు. అంతకు ముందు పాలకుల హయాంలో చేసిన అప్పు 300 కోట్ల డాలర్లు చెల్లించేది లేదని ప్రకటించాడు. దాని మీద అంతర్జాతీయ కోర్టుల్లో విచారణ జరిగింది. పర్యవసానంగా అప్పులో 60 శాతం పైగా తగ్గింది. రాజ్యాంగ సవరణల కారణంగా 2009లో తిరిగి 2013లో కొరెయా విజయం సాధించారు. లాటిన్ అమెరికా లోని ఇతర వామపక్ష నేతలతో చేతులు కలిపారు. 2006-16 మధ్య దేశంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న 36.7 శాతం మందిని 22.5 శాతానికి తగ్గించారు. అంతకు ముందు రెండు దశాబ్దాలలో జిడిపి వృద్ధి రేటు 0.6 శాతంగా ఉన్నదానిని 1.5 శాతానికి పెంచాడు. అసమానతలను కొలిచే గిని కోఎఫిసియెంట్ 0.55 నుంచి 0.47 కి తగ్గింది.
రెండు సార్లు అధ్యక్ష పదవిని స్వీకరించిన కారణంగా 2017 ఎన్నికలలో కొరెయా పోటీ చేసేందుకు అవకాశం లేకపోయింది. పార్టీ అభ్యర్ధిగా 2007-13 మధ్య ఉపాధ్యక్షుడిగా పని చేసిన లెని(మ్)న్ మోరెనో పోటీ చేసి గెలిచారు. అనూహ్యంగా అంతకు ముందు అనుసరించిన వామపక్ష విధానాలకు స్వస్తి చెప్పి తిరోగమన విధానాల అమలుకు పూనుకోవటంతో పార్టీలో విబేధాలు వచ్చాయి. కొరెయాను పక్కకు నెట్టి ఆయన మీద అవినీతి కేసులు నమోదు చేయించి జైలు పాలు చేసేందుకు కుట్ర చేశారు. దాన్ని గమనించి అదే ఏడాది తన భార్యతో కలసి బెల్జియం వెళ్లి తనకు రాజకీయ ఆశ్రయం కల్పించాలని దరఖాస్తు చేశారు. కొరెయా ఉన్నత విద్య అక్కడే సాగింది. ఆయన భార్య బెల్జియం పౌరురాలు కావటంతో అక్కడే ఉండిపోయారు. కొరెయా అధికారంలో ఉన్న 2012లో ప్రత్యర్ధి ఒకరిని కిడ్నాప్ చేశారని తప్పుడు కేసు నమోదు చేశారు. దాని విచారణకు కోర్టుకు హాజరు కాలేదనే పేరుతో కొరియాను అరెస్టు చేయాలని 2018 జూలై 3న న్యాయమూర్తి అదేశించాడు. అరెస్టు చేయాలని ఇంటర్‌పోల్‌ను కోరారు. అయితే ఆయన మీద ఉన్న కేసులు రాజకీయ అంశాలుగా ఉండటంతో తాము అరెస్టు చేయలేమని స్పష్టం చేసింది. తరువాత 2020 ఏప్రిల్ 7న ఈక్వెడార్ సుప్రీం కోర్టు ఆయనకు 8 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
2017 ఎన్నికలలో కొరెయా బలపరిచిన అభ్యర్ధిగా విజయం సాధించిన మొరెనో అమెరికా చంకనెక్కాడు. కొరెయాకే ఎసరు పెట్టాడు. పదవి లోకి వచ్చినపుడు 77 శాతం మంది జనం మద్దతు ఉండగా 2019లో అది ఏడుశాతానిక పడిపోయిందంటే ఎంతగా జనానికి దూరమయ్యాడో తేలిపోయింది. అంతకు ముందు పార్లమెంటులో 74 సీట్లు ఉన్న మొరెనో పార్టీ తాజా ఎన్నికలలో ఒక్క స్థానం కూడా తెచ్చుకోలేకపోయింది. ఆ పార్టీ అభ్యర్ధికి తాజా అధ్యక్ష ఎన్నికలలో 1.54 శాతం ఓట్లు వచ్చాయి.
పచాకౌటిక్ (హరిత పార్టీ) నేత యకు పెరెజ్ అమెరికా నాయకత్వంలో బొలీవియా, బ్రెజిల్, వెనిజులా, నికరాగువాలలో జరిపిన కుట్రలన్నింటినీ సమర్ధించాడు. అతని రాజకీయ చరిత్రను చూస్తే వామపక్ష ముసుగు వేసుకున్న ద్రోహిగా కనిపిస్తాడు. లాటిన్ అమెరికాలో అలాంటి శక్తులను అమెరికా ఎందరినో తయారు చేసింది. వారికి అవసరమైన నిధులు, జనాన్ని గందరగోళపరిచేందుకు, వామపక్ష శిబిరాల్లో అనుమానాలు రేపేందుకు నేషనల్ డెమోక్రటిక్ ఇనిస్టిట్యూట్ (ఎన్‌డిఐ) అనే సంస్థ ముసుగులో అవసరమైన శిక్షణ ఇచ్చింది. వారికి మద్దతుగా ప్రభుత్వేతర స్వచ్ఛంద (ఎన్జిఓ) సంస్థలను, సిఐఏ ఆధ్వర్యంలో పనిచేసే నేషనల్ ఎండోమెంట్ ఫర్ డెమోక్రసీ (ఎన్‌ఇడి) సంస్ధను ఏర్పాటు చేసింది. 2007 అమెరికా ఎన్‌డిఐ పత్రంలో లాటిన్ అమెరికాలో వామపక్ష శక్తులకు వ్యతిరేకంగా, తమకు అనుకూలంగా పని చేసేందుకు శిక్షణ ఇచ్చిన పార్టీల పేర్లు బయటకు వచ్చాయి. వాటిలో పచాకౌటిక్ ఒకటి. మన దేశంలో కూడా అలాంటి ఎన్జిఓ శక్తులను చూడొచ్చు. 2016-19 మధ్య ఈక్వెడార్‌లో ఎన్జిఓలకు 50 లక్షల డాలర్లు ఇచ్చినట్లు బహిరంగంగా ఎన్‌ఇడి జాబితా వెల్లడించింది. రాఫెల్ కొరెయా అధ్యక్షుడిగా పని చేసిన సమయంలో ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పచాకౌటిక్ పార్టీ ఆందోళనలు నిర్వహించింది. 2010లో కొరెయాకు వ్యతిరేకంగా జరిగిన కుట్రలో ప్రధాన పాత్రపోషించింది. ఒక రెడ్ ఇండియన్ తెగకు చెందిన యకు పెరెజ్...లాటిన్ అమెరికా ఐదువందల సంవత్సరాల చరిత్రలో తొలి రెడ్ ఇండియన్ తెగ నేతగా బొలీవియాలో అధికారానికి వచ్చిన ఇవో మొరేల్స్‌ను వ్యతిరేకించిన సామ్రాజ్యవాదుల బంటు. ఈక్వెడార్‌లో ఎక్కువ సంఖ్యలో కార్లు నడపకూడదని, గనులు తవ్వకూడదని, చమురు తీతను పరిమితం చేయాలంటూ కొరెయా పాలనా కాలంలో ఆందోళనలు నిర్వహించాడు. అక్కడ ఉన్న చమురు, ఖనిజ నిల్వలను వెలికి తీసి పేద దేశంగా ఉన్న ఈక్వెడార్‌ను అభివృద్ధి చేసేందుకు పూనుకున్న కొరెయా మీద కుట్రలో పెరెజ్ భాగస్వామి. ఇలాంటి తమ బంటును గద్దెనెక్కించేందుకు చేస్తున్న కుట్రను ఈక్వెడార్ ప్రజలు తిప్పికొట్టడం తధ్యం.
* ఎం. కోటేశ్వరరావు