Jan 13,2021 19:21

న్యూఢిల్లీ: బీహార్‌లో ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ఉద్యోగి హత్య వివాదంగా మారుతోంది. చివరికి అది రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ మెడకు చుట్టుకుంటోంది. హత్యకు బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. సంకీర్ణ ప్రభుత్వంలో భాగాస్వామిగా ఉన్న బిజెపి కూడా నితీష్‌కుమార్‌ మీద విమర్శలు ఎక్కుపెట్టింది. ఇండిగోలో మేనేజర్‌గా పనిచేస్తున్న 44 ఏళ్ల రూపేష్‌కుమార్‌ సింగ్‌ను ఆయన ఇంటి గేటు ముందు ఇద్దరు బైక్‌పై వచ్చి కాల్పులు జరిపి చంపేశారు. ఈ హత్య సిఎం నితీష్‌కుమార్‌ ఇంటికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో జరిగింది. దీనిపై ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. నితీష్‌కుమార్‌ పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయని, ఆయన వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశాయి. వీరికి సంకీర్ణపక్షం బిజెపి కూడా గొంతు కలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. కాగా ఈ ఘటనను సిబిఐతో విచారణ జరిపించాలని బిజెపి ఎంపి వివేక్‌ ఠాగూర్‌ డిమాండ్‌ చేశారు. మరో ఎంపి, రాజ్యసభ సభ్యులు గోపాల్‌ నారాయణ్‌ సింగ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతలపై నితీష్‌కు పట్టులేదని, అవినీతి కూడా పెచ్చరిల్లిపోయిందని విమర్శలు గుప్పించారు. తాము కూడా ప్రభుత్వంలో భాగాస్వాములు అయినప్పటికీ వాస్తవాన్ని అంగీకరించాల్సిందేనని అన్నారు. అటు బయట, ఇంట రెండు చోట్ల నుంచి విమర్శలు వస్తుండడంతో నితీష్‌కుమార్‌ ఇబ్బందుల్లో పడ్డారు.