May 04,2022 06:39

ప్రపంచంపై గుత్తాధిపత్యాన్ని సాధించేందుకు గానూ దీర్ఘకాలిక వ్యూహాత్మక దృక్పథంతో అమెరికా ముందుకు సాగుతోందనేది స్పష్టం. అంతర్జాతీయంగా తాము నెలకొల్పాలనుకుంటున్న వ్యవస్థలో భాగంగానే ఈ ఇండో-పసిఫిక్‌ వ్యూహం వుంది. చైనాను కట్టడి చేసి, ఏకాకిని చేయడానికి మాత్రమే ఉద్దేశించలేదు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి గానూ భారత్‌ను తన కనుసన్నల్లో మెలిగేలా చేసుకోవాలన్నది అమెరికా ఆలోచనగా వుంది. వ్యూహాత్మక పత్రంలో ఈ మేరకు దిశా నిర్దేశం చేయబడింది. ఇరు ప్రభుత్వాల మంత్రిత్వ స్థాయి సమావేశాల్లో, ఇతర ఒప్పందాల్లో దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోవడం కనిపిస్తోంది.

      క్రెయిన్‌లో యుద్ధం ప్రారంభం కావడానికి కొద్ది రోజులు ముందుగా, అమెరికా తన కొత్త ఇండో-పసిఫిక్‌ వ్యూహాన్ని (ఫిబ్రవరి 2022) ప్రకటించింది. ఈ డాక్యుమెంట్‌ కేవలం చైనా గురించే కాదు, భారత్‌ గురించి కూడా పేర్కొంది. ఇటీవల ముగిసిన అమెరికా-భారత్‌ 2+2 మంత్రిత్వ స్థాయి చర్చలు (ఏప్రిల్‌ 11)తో కలిపి ఈ డాక్యుమెంట్‌ను చూసినట్లైతే, అమెరికా ఇండో-పసిఫిక్‌ వ్యూహం, భారత్‌తో ఆ దేశం కుదుర్చుకున్న వివిధ రక్షణ ఒప్పందాలు ఈ రెండు దేశాలు విడదీయలేనంతగా ఒకటిగా కట్టిపడేస్తున్నాయని స్పష్టమవుతుంది.
     తాజా అమెరికా ఇండో-పసిఫిక్‌ వ్యూహం ప్రస్తుత అంతర్జాతీయ వాస్తవికతలను గుర్తిస్తున్నది. అమెరికా తన గురించి గొప్పగా చెప్పుకోవాలనే ఆకాంక్ష వున్నప్పటికీ, ఇక ఎంతమాత్రమూ గతంలోని తన బలం గురించి చెప్పుకోజాలదు. ఈ వ్యూహాన్ని అమలు పరిచేందుకు తన మిత్రపక్షాలపై ఆధారపడాల్సిన ఆవశ్యకత వుందన్న వాస్తవాన్ని అమెరికా అయిష్టంగానైనా సరే ఒప్పుకోక తప్పని స్థితి వచ్చింది. ''ఒంటరిగా దీన్ని పరిపూర్తి చేయలేనని అమెరికా భావించడమే ఈ వైఖరిలోని అత్యంత కీలకమైన అంశం: మారుతున్న వ్యూహాత్మక పరిస్థితులు, చారిత్రక సవాళ్ళు ఇవన్నీ కలిస,ి ఇటువంటి దార్శనికతను పంచుకునే వారి నుండి అనూహ్యమైన సహకారాన్ని పొందాల్సిన అవసరం పడుతోంది....మిత్రపక్షాలు, భాగస్వాములు ప్రాంతీయ నాయకత్వ పాత్రలను పోషిస్తున్నపుడు మేం వారికి వారికి మద్దతిస్తూ, సాధికారతను కల్పిస్తాం. మాకు వెసులుబాటు కల్పించగల గ్రూపుల్లో-ముఖ్యంగా క్వాడ్‌ వంటి గ్రూపుల ద్వారా పని చేస్తూనే వాటి ద్వారా, మన హయాంలో ఎదురయ్యే కీలక సమస్యలను ఎదుర్కొనగలిగే రీతిలో మన సమిష్టి శక్తిసామర్ధ్యాలను పెంచుకునేందుకు కృషి చేయాలి...మన వైఖరులన్నింటినీ సంలీనం గావించేందుకు ఈ అవకాశాన్ని మనం పూర్తిగా ఉపయోగించుకోవాలి. మన సామర్ధ్యాన్ని అనేక రెట్లు పెంచేలా సమన్వయంతో మన చొరవలన్నింటినీ అమలుపరచాల్సి వుంది.''
     యురోపియన్‌ యూనియన్‌ (సెప్టెంబరు 2021) ప్రకటించిన ఈ దార్శనికతను అమెరికా గుర్తించింది. ఇ.యు దార్శనికత కూడా అమెరికా విస్తృత దృక్పథానికి అనుగుణంగా ఉన్నందున ఇదేమీ క్లిష్టమైన ప్రతిపాదనగా భావించలేదు. తమ స్వంత ప్రయోజనాలను ప్రకటించడం ద్వారా ఫ్రాన్స్‌, జర్మనీ, నెదర్లాండ్స్‌ ఈ ఇ.యు పత్ర రూపకల్పనలో పాల్గొన్నాయి. ఫ్రాన్స్‌ కూడా తమ నావికా దళాన్ని ఈ ప్రాంతంలో మోహరించింది. ఇ.యు చూపించిన ఈ ఆసక్తిని ఉపయోగించుకున్న అమెరికా నెమ్మదిగా నాటోను కూడా ఈ రీజియన్‌ లోకి తీసుకువస్తోంది. ఈ పరిణామాలన్నింటినీ అమెరికా డాక్యుమెంట్‌ గుర్తించింది. ''ఈ రీజియన్‌కు వెలుపల గల మిత్రపక్షాలు, భాగస్వామ్య దేశాలు ఇండో-పసిఫిక్‌ ముఖ్యంగా ఇ.యు, నాటో పట్ల కొత్తగా దృష్టి పెట్టేందుకు నిబద్ధతను ప్రదర్శిస్తూ వస్తున్నాయి.''
     రాబోయే సంవత్సరాల్లో మూడింట రెండు వంతుల అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి ఈ రీజియన్‌ నుండే జరుగుతుందని భావిస్తున్నందున ఈ ప్రాంతాన్ని అత్యంత కీలకమైనదిగా అమెరికా పరిగణిస్తోంది. 2020లో అమెరికా, ఇండో-పసిఫిక్‌ రీజియన్‌ మధ్య పరస్పర వాణిజ్యం లక్షా 75 వేల కోట్ల డాలర్ల మేరకు జరిగింది. ఈ రీజియన్‌, అమెరికాలో 30 లక్షల ఉద్యోగాలను కల్పిస్తోంది. అంతర్జాతీయ జిడిపిలో 60 శాతాన్ని ఉత్పత్తి చేస్తున్న, ప్రపంచ జనాభాలో 60 శాతం ప్రజలు వున్న ప్రాంతంగా దీనిని ఇ.యు కూడా భావిస్తోంది. పైగా 2030 నాటికి, మధ్య తరగతిలోకి కొత్తగా వచ్చి చేరే 240 కోట్ల మంది ప్రజల్లో 90 శాతం ఇక్కడే వుంటారు. ఇ.యు విదేశీ వాణిజ్యంలో 40 శాతం దక్షిణ చైనా సముద్ర మార్గం గుండానే సాగుతుంది. ఈ రీజియన్‌కు గల అపారమైన ఆర్థిక అవకాశాలను పూర్తి స్థాయిలో దోపిడీ చేయడానికి అమెరికా, ఇ.యు ఏకమయ్యాయి.
     అయితే, ఇక్కడ ఇద్దరికీ కొన్ని సమస్యలు లేదా సంక్లిష్టతలు వున్నాయి. ఈ రీజియన్‌లో ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ, అత్యంత వేగంగా ఆవిర్భవిస్తున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన చైనా వుంది. మరీ ముఖ్యంగా చైనా సోషలిస్టు దేశం. ఇక్కడ చైనా ఆర్థికపరమైన పోటీదారుగానే కాకుండా, సైద్ధాంతికంగా శత్రువుగా కూడా అమెరికా, ఇ.యు లు రెండూ చూస్తున్నాయి. అందువల్ల, ఇంతటి కీలకమైన రీజియన్‌ తమ అదుపాజ్ఞల్లోనే వుండేలా చూసేందుకు గానూ అమెరికా, ఇ.యు లు తమ సర్వశక్తులూ ఒడ్డేందుకు ప్రయత్నిస్తున్నాయి. తమ శక్తి సామర్ధ్యాలను ఉపయోగించేందుకు కృషి చేస్తున్నాయి.
     ఇందుకు హామీ కల్పించేందుకు గానూ, అమెరికా చిన్నదైనా, ప్రాముఖ్యత కలిగేలా ఇండో-పసిఫిక్‌ ప్రాంత నిర్వచనంలో మార్పు చేసింది. భౌగోళిక ప్రాంతాన్ని పునర్నిర్వచించింది. ''భారత్‌ పశ్చిమ తీరం నుండి అమెరికా పశ్చిమ తీరం వరకు'' ఇండో-పసిఫిక్‌ రీజియన్‌గా పేర్కొంటూ అమెరికా (2017) జాతీయ భద్రతా వ్యూహ పత్రం నిర్వచించింది. ఇందులో ఇరాన్‌, పర్షియన్‌ గల్ఫ్‌, ఎర్ర సముద్రం కూడా వున్నాయి. కానీ ప్రస్తుత డాక్యుమెంట్‌ ఈ ప్రాంతాలను మినహాయించింది. ''మన (అమెరికా) పసిఫిక్‌ తీర ప్రాంతాన్ని హిందూ మహా సముద్రం వరకు విస్తరిస్తూ'' ఈ రీజియన్‌కు నిర్వచనం చెప్పింది. చైనాను అదుపు చేయడానికి, ఏకాకిని చేయడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు మరింత ఊతమిచ్చేందుకే ఈ చర్య ఉద్దేశించబడింది.
    ఈ చర్య ఎందుకు ఉద్దేశించబడిందో బహిరంగంగా చెప్పడానికి కూడా అమెరికా సిగ్గుపడడం లేదు. ''ఇండో-పసిఫిక్‌లో మేం అమెరికాను గట్టిగా ముందుకు తీసుకెళ్ళడానికి ధృఢంగా వ్యవహరిస్తేనే అమెరికన్‌ ప్రయోజనాలు కూడా ముందుకు వెళతాయి. ఇండో-పసిఫిక్‌, అనేక సవాళ్ళను ముఖ్యంగా చైనా పీపుల్స్‌ రిపబ్లిక్‌ (పిఆర్‌సి) నుండి ఎదుర్కొంటోందన్న వాస్తవం దృష్టిలో పెట్టుకునే అమెరికా ఈ రీతిన తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన శక్తిగా మారాలని చైనా కోరుకుంటోంది. పిఆర్‌సిని మార్చాలన్నది మా లక్ష్యం కాదు. కానీ, అమెరికాకు, మా మిత్రపక్షాలకు, భాగస్వాములకు, మా ప్రయోజనాలకు, విలువలకు అత్యంత అనుకూలంగా వుండేలా ప్రపంచంలోనే సమతూకం కలిగిన ప్రభావాన్ని రూపొందించేలా, వ్యవహరించేలా వ్యూహాత్మక వాతావరణానికి ఒక రూపునివ్వాలన్నది లక్ష్యంగా వుంది.''
     అమెరికా పంచుకునే ప్రయోజనాలు, విలువలనేవి చాలా స్పష్టంగా వున్నాయి. ప్రజాస్వామ్యం, మానవ హక్కుల పేరుతో అమెరికా ప్రపంచ దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోంది. అశాంతిని సృష్టించడానికి, కుట్రలు పన్నడానికి, ప్రభుత్వాలను మార్చేందుకు గానూ తన ఆర్థిక, సైనిక బలాన్ని ఉపయోగిస్తోంది. ఈ ఇండో-పసిఫిక్‌ రీజియన్‌ లోనే, కొద్ది దశాబ్దాల క్రితం, ఇండోనేషియాలో కమ్యూనిస్టుల ఊచకోతకు సిఐఎ మద్దతిచ్చింది. అక్కడ సైనిక నియంతృత్వాన్ని ప్రవేశపెట్టింది.
     'పిఆర్‌సిని మార్చాలన్నది మా లక్ష్యం కాదు'' అని అమెరికా ప్రకటించినప్పటికీ, వివిధ అమెరికన్‌ అధికారులు చేస్తున్న ప్రకటనలు, యుఎస్‌ ఎయిడ్‌ వంటి వివిధ సంస్థలు చేస్తున్న చర్యలతో చైనాను మార్చాలన్న లక్ష్యం కోసమే పనిచేస్తున్నట్లు స్పష్టమవుతోంది. చైనా కమ్యూనిస్టు పార్టీ మన హయాంలో అతి పెద్ద ముప్పుగా తయారైందని అమెరికా విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. ''మన మౌలిక జీవన విధానానికి - సంక్షేమం, భద్రత, స్వేచ్ఛ అన్నింటికీ చైనా కమ్యూనిస్టు పార్టీ వాస్తవిక ముప్పుగా మారింది. దాన్ని గుర్తించి, ఇతరులను అప్రమత్తం చేయడం, మన స్వేచ్ఛలను పరిరక్షించుకోవడానికి అవసరమైన చర్యలను కలిసికట్టుగా తీసుకోవడం మన కర్తవ్యంగా వుంది (అక్టోబరు 30, 2020).'' అని తూర్పు ఆసియా, పసిఫిక్‌ వ్యవహారాల బ్యూరో అసిస్టెంట్‌ సెక్రటరీ డేవిడ్‌ ఆర్‌.స్టిల్‌వెల్‌ వ్యాఖ్యానించారు. హాంకాంగ్‌, షింజియాంగ్‌ స్వయంప్రతిపత్తి ప్రాంతాల్లో అశాంతి, కల్లోలం సృష్టించేందుకు యు.ఎస్‌ ఎయిడ్‌ అక్కడ క్రియాశీలంగా పనిచేస్తోంది.
     ఈ చైనా వ్యతిరేక ఎజెండాను మరింత ముందుకు తీసుకెళ్ళేందుకు గానూ అమెరికా, భారత్‌ను తన కూటమి లోకి లాగింది. ఆ వ్యూహాత్మక పత్రం ఇలా పేర్కొంటోంది. ''అమెరికా, భారత్‌లు కలిసి పని చేసేలా....మన ఆర్థిక, సాంకేతిక సహకారం మరింత పెరిగేలా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని రూపొందించడాన్ని మనం కొనసాగించాలి. స్వేచ్ఛా, బహిరంగ ఇండో-పసిఫిక్‌ ప్రాంతం కోసం కృషి చేయాలి. భారత్‌ను భావసారూప్యత కలిగిన దేశంగా, దక్షిణాసియా, హిందూ మహా సముద్ర దేశాల్లో నేతగా, క్వాడ్‌కు ఒక చోదక శక్తిగా మేం గుర్తిస్తున్నాం.''
     ఈ వ్యూహాత్మక ధోరణులకు అనుగుణంగా, భారత్‌ కచ్చితంగా తన పరిధిలోనే వుండేలా అమెరికా చర్యలు తీసుకుంటోంది. ఇటీవల ముగిసిన 2+2 మంత్రిత్వ స్థాయి చర్చలు ఈ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్ళేందుకే ఉద్దేశించబడ్డాయి. సమావేశానంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటన చూస్తే, అమెరికా గుప్పిట్లోకి మనం ఎలా వెళుతున్నామో, మన రక్షణ, సార్వభౌమాధికారాలపై ఎలా రాజీ పడుతున్నామో అర్ధమవుతుంది. ''మన సైనిక విభాగాలకు అదనంగా ఇవ్వాల్సిన శిక్షణ అవకాశాలపై మంత్రులు చర్చించారు. కొత్తగా ఆవిర్భవిస్తున్న ఈ రంగాల్లో అడ్వాన్స్‌డ్‌ కోర్సుల్లో భారత్‌ మరింతగా పాల్గొనడాన్ని అమెరికా స్వాగతించింది.'' అమెరికాతో మన సైనిక శిక్షణ మాత్రమే కాకుండా, వివిధ రంగాల్లో వాస్తవ పరిస్థితుల్లో సైనిక సమాచారాన్ని అమెరికాకు ఇచ్చిపుచ్చుకోవడానికి కూడా ప్రభుత్వం అంగీకరించింది. పరస్పరం మిలటరీ సంస్థల్లో లైజాన్‌ అధికారులను నియమించడానికి కూడా ఆమోదం తెలిపింది. అంటే, మన దేశంలో మన సైనికాధికారులతో పాటూ అమెరికా మిలటరీ అధికారులు కూడా వుంటారని అర్ధం.
    పైగా, రక్షణ పారిశ్రామిక సహకారాన్ని పెంచుకునేందుకు గానూ ''అమెరికా నావికా దళానికి చెందిన నౌకలు మార్గ మధ్యంలో మరమ్మతులు వచ్చినపుడు వాటికి మద్దతుగా, అమెరికా మారిటైమ్‌ సీ లిఫ్ట్‌ కమాండ్‌ (ఎంఎస్‌సి) నౌకలను మరమ్మతు చేసి, నిర్వహించేందుకు భారత నౌకాశ్రయాలను ఉపయోగించుకోవడానికి గల అవకాశాలను అన్వేషించడానికి కూడా ఇరు పక్షాలు అంగీకరించాయి''. ''భారత సైన్యం యొక్క విస్తారమైన నిర్వహణా సామర్ధ్యం, హిందూ మహాసముద్రంలో, విస్తృత ప్రాంతంలో సహకారానికి గల అవకాశాలను'' గుర్తిస్తూ...సముద్రంలో, గాల్లో నుండి గాల్లో, నేలమీద ఇంధనాన్ని తిరిగి నింపుకోవడం వంటి రెగ్యులర్‌ ద్వైపాక్షిక మౌలిక వసతుల నిర్వహణను ఇరు దేశాల మంత్రులు స్వాగతించారని ఆ ప్రకటన పేర్కొంది. లాజిస్టిక్స్‌ ఎక్స్ఛేంజ్‌ మెమోరాండం ఆఫ్‌ అగ్రిమెంట్‌ (ఎల్‌ఇఎంఓఎ) ద్వారా అటువంటి సహకారాన్ని పెంచుకునేందుకు ఇరు పక్షాలు నిబద్ధతను ప్రకటించాయి.
      ఇరు దేశాల మధ్య రక్షణ వాణిజ్యాన్ని మరింత పెంచుకోవడం గురించి కూడా ఈ మంత్రిత్వ స్థాయి సమావేశంలో చర్చించారు. ఆ రకంగా భారత్‌ తన భద్రత కోసం రష్యాపై ఆధారపడడాన్ని తగ్గించడం గురించి కూడా చర్చకు వచ్చింది. భారతదేశంలో రక్షణ పరిశ్రమలను ప్రైవేటీకరించడం వల్ల ఇటువంటి వాణిజ్యం ముందుకు తీసుకెళ్ళేందుకు ఉద్దేశించబడింది. ఈ నేపథ్యంలో, రష్యన్‌ హెలికాప్టర్లను కొనుగోలు చేయబోమని భారత ప్రభుత్వం ఇటీవల చేసిన ప్రకటనను మనం చూడాల్సి వుంటుంది.
    మొత్తంగా ప్రపంచంపై గుత్తాధిపత్యాన్ని సాధించేందుకు గానూ దీర్ఘకాలిక వ్యూహాత్మక దృక్పథంతో అమెరికా ముందుకు సాగుతోందనేది స్పష్టం. అంతర్జాతీయంగా తాము నెలకొల్పాలనుకుంటున్న వ్యవస్థలో భాగంగానే ఈ ఇండో-పసిఫిక్‌ వ్యూహం వుంది. చైనాను కట్టడి చేసి, ఏకాకిని చేయడానికి మాత్రమే ఉద్దేశించలేదు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి గానూ భారత్‌ను తన కనుసన్నల్లో మెలిగేలా చేసుకోవాలన్నది అమెరికా ఆలోచనగా వుంది. వ్యూహాత్మక పత్రంలో ఈ మేరకు దిశా నిర్దేశం చేయబడింది. ఇరు ప్రభుత్వాల మంత్రిత్వ స్థాయి సమావేశాల్లో, ఇతర ఒప్పందాల్లో దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోవడం కనిపిస్తోంది.
     ఇండో-పసిఫిక్‌లో అమెరికా ఉనికినే కాదు, అమెరికా జోక్యాన్ని కూడా వ్యతిరేకించడం ఈ రీజియన్‌లో శాంతి పరిరక్షణకు కీలకమైనదే కాదు. మన సార్వభౌమాధికారాన్ని, స్వాతంత్య్రాన్ని పరిరక్షించుకోవడానికి కూడా అవసరం.

( వ్యాసకర్త : సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు )
ఆర్‌. అరుణ్‌ కుమార్‌

ఆర్‌. అరుణ్‌ కుమార్‌