Oct 13,2021 10:19

వాషింగ్టన్‌ :  భారత్‌లో కొనసాగుతున్న మంచి వ్యాక్సినేషన్‌ రేటు ఆ దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి సహకరిస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) పేర్కొంది. గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూట్‌ తాజాగా భారత్‌లో 9.5 వృద్ధి రేటుని అంచనా వేసినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత్‌ ప్రజలకు మెరుగ్గా కరోనా వ్యాక్సిన్‌లు అందిస్తోందని... ఇది ఆర్థికవ్యవస్థ వృద్ధికి సహాయపడుతుందని ఐఎంఎఫ్‌ చీఫ్‌ ఎకనామిస్ట్‌ గీతా గోపీనాథ్‌ అన్నారు. ఈ ఏడాది భారత్‌లో ఐఎంఎఫ్‌ వృద్ధి రేటు అంచనాలో పెద్ద మార్పు లేదని అన్నారు. భారత్‌ సెకండ్‌ వేవ్‌ నుండి త్వరగా కోలుకుందని, జులైలో భారీ క్షీణతను ఎదుర్కొందని... దీంతో తమ వృద్ధి రేటు అంచనాల్లో ఎలాంటి మార్పు లేదని అన్నారు. ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంక్‌ వార్షిక సమావేశానికి ముందు విడుదల చేసిన తాజా వరల్డ్‌ ఎకనామిక్‌ ఔట్‌లుక్‌ ప్రకారం.. కరోనా మహమ్మారి కారణంగా 7.3 శాతం కుదించిన భారత ఆర్థిక వ్యవస్థ 2021లో 9.5 శాతం అంచనా వేయగా, 2022 నాటికి 8.5 శాతంగా అంచనా వేసింది. 2021లో ప్రపంచవ్యాప్తంగా 5.9 శాతం, 2022లో 4.9 శాతం వృద్ది అంచనా వేయబడింది. అమెరికా ఈ ఏడాది ఆరు శాతం మరుసటి ఏడాది 5.2 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా వేసినట్లు తెలిపింది. 2021లో చైనా 8 శాతం, 2022లో 5.6 శాతం వృద్ధి చెందుతుందని ఐఎంఎఫ్‌ పేర్కొంది. భారత ఆర్థికవ్యవస్థ ఇప్పటికే అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని, వైరస్‌ ఇంకా పోలేదని గీతా గోపీనాథ్‌ మరోసారి పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ల పంపిణీ, వినియోగంలో భారత్‌ బాగా పనిచేస్తోందని.. ఇది ఆర్థికవ్యవస్థ పునరుద్ధరణకు కచ్చితంగా ఉపయోగపడుతుందని అన్నారు.