
- పిటిఐ ప్రధాన కార్యదర్శి రాజీనామా
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు మరో షాక్ తగిలింది. ఇమ్రాన్ ఖాన్ పార్టీ అయిన పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) ప్రధాన కార్యదర్శి అసాద్ ఉమర్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇమ్రాన్‌ఖాన్‌కు అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా అసాద్ ఉమర్‌కు పేరు ఉంది. ఇమ్రాన్ ఖాన్ మంత్రి వర్గంలో సమాచార మంత్రిగానూ పని చేశారు. అదైలా జైలు నుంచి విడుదలైన అనంతరం అసాద్ ఉమర్ ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఉమర్ మాట్లాడుతూ ఈ నెల 9న మిలటరీ ప్రధానకార్యాలయంపై దాడి జరగడం అత్యంత భయంకరమైన ఘటనగా విమర్శించారు. ఇమ్రాన్‌ఖాన్ అరెస్టుకు నిరసనగా మిలటరీ ప్రధానకార్యాలయంపై పిటిఐ కార్యకర్తలు, ఇమ్రాన్ ఖాన్ అభిమానులు దాడికి దిగిన సంగతి తెలిసిందే. ఈ దాడి కేసులో ఉమర్‌తో సహా ఫవాద్ చౌదరీ, షైరీన్ మజరీస్ వంటి అనేక మంది పిటిఐ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.
- పాక్‌లో 'అప్రకటిత మార్షల్ లా' : సుప్రీంలో ఇమ్రాన్ ఖాన్ పిటీషన్
ప్రస్తుతం పాకిస్థాన్‌లో 'అప్రకటిత మార్షల్ లా' అమల్లో ఉందని ఆ దేశ మాజీ ప్రధాని ఇమాన్ర్ ఖాన్ ఆరోపించారు. ఈ మేరకు పాకిస్థాన్ సుప్రీంకోర్టులో ఇమ్రాన్‌ఖాన్ పిటీషన్ వేశారు. అనేక రాష్ట్రాల్లో ప్రజా పరిపాలనకు సహాయం చేయడానికి సైన్యాన్ని మోహరించడాన్ని ఈ పిటీషన్‌లో సవాల్ చేశారు. పంజాబ్, ఖైబర్ పక్తుంఖ్వా, బులూచిస్తాన్, ఇస్లామాబాద్‌తో సహా పలు రాష్ట్రాల్లో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఆర్టికల్ 245ను అమలు చేయడాన్ని ఇమ్రాన్‌ఖాన్ ప్రశ్నించారు. పాకిస్థాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 245 ప్రకారం దేశాన్ని రక్షించడానికి ప్రజా పరిపాలనకు సహాయం చేయడానికి సైన్యాన్ని పిలవవచ్చు. అయితే ఆర్టికల్ 245 అమలు చేసే విధంగా దేశంలో పరిస్థితులు లేవని ఇమ్రాన్‌ఖాన్ తన పిటీషన్‌లో తెలిపారు. ఈ పిటీషన్‌లో ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, పిఎంఎల్-ఎన్ నాయకులు, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, షరీఫ్ కుమార్తె నవాజ్, మాజీ అధ్యక్షులు ఆసిఫ్ అలీ జర్దారీ, విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ ఇతరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు.