Mar 19,2023 19:51

గృహోపకరణాలను తయారు చేస్తున్న రామకృష్ణ కుటుంబ సభ్యులు

ప్రజాశక్తి- రేగిడి : ఆ యువకుడు ఏడో తరగతి వరకు చదువుకున్నాడు. పశ్చిమగోదావరి జిల్లా, పెనుగొండ వెళ్లి రేకులతో వివిధ రకాల గృహోపకరణాలు తయారు చేయడం నేర్చుకుంటూ, కుటుంబ పోషణ కోసం స్వయం ఉపాధి బాట పట్టాడు. జింక్‌ రేకులతో వస్తువుల తయారీగా మలుస్తూ ఆ కుటుంబం ఇంటిల్లిపాది అదే పనిలో ఉంటూ మరో 30 మంది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నారు. మండలంలోని తోకలవలసలో పుట్టి పెరిగి బూరాడ సెంటర్‌ వద్దకు వలస వచ్చిన సిరిపులపు రామకృష్ణ జింక్‌ రేకులతో వివిధ గృహోపకరణాలు తయారు చేసే పనులు నేర్చుకున్నాడు. ఓ దుకాణంలో కూలిగా చేరిన అతను అదే దుకాణంలో గృహోపకరణాలు తయారీ నేర్చుకుని బూరాడ జంక్షన్‌లో సొంత నిధులతో వీటి తయారీని ప్రారంభించారు. 2002-2003 నుంచి ఇదే పని తన తండ్రి సత్యంనాయుడుతో పాటు తల్లి, భార్య, ఇతరులకు నేర్పించాడు. తన తమ్ముడు చంద్రమౌళి ఎంఎ, ఎంబిఎ పూర్తి చేసి బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. ఈయన కూడా అన్నయ్యకు చేదోడు వాదోడుగా నిలవడంతో పాటు రామకృష్ణను గృహోపకరణాల తయారీ రంగంలో ప్రోత్సహించాడు. జింక్‌ రేకులు ముడి సరుకులు ఇతర ప్రాంతాల నుండి రప్పించి ట్రంకు పెట్లు, బకెట్లు, మీటర్‌ బాక్సులు, రైస్‌ డబ్బాలు, మోటార్‌ క్యాప్‌లు, వస్తువులు దాచుకునే స్టాండ్లు ఇలా రకరకాల వస్తువులు తయారుచేసి ఊరూరు విక్రయిస్తూ కుటుంబం జీవనం సాగిస్తున్నారు. అయితే ముడుసరుకు కొనుగోలకు ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదని బ్యాంకులో రుణాలు ఇచ్చి ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
ఊరూర అమ్మకాలు
జింక్‌తో తయారు చేసిన వస్తువులను సైకిల్‌తో ఊరురా వెళ్లి వస్తువులు విక్రయిస్తాం. ఇలా చేస్తే కూలి గిట్టుబాటు కాదు. పలు పట్టణాల, గ్రామీణ ప్రాంతాలకు వెళ్లడం ద్వారానే సరుకులు అమ్మకాలు అవుతాయి. బ్యాంకులో రుణాలు ఇచ్చి ఆదుకోవాలి.
ఎన్‌ సత్యం నాయుడు, తండ్రి, బూరాడ
బ్యాంకులు ప్రోత్సహించాలి
ఏటా అప్పులు చేసి ముడి సరుకులు పెనుగొండ నుంచి తెస్తాను. పెట్టుబడికి డబ్బులు లేక అరువు తేవడంతో టన్నుకు 12 వేల రూపాయలు అదనంగా కట్టవలసి వస్తుంది. బ్యాంకు రుణాలు ఇచ్చి ప్రోత్సహిస్తే బాగుంటుంది.
రామకృష్ణ, బూరాడ.
స్త్రీనిధి ద్వారా రుణాలు ఇప్పిస్తాం
వృత్తిపరంగా చిన్న కుటీర పరిశ్రమలకు సంబంధించి సంఘ సభ్యులు ఉంటే మహిళలు తరపున స్త్రీనిధి ద్వారా రుణాలు అందజేస్తాం. ప్రభుత్వం కుటీర పరిశ్రమలకు సంబంధించి ప్రోత్సకాలను అందిస్తుంది. దరఖాస్తు చేసుకుంటే రుణాలు అందజేస్తాం.
మంగమ్మ, ఎపిఎం, రేగిడి