Nov 24,2022 18:12

గాంధీనగర్‌ :   గుజరాత్‌ మొదటి విడత ఎన్నికల్లో పోటీ చేస్తున్నబిజెపి అభ్యర్థుల్లో 89 శాతం మంది కోటీశ్వరులేనని ఓ నివేదిక పేర్కొంది. గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది కోటీశ్వరుల సంఖ్య పెరిగిందని తెలిపింది. అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రీఫామ్స్‌ (ఎడిఆర్‌) గురువారం ప్రచురించిన నివేదికలో పేర్కొంది. మొదటి విడత ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులందరి సగటు ఆస్తి విలువ రూ.13.4 కోట్లుగా పేర్కొంది. రూ.175.78 కోట్లతో అత్యంత సంపన్న అభ్యర్థి రమేష్‌ తిలాలా రాజ్‌కోట్‌ సౌత్‌ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నట్లు తెలిపింది. రూ.162 కోట్లతో రెండో సంపన్న అభ్యర్థి కాంగ్రెస్‌కు చెందిన ఇంద్రనీల్‌ రాజ్‌గురు రాజ్‌కోట్‌ ఈస్ట్‌ నుండి పోటీ చేస్తున్నట్లు పేర్కొంది.
ఈ ఎన్నికల్లో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు సంపన్న అభ్యర్థులకే టిక్కెట్లు జారీ చేయడంతో .. ఈ ఎన్నికల్లో ధనబలం స్పష్టంగా కనిపిస్తోందని ఎడిఆర్‌ హెడ్‌ జనరల్‌ మేజర్‌ (రిటైర్డ్‌) అనిల్‌ వర్మ తెలిపారు. ఈ ఏడాది మొదటి విడత ఎన్నికల్లో 788 మంది అభ్యర్థుల్లో 27 శాతం మంది కోటీశ్వరులు కాగా, 2017 అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో ఈ సంఖ్య 21 శాతంగా ఉంది. ఈ ఏడాది 89 మంది బిజెపి అభ్యర్థుల్లో 79 మంది కోటీశ్వరులు కాగా, కాంగ్రెస్‌ అభ్యర్థుల్లో 73 శాతం మంది, ఆప్‌ అభ్యర్థుల్లో 33శాతం మంది కోటి రూపాయల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారని అన్నారు.