Jun 22,2022 07:51

* గతేడాది కంటే 28 శాతం అధిక ఉత్పత్తి
* సరఫరా లోపాలతో తీవ్రమైన బొగ్గు కొరత
*కోల్‌ ఇండియా, రైల్వే శాఖ పరస్పర నిందలు
* సమన్వయ పర్చడంలో ఘోరంగా విఫలమైన కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ : దేశీయంగా బొగ్గు ఉత్పత్తి గతేడాది కంటే గణనీయంగా పెరిగినా కూడా దేశంలో విద్యుత్‌ కోతలు కొనసాగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మే 31 నాటికి దేశీయంగా 137.85 మిలియన్‌ టన్నుల (ఎంటి) ఉత్పత్తి జరిగింది. గత 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయంలో బొగ్గు ఉత్పత్తి 104.83 ఎంటి మాత్రమే. అంటే ఈ ఏడాది బొగ్గు ఉత్పత్తి దాదాపు 28.6 శాతం పెరిగింది. గతేడాది రికార్డు స్థాయిలో 777 ఎంటి బొగ్గు ఉత్పత్తి అయినా కూడా విద్యుదుత్పత్తి కేంద్రాలకు డిమాండ్‌కు సరిపడినంత బొగ్గు అందక అవస్థలు పడిన సంగతి తెలిసిందే. రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి జరిగినా..కొరత ఏర్పడుతుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం కళ్ల అప్పగించి చూసిందే మినహా సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమైంది. అదానీ గ్రూపు సంస్థకు లబ్ది చేకూర్చేందుకే మోడీ సర్కార్‌ దేశవ్యాప్తంగా కృత్రిమ బొగ్గు కొరత సృష్టించిందన్న ఆరోపణలకు తాజా గణాంకాలు బలం చేకూర్చుతున్నాయి. బొగ్గు దిగుమతి టెండర్లను అదానీకి కట్టబెట్టి అనుచిత లబ్ది చేకూర్చేందుకే బొగ్గు రవాణా వ్యవస్థల్లో అవరోధాలను పరిష్కరించకుండా కేంద్రం కృత్రిమ కొరత సృష్టించిందన్న విషయం స్పష్టమౌతోంది. బొగ్గు సరఫరాకు అవసరమైన ర్యాకులను రైల్వేశాఖ పంపలేదని సిఐఎల్‌ విమర్శించగా..ర్యాకుల్లో బొగ్గు లోడింగ్‌, అన్‌లోడింగ్‌ విషయాల్లో కోల్‌ ఇండియా శ్రద్ధ వహించడం లేదని రైల్వే శాఖ విమర్శిస్తోంది. దీంతో ఇరు సంస్థల మధ్య అంతరం పెరిగి అది బొగ్గు కొరతకు దారితీసింది. దీంతో పాటు రుతుపవనాల ప్రభావంతో వరదల కారణంగా బొగ్గుక్షేత్రాల్లో వరదనీరు పారడం, తడి బొగ్గు తరలించే క్రమంలో కన్వేయర్‌ వ్యవస్థలు స్థంభించడం కూడా సరఫరా అంతరాయాలకు కారణమైంది. బొగ్గు సరఫరా విషయంలో కొల్‌ ఇండియా లిమిటెడ్‌ (సిఐఎల్‌), కేంద్ర విద్యుత్‌ శాఖ, రైల్వేల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో మోడీ సర్కార్‌ విఫలమైంది. పైగా ఇదే సాకుతో బొగ్గు దిగుమతులను ప్రోత్సహిస్తూ విద్యుత్‌ ఉత్పత్తి కంపెనీలకు విద్యుత్‌ శాఖ ద్వారా ప్రతిపాదనలు పంపింది. దిగుమతి చేసుకొనే బొగ్గు వల్ల దేశీయ బొగ్గు కంటే నాలుగైదు రెట్లు అధిక వ్యయం వెచ్చించాల్సివుంటుంది. డిమాండ్‌ అధికంగా ఉండే సీజన్‌లో ఈ ధర మరింత హెచ్చుగా ఉంటుంది. ఈ భారాన్ని మొత్తం అటు వినియోగదారులు, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలే భరించాల్సిన అగత్యం ఏర్పడింది. వినియోగదారులపైకి ఈ భారాన్ని నెట్టేయకుండా రాష్ట్రాలే రాయితీలు ఇవ్వాల్సివస్తే విద్యుత్‌ సరఫరా సంస్థలు నష్టాల్లో కూరుకుపోతాయి. అందువల్ల ప్రభుత్వాలు ఈ నష్టాలను నివారించుకునేందుకు విద్యుత్‌ కోతలు విధిస్తున్నాయి. అత్యధిక ధరలకు మార్కెట్‌ నుంచి విద్యుత్‌ కొనుగోలు చేసినా లేదా బొగ్గు దిగుమతులపై ఆధారపడిన విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల నుంచి కొనుగోలు చేసినా విద్యుత్‌ ఖర్చు బాగా పెరిగిపోతుంది. దీనివల్ల పరిశ్రమ రంగంపైనా, వినియోగదారులపైనా ఎనలేని భారాలు పడతాయి. విద్యుత్‌ కోతలూ అనివార్యమౌతాయి.
రవాణాలో అవరోధాలను తొలగించడమే పరిష్కారం : ఎఐపిఇఎఫ్‌
బొగ్గు కొరతను నివారించడానికి రవాణాలో అవరోధాలను తొలగించడమే ఏకైక పరిష్కారమని అఖిల భారత విద్యుత్‌ ఇంజనీర్ల సమాఖ్య (ఎఐపిఇఎఫ్‌) పేర్కొంది. ఈ దిశలో కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌ శాఖ, బొగ్గు, రైల్వే, సిఇఎ, సిఐఎల్‌, ఎస్‌సిసిఎల్‌ ప్రతినిధులతో తరుచూ సమావేశాలు నిర్వహించి ఎప్పటిక ప్పుడు సమస్యలను పరిష్కరించాలని సూచించింది. అలాగే బొగ్గు క్షేత్రాలను, విద్యుత్‌ కేంద్రాలను అనుసంధా నిస్తూ రైల్వే ట్రాకులను విస్తరింపజేయడం, బొగ్గు రవాణాకు అవసరమైన ర్యాకులను అందుబాటులో ఉంచడం వంటివి రైల్వేశాఖ తక్షణమే చేపట్టాల్సివుంటుందని తెలిపింది. విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలతో పాటు కొన్ని సందర్భాల్లో స్టీల్‌, అల్యూమీనియం, సిమెంటు వంటి విద్యుత్‌ యేతర రంగాలు కూడా బొగ్గు కొరతను ఎదుర్కొంటున్నాయని పేర్కొంది. రవాణా వ్యవస్థల్లో నెలకొన్న ఈ అవరోధాలను సరిచేయకుండా నిర్లక్ష్యం వహిస్తే భారత్‌ ఎప్పటికీ విద్యుత్‌ కోతలను ఎదుర్కొంటూనే ఉండాల్సివుంటుందని హెచ్చరించింది.