Nov 26,2020 15:54

ప్రకాశం (మార్టూరు రూరల్‌) : ఆగి ఉన్న లారీని కారు ఢకొీన్న ప్రమాదంలో బ్యాంకు ఉద్యోగులైన దంపతులలో భార్య అక్కడికక్కడే మృతిచెందగా.. తీవ్ర గాయాలకు గురైన భర్త కోమాలోకి వెళ్లారు. ఈ ఘటన మార్టూరు సమీపంలోని జగద్గురు స్పిన్నింగ్‌ మిల్లు వద్ద జాతీయ రహదారిపై గురువారం వేకువజామున చోటుచేసుకుంది. ఎఎస్‌ఐ కొండ్రకొండ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. ఒంగోలు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకులో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పని చేస్తున్న మేరెడ్డి వెంకటసాయి కుమార్‌ రెడ్డి, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పని చేస్తున్న దొడ్డి కిరణ్మయి భార్యా, భర్తలు. వీరిరువురు వారి స్వగ్రామమైన విజయవాడ నుంచి బ్యాంకు విధులకు హాజరు కావడానికి బుధవారం రాత్రి తమ కారులో ఒంగోలు వెళుతున్నారు. వీరు ప్రయాణిస్తున్న కారు మార్టూరు సమీపంలోకి రాగానే జాతీయ రహదారిపై ఎటువంటి సిగల్స్‌ లేకుండా నిర్లక్ష్యంగా నిలిపి ఉంచిన లారీని భారీగా కురుస్తున్న వర్షంలో గుర్తించక బలంగా ఢకొీట్టారు. ఈ ప్రమాదంలో కిరణ్మయి (29) ఘటనా స్థలంలోనే మృతిచెందింది. కారు నడుపుతున్న సాయి కుమార్‌ తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్ళాడు. హైవేపై మొబైల్‌ పోలీసులు పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా ప్రమాదాన్ని గుర్తించి మార్టూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తీవ్రంగా గాయపడ్డ సాయికుమార్‌ను 108 వాహనంలో గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసిన మార్టూరు ఎస్‌ఐ శివ కుమార్‌ పోస్టుమార్టం నిమిత్తం కిరణ్మయి మృతదేహాన్ని మార్టూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.