Oct 18,2020 01:10

నిమ్మరం ఇచ్చి దీక్షలను విరమింపజేస్తున్న ఎంఎల్‌ఎలు

పేపరుమిల్లు కార్మికుల సమస్యలపై దిగొచ్చిన యాజమాన్యం
దీక్ష విరమించిన ఎంఎల్‌ఎ రాజా, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు అరుణ్‌
ప్రజాశక్తి-రాజమహేంద్రవరం ప్రతినిధి రాజమహేంద్రవరం ఆంధ్రా పేపర్‌ మిల్లులో కాంట్రాక్టుల కార్మికులను పర్మినెంట్‌ చేసే విషయమై ఎట్టకేలకు యాజమాన్యం దిగొచ్చింది. కార్మికశాఖ ఉన్నతాధికారులు, యాజమాన్య ప్రతినిధులతో రెండు రోజులుగా జరుగుతున్న చర్చలు శనివారం రాత్రి ఫలించాయి. కార్మికుల సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తామని యాజమాన్యం ఒప్పుకోవడంతో నిరవధికదీక్షలు విరమించారు.
2019 జనవరి 1న యాజమాన్యానికీ, అప్పటి గుర్తింపు సంఘానికీ మధ్య 12 (3) ప్రకారం 84 మంది కాంట్రాక్ట్‌ కార్మికులను ఇన్‌ప్లాంట్‌ ట్రైనీలుగాను, 55 మంది కార్మికులను బదిలీలుగానూ సీనియారిటీ ఆధారంగా తీసుకునేందుకు ఒప్పందం జరిగింది. ఈనేపథ్యంలో కోర్‌ విభాగాల్లో 55 మందిని పర్మినెంట్‌ చేయడానికి యాజమాన్యం ఒప్పందం చేసుకుంది. అయితే యాజమాన్యం దాన్ని అమలు చేయకుండా తాత్సారం చేస్తూ వచ్చింది. చివరికి ఒప్పందానికి భిన్నంగా సీనియారిటీని పక్కన పెట్టి అడ్డుగోలుగా ఆర్డర్లు ఇవ్వడంతో కార్మికులు తిరుగుబావుటా ఎగురవేశారు. పలుమార్లు యాజమాన్యంతో చర్చలు జరిపినా నిరంకుశవైఖరిని అవలంభించింది. 50 ఏళ్లు దాటిన వారిని, మహిళలను, సెక్యూరిటీ కార్మికులను తీసుకోబోమని అనేక షరుతులు పెట్టి, అనుకూల యూనియన్లతో ఒప్పందానికి యాజమాన్యం ప్రయత్నించింది. దీంతో కార్మికుల పక్షాన రాజానగరం ఎంఎల్‌ఎ జక్కంపూడి రాజా, సిఐటియు జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌, వైసిపి కో- ఆర్డినేటర్‌ శివరామ సుబ్రహ్మణ్యంతోపాటు పలు కార్మిక సంఘాల నాయకులు పేపరుమిల్లు యాజమాన్యంతో పలుమార్లు చర్చలు జరిపారు. యాజమాన్యం ఎంతకీ దిగిరాకపోవడంతో ఈనెల 16వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు మిల్లులోనే ఎంఎల్‌ఎ జక్కంపూడి రాజా, అరుణ్‌ కార్మికులకు మద్దతుగా నిరవధికదీక్షలకు దిగారు.
రెండోరోజైన శనివారం కూడా దీక్ష కొనసాగింది. అయినప్పటికీ యాజమాన్యం స్పందించకుండా నిరంకుశ వైఖరిని అవలంభించడంతో కార్మికులు, ఎంఎల్‌ఎ అభిమానులు, వైసిపి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జక్కంపూడి గణేష్‌ యువసేన ఆధ్వర్యంలో యువకులు స్థానిక కంబాలచెరువు సెంటర్‌ నుంచి పేపరుమిల్లు వరకు మోటారు సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మిల్లు ప్రధాన ద్వారం వద్ద పెద్దఎత్తున నిరసనకు దిగారు. పర్మినెంట్‌ విషయంలో యాజమాన్యం నిరంకుశ వైఖరి విడనాడాలంటూ పెద్దపెట్టున నినదించారు. పోలీసులు భారీగా మోహరించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈసందర్భంగా ప్రత్తిపాడు, పి.గన్నవరం, అనపర్తి, రంపచోడవరం ఎంఎల్‌ఎలు పర్వత పూర్ణచంద్ర ప్రసాద్‌, కొండేటి చిట్టిబాబు, సూర్యనారాయణరెడ్డి, ధనలక్ష్మి దీక్షా శిబిరానికి చేరుకుని సంఘీభావం తెలిపారు. ఈసందర్భంగా కార్మికశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఉదరులక్ష్మీ ఆదేశాల మేరకు కార్మికశాఖ జాయింట్‌ కమిషనర్‌ ఎం.రామారావు, డిప్యూటీ కమిషనర్‌ పి.శ్రీనివాసరావు సమక్షంలో ఫ్యాక్టరీ వైస్‌ ప్రెసిడెంట్లు సూరారెడ్డి, జయకృష్ణ, పేపర్‌మిల్లు ఎమ్‌డీ అనీష్‌ మాత్యూతో అధికారులు, ఎంఎల్‌ఎలు చర్చలు జరిపారు. సఫలం కావడంతో రాజా, అరుణ్‌లకు నిమ్మరసం ఇచ్చి, దీక్ష విరమింపజేశారు. ఈసందర్భంగా రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి మాట్లాడుతూ, యాజమాన్యం కార్మికుల సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించడం మంచి పరిణామన్నారు. ఎంఎల్‌ఎ రాజా మాట్లాడుతూ, కార్మిక సమస్యలు పరిష్కరిస్తామని, సీనియర్‌ కార్మికులతో పాటు మహిళలను రెగ్యులరైజ్‌ చేస్తామని యాజమాన్యం అంగీకరించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. మరికొన్ని సమస్యలను కార్మికశాఖ అధికారులు పరిష్కరించేందుకు అంగీకరించినట్లు తెలిపారు.
అగ్రిమెంట్‌లో ముఖ్యాంశాలివే..!
పేపర్‌ మిల్లులో 1,366 మంది కాంట్రాక్ట్‌ కార్మికుల సీనియారిటీ ప్రాతిపదికన జాబితాలు తయారు చేసి, డిసిఎల్‌కు అందజేశారు. అలాగే 2019 అగ్రిమెంట్‌ నాటికి 53 ఏళ్ల వయస్సు వారిని సీనియారిటీ ప్రాతిపదికన రెగ్యులైజ్‌ చేయడానికి అంగీకారం. ఏడాది శిక్షణా కాలంగా కుదించి, మహిళ కార్మికులను పర్మినెంట్‌ చేసేందుకు అంగీకారం. బదిలీలుగా తీసుకున్న కార్మికులను కోర్‌పోస్టుల్లో భర్తీకి ఒప్పందం.సెక్యూరిటీ కార్మికుల విషయాన్ని కార్మిక శాఖ అధికారుల సమక్షంలో పరిష్కరించేందుకు అంగీకారం. ఈ ఒప్పందాలన్నీ నవంబర్‌ 1తేదీ నాటికి పూర్తి చేస్తామని హామీ.
కార్మికుల ఐక్య విజయం : అరుణ్‌
ఇది కార్మికుల ఐక్య విజయమని జిల్లా ఉపాధ్యక్షుడు టి.అరుణ్‌ అన్నారు. రెండేళ్లుగా మిల్లు కార్మికుల అనేక సమస్యలపై సిఐటియు ఇతర సంఘాలను కలుపుకుని పోరాటాలు సాగించిందన్నారు. ఎంఎల్‌ఎ రాజా కార్మికుల పక్షాన సంపూర్ణంగా నిలిచారన్నారు. అనేక ఒత్తిళ్లు వచ్చినా కార్మికుల పక్షానే నికరంగా నిలబడినందుకు కార్మికుల తరపున ధన్యవాదాలు తెలిపారు. దీక్షలకు సంఘీభావం తెలిపిన ప్రజాసంఘాల నాయకులకు, వర్తక సంఘాల నాయకులకు, కార్మికులు, రాజకీయ పార్టీలకు సిఐటియు తరపున ధన్యవాదాలు తెలిపారు.