Oct 08,2020 21:22

తిరువనంతపురం : రైతుల అభ్యున్నతి కోసం కేరళలోని వామపక్ష ప్రజాతంత్ర కూటమి (ఎల్‌డిఎఫ్‌) ప్రభుత్వం గొప్ప ముందడుగేసింది. ప్రత్యేక నిధితో 'కేరళ కర్షక క్షేమానిధి బోర్డు' ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ బోర్డుకు ఛైర్మన్‌గా డాక్టర్‌ పి.రాజేంద్రన్‌ను నియమించనున్నారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి బోర్డు ఏర్పాటు చేయడం దేశంలో ఇదే తొలిసారి. ఉద్యానవన, ఔషద మొక్కల పెంపకం, నర్సరీ, చేపలు, అలంకార చేపలు, మస్సెల్స్‌, తేనెటీగలు, పట్టు పురుగులు, ఫౌల్ట్రీ, బాతులు, మేకలు, కుందేళ్లు, పశుసంపద వంటి వ్యవసాయ, వ్యవసాయనుబంధ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు బోర్డు కృషి చేస్తుంది. బోర్డులో సభ్యత్వం పొందడానికి రైతులు రిజిస్ట్రేషన్‌ ఫీజుగా రూ.100, నెల వారీ రుసుము రూ.100 చెల్లించాలి. ఇది ఆరు నెలలు లేదా సంవత్సరానికి ఒకేసారి చెల్లించవచ్చు. ప్రభత్వం దీనికి సమాన మొత్తాన్ని మొత్తాన్ని జత చేసి వెల్ఫేర్‌ ఫండ్‌ సభ్యుల ఖాతాల్లో జమ చేస్తుంది. లబ్దిదారులకు వ్యక్తిగత, కుటుంబ ఫించన్లు అందజేయడం, అనారోగ్య, వైకల్య సమయాల్లో చేయూత, వైద్య సహాయం, వివాహ, ప్రసూతి భత్యం, విద్యా సహాయం, మరణాంతర ప్రయోజనాలు లభిస్తాయి.