Oct 18,2020 01:03

కాకినాడ కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న నాయకులు

ప్రజాశక్తి-కాకినాడ సిటీ మహిళలు, బాలికలకు రక్షణ కల్పించాలని కోరుతూ మహిళలు, ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో శనివారం స్థానిక కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా ఎస్‌సి, డిఆర్‌ఒలకు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ నెల వ్యవధిలోనే బొమ్మూరు, అనపర్తి, రాజవొమ్మంగిలో ముగ్గురు బాలికలపై అత్యాచారం జరగడం భయాందోళనకు గురి చేస్తోందన్నారు. జిల్లాలో బాలికలకు రక్షణ కరువైందన్నారు. అధికారులు తక్షణమే ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఆత్మరక్షణ విద్య నేర్పించే సెంటర్లను ఏర్పాటు చేయాలని, పాఠశాలల్లో ఆత్మరక్షణ విద్య ఏర్పాటు చేయాలన్నారు. అశ్లీల వెబ్‌సైట్లు, మద్యం నిషేధించాలని డిమాండ్‌ చేశారు. అత్యాచారాలకు పాల్పడిన వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలన్నారు. ఫిర్యాదు చేసిన వెంటనే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబాలను అండగా ఉండాలని, ఆర్థికంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈకార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి సిహెచ్‌.రమణి, సిఐటియు జిల్లా అధ్యక్షురాలు ఎం.వీరలక్ష్మి, జమాత్‌ ఇస్లామీ హింద్‌ మహిళా నాయకులు షెహనాజ్‌, అహ్మద్‌, ఇబ్రహీం, ఆర్‌కెపి నాయకులు కాశి బాలయ్య, గంగా భవానీ పాల్గొన్నారు.