Nov 25,2020 22:45

గ్రామసభలో పనుల నివేదికను వివరిస్తున్న డిఆర్‌పి

ప్రజాశక్తి-కొనకనమిట్ల: మండల కేంద్రం కొనకనమిట్లలో మొక్కలు లేకుండానే బిల్లులు చెల్లించారని డిఆర్‌పిలు గ్రామసభలో బుధవారం వెల్లడించారు. స్థానిక సచివాలయ ఆవరణలో సామాజిక తనిఖీ బృందం ఆధ్వర్యంలో గ్రామసభ జరిగింది. ఉపాధి హమీ పథకం ద్వారా చేపట్టిన పనుల నివేదికను డిఆర్‌పిలు సభాదృష్టికి తెచ్చారు. ఏప్రిల్‌ 2019 నుంచి మార్చి 2020 వరకు గ్రామంలో ఉపాధి హామీ పథకం ద్వారా పనుల నివేదికను గ్రామసభలో వివరాలు వెల్లడించారు. చేపట్టిన కొన్ని పనుల్లో కొలతలు తేడాలు, చేసిన పనుల కంటే అదనంగా నగదు మంజూరు చేసినట్లు నివేదిక ద్వారా తెలియజేశారు. పొలాల్లో మొక్కలు లేని వారికి బిల్లులు చెల్లించారని అన్నారు. గ్రామంలో 24మంది రైతులకు పండ్ల మొక్కలు మంజూరైనట్లు చెప్పారు. ఈ సందర్భంగా రైతు పగడాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రైతులు పొలాల్లో కూలీలతో గుంతలు తీయించుకొని, మొక్కలు తెచ్చి నాటుకొని మూడేళ్ళు దాటాయి. ఇప్పటి వరకు రూ.24లక్షల బిల్లులు రాకపోవడంతో వాటిని సంరక్షించుకో లేక దున్నివేసినట్లు గ్రామసభలో ధ్వజమెత్తారు. గ్రామసభలో రైతులు ఎవరూ పాల్గొనలేదు. కేవలం వాలంటీర్లు మాత్రమే హాజరయ్యారు. దీంతో గ్రామసభ వెలవెలబోయింది. కార్యక్రమంలో ఎస్‌ఆర్‌పి ఎం.బుజ్జి, ఎపిఒ కె.నాగరాజు, పంచాయతీ కార్యదర్శి సంతోష్‌కుమార్‌, డిఆర్‌పిలు, టిఎ శివారెడ్డి, ఎఫ్‌ఎలు ముక్కాల శ్రీను, ఎన్‌.కరుణయ్యలు పాల్గొన్నారు.