
ప్రకాశం (పెద్ద తుర్లపాడు) : కేంద్రలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పెద్ద తర్లుపాడు మండలంలో సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ నుంచి స్థానిక తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు. కెవిపిఎస్ జిల్లా కన్వీనర్ జవాజి రాజు మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం కార్మికుల పొట్టకొట్టి కార్పొరేటర్ల జేబులు నింపుతుందని అన్నారు. మోడీ ప్రభుత్వం కేంద్ర కీలకమైన ప్రభుత్వ సంస్థలను పరిశ్రమలను పెట్టుబడుదారులకు అమ్మేస్తూ మోడీ ప్రభుత్వం దేశభక్తి గురించి మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. ప్రభుత్వ పథకాల్లో పని చేస్తున్నా అంగన్వాడి, మద్యహ్న భోజనం, ఆశ, స్వఛ్ఛబారత్, ఐకెపి స్కీం వర్కర్స్కు కనీస చట్టాలు అమలు చేయకుండా వారి చేత వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. దేశంలోని అసంఘటిత కార్మికులు కనీస వేతనాలు ఉద్యోగ భద్రత సామాజిక సౌకర్యాలు లేక బానిసలుగా జీవిస్తున్నారని, వారి సమస్యల పట్ల మోడీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు వై.పాపిరెడ్డి, సిఐటియు నాయకులు యం.బాలమ్మ, వి.పుల్లమ్మ, లలిత, శివ, సత్యనారాయణ్మ, నాసరమ్మ, పి.జ్యోతి, పి.రాజకుమారి, సుశీల, పి.నాగమ్మ, చాంద్ బీ, మైమూన్ తదితరులు పాల్గొన్నారు.