Oct 24,2020 20:16

విద్యుత్‌ కాంతులతో పైడితల్లి అమ్మవారి ఆలయం 

ప్రజాశక్తి-విజయనగరం  : పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు పలువురు ప్రముఖులు రానున్నారని కలెక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్‌ తెలిపారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఏవిధమైన అసౌకర్యం కలగకుండా చూసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈనెల 27న అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, ఉప ముఖ్యమంత్రి ధర్మాన కష్ణదాస్‌, పర్యాటక సాంస్కతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పలువురు పార్లమెంటు, శాసనసభ్యులు ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకొనేందుకు వస్తున్నట్టు సమాచారం వచ్చిందన్నారు. అధికారులంతా సమన్వయంతో సమిష్టిగా పనిచేస్తూ ఉత్సవాలను విజయవంతం చేసేందుకు కషిచేస్తున్నారని పేర్కొన్నారు.
ఉత్సవాలకు ప్రత్యేక అధికారుల నియామకం
ఉత్సవాల నిర్వహణకోసం ఈ ఏడాది ప్రభుత్వం ఇద్దరు ప్రత్యేకాధికారులను నియమించిందని కలెక్టర్‌ చెప్పారు. దేవాదాయశాఖ తరపున కష్ణా జిల్లా పెనుగంచిప్రోలు దేవస్థానానికి చెందిన డిప్యూటీ కమిషనర్‌ ఎన్‌.వి.ఎస్‌.ఎన్‌.మూర్తిని నియమించారని చెప్పారు. సిరిమాను తయారీలో అనుభవజ్ఞులైన అటవీశాఖ అధికారి జి.లక్ష్మణ్‌ను కూడా మూడు రోజులపాటు ఉత్సవాల ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ఆదేశాలు జారీచేశారని తెలిపారు. 
సిరిమాను తయారీని పరిశీలించిన కలెక్టర్‌
ఉత్సవాల కోసం సిద్ధం చేస్తున్న సిరిమానును కలెక్టర్‌ పరిశీలించారు. హుకుంపేటలో పూజారి బంటుపల్లి వెంకటరావు నివాసానికి సమీపంలో సిద్ధంచేస్తున్న సిరిమాను పరిశీలించారు. ప్రతిఏటా దీనిని తయారీలో భాగస్వాములవుతున్న వడ్రంగి కనిమెళ్ల రమణ, తాళ్లపూడి స్వామినాయుడు తదితరులతో మాట్లాడారు. అటవీశాఖ అధికారి లక్ష్మణ్‌ సిరిమాను పటిష్టంగా తయారు చేసేందుకు చేపట్టిన జాగ్రత్తలను వివరించారు. కలెక్టర్‌ వెంట జెసిలు జి.సి.కిషోర్‌ కుమార్‌, జె.వెంకటరావు, ఎఎస్‌పి శ్రీనివాసరావు, డిఎస్‌పి వీరాంజనేయ రెడ్డి, ఆర్‌డిఒ భవానీశంకర్‌, డిఆర్‌ఒ గణపతిరావు, తహశీల్దార్‌ ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.