Jun 24,2022 07:30

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఎన్‌డిఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము నేడు (శుక్రవారం) నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. అందుకోసం ఆమె గురువారం ఒరిస్సాలోని భువనేశ్వర్‌ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్‌ పోర్టులో కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్‌ షెకావత్‌, అర్జున్‌ ముండా, వినోద్‌ కుమార్‌, అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ద్రౌపది ముర్ము రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ , కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిశారు. శుక్రవారం ఉదయం 10్ణ30 గంటలకు ద్రౌపది ముర్ము పార్లమెంట్‌లోని రాజ్యసభ సెక్రటేరియట్‌లో నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. నామినేషన్‌ పేపర్లలపై బిజెపితో పాటు ఎన్‌డిఎ పక్షాలు, బిజెడి సభ్యులు సంతకాలు చేశారు. ఆమె నామినేషన్‌ కార్యక్రమానికి మోడీ, అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు బిజెపి జాతీయ అధ్యక్షులు జెపి నడ్డా, ఎన్‌డిఎ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ మాట్లాడుతూ రాష్ట్రపతి ఎన్నికకు ద్రౌపది ముర్ము నామినేషన్‌ దాఖలు చేయడం గురించి బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా తనతో మాట్లాడారని, రాష్ట్ర మంత్రులు జగన్నాథ్‌ సరకా, తుకుని సాహు నామినేషన్‌ పత్రాలపై సంతకాలు చేశారని తెలిపారు. వారు నామినేషన్‌ కార్యక్రమానికి హాజరవుతారని అన్నారు.