
ఐరాస : చిన్నారుల మృతికి కారణమైన దగ్గు సిరప్‌ల తయారీ సంస్థల మధ్య ఏదైనా సంబంధం ఉందా అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) దర్యాప్తు చేపడుతోంది. ఈమేరకు చర్యలు చేపట్టాల్సిందిగా ఆయా దేశాలను ఆదేశించినట్లు మంగళవారం సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. చిన్నారుల మరణాలు జరగకుండా నిరోధించాల్సిన బాధ్యత ఉందని డబ్ల్యుహెచ్‌ఒ పేర్కొన్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.
భారత్, ఇండోనేషియాల్లో తయారైన దగ్గు సిరప్‌ల కారణంగా మూడు దేశాల్లో 300 మందికి పైగా చిన్నారులు మరణించిన సంగతి తెలిసిందే. గాంబియా, ఉజ్బెకిస్థాన్, ఇండోనేషియా దేశాల్లో ఈ మరణాలు నమోదయ్యాయి. భారత్, ఇండోనేషియాలో తయారైన ఆరు ఔషధ కంపెనీలతో ఈ మరణాలు ముడిపడి ఉన్నాయని, దీంతో ఈ కంపెనీల మధ్య ఏదైనా సంబంధం ఉందా అని దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపింది. జులై 2022లో గాంబియాలో మొదటగా మరణాలు నమోదయ్యాయి. అయితే చిన్నారులు సాధారణ దగ్గు కోసం తీసుకునే సిరప్‌లతో మరణాలు ముడిపడి ఉన్నాయని డబ్ల్యుహెచ్‌ఒ తెలిపింది. ఈ మందుల్లో డైథైలిన్ గ్లైకాల్/ ఇథిలీన్ గ్లైకాల్ అనే విషపదార్థం మోతాదుకు మించి ఉందని పరీక్షల్లో తేలింది.
కంబోడియా, ఫిలిప్పీన్స్, తూర్పు తైమూర్, సెనెగల్ నాలుగు దేశాలకు ఈ విచారణను విస్తరించినట్లు ఆరోగ్య సంస్థ తెలిపింది. నాసిరకం మందులు నిర్మూలించేందుకు, నియంత్రించేందుకు తనిఖీలు ప్రారంభించాలని ఆయా దేశాల ప్రభుత్వాలకు ప్రపంచ ఔషధ పరిశ్రమ పిలుపునిచ్చింది. భారతదేశానికి చెందిన మైడెన్ ఫార్మాస్యూటికల్స్, మారియన్ బయోటెక్ కంపెనీలు మరణాలనతో ముడిపడి ఉన్నాయి. ఇప్పటికే ఈ రెండు కంపెనీలను మూతపడ్డాయి. అయితే మైడెన్ ఉత్పత్తుల్లో ఎలాంటి సమస్యలు లేవని డిసెంబర్‌లో భారత్ ప్రకటించింది.