
న్యూఢిల్లీ : భారతదేశ ఆర్థికవృద్ధి రేటు 7శాతంగా ఉంటుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా 2022-23 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగం ముగిసిన తర్వాత ఆమె ఆర్థిక సర్వేను సమర్పించారు. భారత ఆర్థిక వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 7శాతంతో పోలిస్తే.. వచ్చే ఏడాది 6.5 శాతంగా పరిమితమౌతుందని సర్వే పేర్కొంది. భారత జిడిపి 6.5 శాతంగా ఉంటుందని అంచనావేసినప్పటికీ.. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో భారత్ తన స్థానాన్ని పదిలం చేసుకుందని వివరించింది.
భారత్ జిడిపి వృద్ధి అంచనాలు ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్, ఆర్‌బిఐ అంచనాలకు తగ్గట్టుగానే ఉన్నాయి. అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయ పరిస్థితులను అనుసరించి వాస్తవ జిడిపి 6 - 6.8 శాతం మధ్య ఉండవచ్చని స్పష్టం చేసింది. కరోనా మహమ్మారి నుండి భారత్ వేగంగా కోలుకుందని సర్వే పేర్కొంది. దేశీయ డిమాండ్, మూలధన పెట్టుబడుల్లో పెరుగుదల ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తాయని, 2022 ఏప్రిల్‌లో ద్రవ్యోల్బణం 7.8 శాతానికి చేరిందని సర్వే తెలిపింది. ఇటీవల కాలంలో టెక్ సంస్థలు భారీగా ఉద్యోగుల తొలగింపులు చేపట్టడంతో మాంద్యం భయం పెరిగిందని తెలిపింది. అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థిక మాంద్యం పరిస్థితులను ఎదుర్కోవడంతో భారత్ లోకి పెట్టుబడుల ప్రవాహం పెరగవచ్చని .. అయితే భారత ద్రవ్యోల్బణం ఆరు శాతం కంటే తక్కువగా ఉండాలని సర్వే సూచించింది. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 2019 నుండి ఇది ఐదవ బడ్జెట్.