Oct 05,2022 07:26
  • ఆధునిక టెక్నాలజీ పేరిట గుప్పెట్లోకి
  • కార్పొరేట్ల లాభాలకై మోడీ సర్కారు తపన
  • డిజిటల్‌, స్టార్టప్‌, డ్రోన్లంటూ ప్రత్యేక పథకాలు
  • రాష్ట్రంలోనూ అదే దిశ

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి-అమరావతి : భారత వ్యవసాయ రంగంపై ప్రపంచ పెట్టుబడిదారుల కన్ను పడింది. ఈ రంగం నుంచి లాభాలు పోగేసుకోడానికి బహుళజాతి సంస్థలు ఉవ్విళ్లూరుతున్నాయి. రైతుల స్థానంలో డ్రోన్లు, రోబోలు సహా ఆధునిక యంత్రాలను ప్రవేశపెట్టి తద్వారా వ్యవసాయ రంగాన్ని తమ గుప్పెట్లో పెట్టుకొని ఆర్థిక ఆధిపత్యం సాధించాలని కుట్రలు పన్నుతున్నాయి. అందుకు మోడీ ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలిచింది. కార్పొరేట్ల యధేచ్ఛ ప్రవేశానికి విధాన పరమైన సంస్కరణలతోపాటు బడ్జెట్‌లో భారీ కేటాయింపులు చేస్తోంది. మూడు నల్ల వ్యవసాయ చట్టాలు అందులో భాగమే. డిజిటల్‌ ఇండియా, స్టార్టప్‌ ఇండియా నినాదాలు ప్రస్తుతం వ్యవసాయ, అనుబంధ రంగాల్లో కార్పొరేట్ల పెట్టుబడులకు వాటంగా మారాయి.

  • పలు అధ్యయనాలు

ఇండియా బ్రాండ్‌ ఈక్విటీ ఫౌండేషన్‌ ప్రకారం 2017 నుంచి 2020 వరకు మన దేశం ఒక బిలియన్‌ అగ్రి ఫండింగ్‌ పొందింది. పెట్టుబడిదారుల ఆసక్తి ఉంది. అందుకే అగ్రి నిధులు, అగ్రి స్టార్టప్‌ నిధుల్లో ఇండియా మూడవ స్థానంలో ఉంది. 2025 నాటికి అగ్రి కంపెనీలు 30-35 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు మనకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. ఫిక్కీ-ప్రైస్‌ వాటర్‌ కూపర్స్‌ (పిడబ్ల్యుసి) నివేదిక ప్రకారం అగ్రి పర్యావరణ వ్యవస్థలోకి పది బిలియన్‌ డాలర్ల పెట్టుబడులొస్తాయని తెలిపింది. 2019లో 248 మిలియన్‌ డాలర్లు రాగా కరోనా ఏడాది 2020లో 500 మిలియన్‌ డాలర్లు వచ్చాయని పేర్కొంది.

  • అందుకే..

పిడబ్ల్యుసి అధ్యయనం మేరకు వ్యవసాయరంగం భారత ఆర్థిక వ్యవస్థలో అధిక ప్రాధాన్యం ఉన్న రంగం. 58 శాతం జనాభాకు జీవనోపాధి కల్పిస్తోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోనూ కీలకంగా ఉంది. ప్రపంచ వ్యవసాయ స్థూల విలువ (జివిఎ) 11.9 శాతాన్ని (3,320 బిలియన్‌) జోడిస్తోంది. చైనా తర్వాత రెండవది. కాగా ప్రపంచ ఆహార, సరఫరా విషయంలో గడచిన పదేళ్లలో 50 శాతం ఉత్పత్తి పెరుగుదల ఉన్నప్పటికీ, 2050 నాటికి జనాభా పెరుగుదలకు సరిపడ ఆహార ఉత్పత్తి అందుబాటులో లేదు. అందుకే వ్యవసాయోత్పత్తి, ఉత్పాదకత ఇంకా ఇంకా పెరగాలి. అందుకు టెక్నాలజీలో కొత్త ఆవిష్క రణలు జరగాలి. వాటిని భారత వ్యవసాయరంగంలో ప్రవేశపెట్టాలి. ఇక్కడి రైతుల సంప్రదాయ, కొత్తగా వచ్చే ఆధునిక ఉత్తమ పద్ధతులు అనుసంధానం కావాలి. పెట్టుబడులు ఆకర్షించాలంటే.. మౌలిక వసతుల కల్పన, కొత్త ఆవిష్కరణలు, సంస్థాగత మద్దతు కోసం కీలక రంగాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించాలి.

  • అదే తోవ

ప్రస్తుతం టెక్నాలజీ సర్వవ్యాప్త మైంది. టెక్నాలజీ లేని రంగాన్ని ఊహించలేము. అందుకు వ్యవ సాయం మినహాయింపు కాదు. అయితే ఆ టెక్నాలజీ రైతులకు ఉపయోగపడుతోందా? లేక కార్పొ రేట్లకా? అన్నదే ప్రశ్న. మోడీ ప్రభుత్వం కార్పొరేట్ల లాభాల కోసం ఒక పద్ధతి ప్రకారం పని చేస్తోంది. ఇండియా ఎకో డిజిటల్‌ సిష్టమ్‌ (ఐడిఇఎ), రైతుల డేటాబేస్‌, యూనిఫైడ్‌ ఫార్మర్స్‌ సర్ఫేస్‌ ఇంటర్‌ఫేస్‌ (యుఎఫ్‌ఎస్‌ఐ), రాష్ట్రాలకు నిధులిచ్చే డిజిటల్‌ అగ్రికల్చర్‌ మిషన్‌ను ప్రారంభించింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మిషన్‌ లెర్నింగ్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింక్స్‌, బ్లాక్‌ చైన్‌లను ఆధునిక టెక్నాలజీతో నేషనల్‌ ఇ-గవర్నెన్స్‌ ప్లాన్‌ ద్వారా రాష్ట్రాలకు కేంద్రం అందిస్తోంది. డ్రోన్‌ టెక్నాలజీతో సహా ఐటిని ఉపయోగించి లక్ష్యాన్ని సాధించేందుకు దూకుడుగా ముందుకెళుతోంది. డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్స హించేందుకు ఈశాన్య రాష్ట్రాల్లో చిన్న, సన్నకారు, మహిళలకు రూ.5 లక్షల సబ్సిడీని మొన్న బడ్జెట్‌లో ప్రకటించింది. ప్రధాని మోడీ ఇటీవల 100 డ్రోన్లను స్వయంగా ఆవిష్కరించారు. పంజాబ్‌, యుపి, గోవా ఎన్నికల్లో ప్రచారం హోరెత్తించారు. పంటల అంచనా, భూరికార్డుల డిజిటలైజేషన్‌, విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల పిచికారీకి డ్రోన్లను బిజెపి సర్కారు ప్రోత్సహిస్తోంది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఆర్‌బికెల్లో డ్రోన్లు, యంత్రాలు అని మన రాష్ట్ర ప్రభుత్వం చెప్పేదీ కేంద్రం కనుసన్నల్లోనే. రాష్ట్రంలో ఇజ్రాయిల్‌ సాగుకు జైకొట్టారు సిఎం జగన్‌. గతంలో చంద్రబాబు ప్రయోగాత్మకంగా కుప్పంలో చేసిన ఇజ్రాయిల్‌ సాగులో రైతులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో తెలిసిందే.