
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రజాశక్తి దినపత్రిక వ్యవస్థాపక సంపాదకులు మోటూరు హనుమంతరావు స్మృత్యర్థం పాత్రికేయ రంగంలో ఉత్తమ కృషి చేసిన జర్నలిస్టులను సత్కరించేందుకు ఎంహెచ్ స్మారక ఉత్తమ జర్నలిస్టు అవార్డును నెలకొల్పి రెండు దశాబ్దాలు కావస్తున్నది. కోవిడ్ మహమ్మారి కారణంగా 2020, 2021 సంవత్సరాల్లో మినహా ప్రతి యేటా క్రమం తప్పకుండా ఈ పురస్కారాన్ని ప్రజాశక్తి సాహితీ సంస్థ అందజేస్తూ వస్తునుది. 2023సంవత్సరానికి ఉత్తమ జర్నలిస్టు అవార్డు కోసం ఎంట్రీలను ఆహ్వానిస్తున్నట్లు ప్రజాశక్తి సాహితీ సంస్థ కార్యదర్శి ఎంవిఎస్ శర్మ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి అధ్యక్షతన నాగార్జున యూనివర్సిటీ జర్నలిజం విభాగం అధిపతి ప్రొఫెసర్ జి అనిత, సీనియర్ జర్నలిస్టు నల్లి ధర్మారావులతో కూడిన త్రిసభ్య కమిటీ ఈ ఏడాది అవార్డు కోసం ఏదేని ప్రజా సమస్యపై రాసిన క్షేత్ర స్థాయి వార్తా కథనాలను, ఫీచర్స్‌ను ఎంట్రీలుగా ఆహ్వానించాలని నిర్ణయించింది. 2022 మే 1నుంచి 2023 ఏప్రిల్ 30లోపు తెలుగు దిన పత్రికల్లో, స్పెషల్స్‌లో ప్రచురితమైన వార్తా కథనాలు, ఫీచర్స్ మాత్రమే పంపాలి. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన జర్నలిస్టులు ఎంట్రీలు పంపవచ్చు. ఎంట్రీతోపాటు ఇది నా సొంత రచన, ఎవరినీ అనుకరించినది కాదు అని స్వీయ ధ్రువీకరణ పత్రం ఒకటి జతచేసి పంపాలి. తమకునచ్చిన మంచి సమస్యాత్మక కథనాన్ని ఇతరులైనా పంపవచ్చు. అచ్చయిన తేదీ, ఎడిషన్ వివరాలు జత చేయాలి. ఒక్కొక్కరు ఒకటి లేదా రెండు వార్తా కథనాలను మాత్రమే పంపాలి. ఎంట్రీలు 2023 జూన్ 10 కల్లా మాకు అందేట్లు చూడాలి. కవర్‌పై 'ఎంహెచ్ స్మారక ఉత్తమ జర్నలిస్టు అవార్డు-2023 కోసం' అని స్పష్టంగా పేర్కొనాలి. ఇ-మెయిల్ ద్వారా కూడా పంపవచ్చు. అవార్డు విజేతకు 2023 జూన్ మూడవ వారంలో పుట్టపర్తిలో జరిగే ఎంహెచ్ స్మారకోపన్యాస సభలో జ్ఞాపిక, రూ.10 వేలు నగదు ఇచ్చి సముచిత రీతిలో సత్కరించడం జరుగుతుంది. ప్రజాశక్తి సాహితీ సంస్థ, ప్రజాశక్తి భవనం, అమరారెడ్డి కాలనీ, తాడేపల్లి, గుంటూరు జిల్లా, పిన్: 522501 చిరునామాకు ఎంట్రీలు పంపాలని, ఇ-మెయిల్ [email protected] కు పంపాలని సంస్థ కార్యదర్శి ఎంవిఎస్ శర్మ కోరారు.